Welfare Pensions: పెన్షనర్లకు శుభవార్త.. రెండు నెలలు వరుసగా పెన్షన్ తీసుకోకున్నా మూడో నెలలో మొత్తం చెల్లిస్తారు
Welfare Pensions: ఏపీలో సామాజిక పెన్షన్‌దారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వివిధ కారణాలతో వరుసగా రెండు నెలల పాటు పెన్షన్ తీసుకోకపోయినా మూడో నెలలో బకాయిలతో కలిపి పెన్షన్ చెల్లిస్తారు. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అనుబంధ విభాగాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.
Welfare Pensions: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక భద్రతలో భాగంగా వృద్ధులు, వికలాంగులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక రోగులు, కళాకారులు, ట్రాన్స్‌జెండర్లు, ఒంటరి మహిళలకు పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో కీలక మార్పులు చేసింది. రకరకాల కారణాలతో పెన్షన్లను రద్దు చేస్తుండటంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటిని పరిష్కరించేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది.
ఇటీవలి క్యాబినెట్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అందులోభాగంగా సెర్ప్ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాబినెట్ నిర్ణయానికి అనుగుణంగా ఇకపై వరుసగా రెండు నెలల పాటు పెన్షన్లు తీసుకోకపోయినా మూడో నెలలో పెన్షన్ బకాయిలతో సహా చెల్లిస్తారు. ఈ మేరకు సెర్ప్, మెప్మా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. నవంబర్ 1 నుంచి చెల్లించే పెన్షన్లకు బకాయిలతో కలిపి చెల్లిస్తారు.
డిసెంబర్1న బకాయిలతో కలిపి పెన్షన్ విడుదల చేసి లబ్దిదారులకు అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పెన్షన్ పంపిణీ చేసే సమయంలో లబ్దిదారులు లేకపోతే పింఛనుదారులకు 3 నెలల వరకు పెన్షన్ బకాయిలు చెల్లిస్తారు. వారి పెన్షన్ యాక్టివ్‌గానే ఉంటుంది. బకాయిల చెల్లింపు 1 నవంబర్, 2024 నుండి అమలులోకి వస్తుంది. పాత బకాయి 1 డిసెంబర్, 2024 నుండి విడుదల చేస్తారు.
ఏ కారణం చేతనైనా పింఛనుదారుడు పింఛను తీసుకోకుంటే దానిని తాత్కాలిక వలసగా పరిగణిస్తారు. ఎవరైనా పెన్షనర్ ఒక నెలలో పింఛను (తాత్కాలిక వలస) తీసుకోకపోతే, 2వ నెలలో మొదటి నెల బకాయితోపాటు నెల పింఛను విడుదల చేస్తామన్నారు. 2వ నెల కూడా పింఛన్ తీసుకోలేదని, 3వ నెల పింఛను విడుదల చేస్తారు.
ఎన్టీఆర్ భరోసా కింద పింఛనుదారులకు సౌకర్యం కల్పించేందుకు రెండు నెలల బకాయిలతో పాటు పెన్షన్ పథకాన్ని అమలు చేయనున్నారు. పింఛనుదారులు 3 నెలలు నిరంతరంగా పింఛను తీసుకోకపోతే వారి పెన్షన్ నిలిపివేస్తారు. వారిని శాశ్వత వలసలు పరిగణించి వారి పెన్షన్ నిలిపివేస్తారు. అలాంటి వారు తమ పెన్షన్లను పునరుద్దరించుకునే అవకాశం ఉంటుంది. స్థానిక కార్యాలయాల్లో ఈ మేరకు పెన్షన్ పునరుద్దరించమని కోరవచ్చు. ఇలా రోల్‌బ్యాక్ చేసే పెన్షన్లకు ఎలాంటి బకాయిలు లేకుండా పెన్షన్ చెల్లిస్తారు.
BC, SC, ST, మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ, EBC మేనేజింగ్ డైరెక్టర్లు, కాపు, కమ్మ, క్షత్రియ, రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ కార్పొరేషన్లు పెన్షన్ బకాయిలు విడుదల చేయాలని సెర్ప్‌ను కోరినట్టు డైరెక్టర్ పేర్కొన్నారు. సెర్ప్ ద్వారా తిరిగి చెల్లించబడని పెన్షన్ మొత్తం నుండి బకాయిలను విడుదల చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. పెన్షన్ పంపిణీని పర్యవేక్షించి పించనర్లకు చెల్లించని పెన్షన్ మొత్తాన్ని నిర్ధారించాలని, పింఛను పంపిణీ ముగిసిన వెంటనే మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వానికి జమ చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రాజెక్ట్ డైరెక్టర్లు, డిఆర్‌డిఎలు పెన్షన్ పంపినీని పర్యవేక్షించాలని సెర్ప్ డైరెక్టర్ సూచించారు.
సంబంధిత కథనం