Posani Krishna Murali : ఇక జీవితంలో రాజకీయాలపై మాట్లాడను.. పోసాని కృష్ణమురళి కీలక నిర్ణయం-posani krishna murali announces that he will stay away from politics from now on ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Posani Krishna Murali : ఇక జీవితంలో రాజకీయాలపై మాట్లాడను.. పోసాని కృష్ణమురళి కీలక నిర్ణయం

Posani Krishna Murali : ఇక జీవితంలో రాజకీయాలపై మాట్లాడను.. పోసాని కృష్ణమురళి కీలక నిర్ణయం

Basani Shiva Kumar HT Telugu
Nov 21, 2024 07:21 PM IST

Posani Krishna Murali : పోసాని కృష్ణ మురళి కీలక నిర్ణయం తీసుకున్నారు. చచ్చిపోయేదాకా రాజకీయాలు గురించి మాట్లాడనని వెల్లడించారు. ఇకనుంచి రాజకీయాలకు దూరంగా ఉంటానన్న పోసాని.. జీవితంలో రాజకీయాలపై మాట్లాడబోనని స్పష్టం చేశారు. పోసాని నిర్ణయం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.

పోసాని కృష్ణమురళి
పోసాని కృష్ణమురళి

ఇన్నాళ్లు వైసీపీలో కీలకంగా వ్యవహరించిన పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు పోసాని కృష్ణమురళి గుడ్‌బై చెప్పారు. ఇకపై రాజకీయాల గురించి మాట్లాడబోనని స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పోసాని కృష్ణ మురళిని నియమించారు. అధికారంలో వైసీపీ అధికారం కోల్పోయాక పోసానిపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి.

'ఇక నుంచి నేను రాజకీయాలు మాట్లాడను. ఇక నుంచి ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదు. వైసీపీనే కాదు ఇప్పటి వరకు ఏ పార్టీలో నాకు సభ్యత్వం లేదు. ఏ పార్టీని పొగడను.. మాట్లాడను.. విమర్శించను.. నన్ను ఎవరూ ఏమనలేదు.. ఎవరి గురించి ఇక మాట్లాడను. ఓటర్‌ లాగే ప్రశ్నించా.. మంచి చేస్తే వాళ్లకి సపోర్ట్‌ చేశా. నా కుటుంబం, పిల్లల కోసం రాజకీయాలు వదిలేస్తున్నా' అని పోసాని కృష్ణమురళి స్పష్టం చేశారు.

సీఐడీ కేసు..

పోసాని కృష్ణమురళిపై ఇటీవల ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీ ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై పోసాని అసత్య ప్రచారం, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వంశీ ఫిర్యాదు చేశారు. పోసాని వ్యాఖ్యలు చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయన్నారు. వర్గాల మధ్య విభేదాలు తలెత్తెలా మాట్లాడిన పోసానిపై చర్యలు తీసుకోవాలని సీఐడీని కోరారు.

ఏళ్ల తరబడి పోసాని కృష్ణ మురళి చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడారు. చంద్రబాబు ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. పోసాని ఎక్కడ మాట్లాడినా.. ఎన్టీఆర్‌కు అన్యాయం చేశారని చెప్పేవారు. అటు పవన్ కళ్యాణ్‌పైనా పోసాని పలు సందర్భాల్లో సంచలన ఆరోపణలు చేశారు. 2019, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్‌కు మద్దతుగా పోసాని పని చేశారు. వైసీపీ ఓటమి తర్వాత సైలెంట్ అయ్యారు. తాజాగా.. రాజకీయాలకు గుడ్‌బై చెప్తూ.. నిర్ణయం తీసుకున్నారు.

Whats_app_banner