Janasena Vs Varma: పిఠాపురంలో ఏం జ‌రుగుతోంది?ఆధిప‌త్యం కోసం వ‌ర్మ‌, జ‌న‌సేన ఫైట్, ఫ్లెక్సీల చించివేత-what is happening in pithapuram varma and jana sena fight for supremacy ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Janasena Vs Varma: పిఠాపురంలో ఏం జ‌రుగుతోంది?ఆధిప‌త్యం కోసం వ‌ర్మ‌, జ‌న‌సేన ఫైట్, ఫ్లెక్సీల చించివేత

Janasena Vs Varma: పిఠాపురంలో ఏం జ‌రుగుతోంది?ఆధిప‌త్యం కోసం వ‌ర్మ‌, జ‌న‌సేన ఫైట్, ఫ్లెక్సీల చించివేత

HT Telugu Desk HT Telugu
Jun 10, 2024 08:13 AM IST

Janasena Vs Varma: పిఠాపురంలో ఆధిప‌త్యం కోసం టీడీపీ నాయకుడు వ‌ర్మ‌, జ‌న‌సేన శ్రేణుల మధ్య ఫైట్‌ జరుగుతోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఎంపి తంగెళ్ల ఉద‌య్ ప్లెక్సీలు చించి వేయడంతో రగడ కొనసాగుతోంది.

పిఠాపురంలో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య కొనసాగుతున్న రగడ
పిఠాపురంలో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య కొనసాగుతున్న రగడ

Janasena Vs Varma: పిఠాపురంలో భారీ మెజార్టీతో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఘ‌న విజ‌యం సాధించారు. ఎన్నికల ఫ‌లితాలు వెలువ‌డిన త‌రువాత నియోజ‌క‌ వ‌ర్గంపై ఆధిప‌త్యం కోసం టీడీపీ నేత వ‌ర్మ‌, జ‌న‌సేన నేత‌లు మ‌ధ్య అంత‌ర్యుద్ధం కొన‌సాగుతోంది.

జ‌న‌సేన త‌ర‌పున గెలిచిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలా నియోజ‌క‌వ‌ర్గంలో ఉండ‌రు క‌దా, తాను త‌న ఆధిప‌త్యాన్ని కొసాగించుకోవ‌చ్చ‌ని ప్ర‌య‌త్నించిన వ‌ర్మ‌కు జ‌న‌సేన నుంచి తీవ్ర ప్ర‌తిఘ‌ట‌న ఎదుర్కొంటున్నారు. దీంతో వ‌ర్మ‌పై దాడులు, జ‌న‌సేన‌, టీడీపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, కాకినాడ ఎంపి తంగెళ్ల ఉద‌య్ శ్రీ‌నివాస్ ప్లెక్సీలు చించివేత వంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో అస‌లు పిఠాపురం ఏం జ‌రుగుతోంద‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది.

నియోజ‌క‌వ‌ర్గంలో పొత్తులో భాగంగా స్థానిక టీడీపీ నేత వ‌ర్మ త‌న సీటుని త్యాగం చేసి ప‌వ‌న్ క‌ళ్యాణ్ గెలుపు కోసం ప‌ని చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం త‌న గెలుపును వ‌ర్మ చేతుల్లో పెడుతున్నాంటూ ఎన్నిక‌ల ప్ర‌చారం స‌భ‌ల్లో బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు. అందుక‌నుగుణంగానే ప‌వ‌న్ క‌ళ్యాణ్ గెలుపు కోసం వ‌ర్మ తీవ్రంగా కృషి చేశారు.

అయితే ఎన్నిక‌ల ముగిసిన త‌రువాత జ‌న‌సేన నిర్వహించిన మీడియా స‌మావేశానికి కూడా టీడీపీ నాయకుడు వ‌ర్మ‌ని పిల‌వ‌లేదు. అలాగే ప‌వ‌న్ గెలిచిన త‌రువాత వ‌ర్మ పేరును ఎక్క‌డ కూడా ప్ర‌స్తావించ‌క‌పోవ‌డంతో టీడీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో గొల్ల‌ప్రోలు మండ‌లం వ‌న్నెపూడిలో టీడీపీ నేత వ‌ర్మ‌పై జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు దాడి చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌లు ముగిసినా పార్టీల మ‌ధ్య గొడ‌వలు మాత్రం త‌గ్గ‌డం లేదు. టీడీపీ కూట‌మి గెలిచి ప‌ట్టుమ‌ని ప‌ది రోజులు కూడా గ‌డ‌వ‌లేదు. అప్పుడే టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. పిఠాపురంలో పాదగయా క్షేత్ర జంక్షన్ వద్ద ఉన్న పిఠాపురం ఎమ్మెల్యే జనసేన అధినేత ప‌వన్ కళ్యాణ్, కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్‌తో ఉన్నఫ్లెక్సీలు చింపివేశారు. దీంతో జ‌న‌సేన నేత‌లు టౌన్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం తాటిప‌ర్తి గ్రామంలోని అప‌ర్ణ‌దేవి ఆల‌య నిర్వ‌హ‌ణ క‌మిటీ బాధ్య‌త‌లు త‌మ‌కు కావాలంటే, త‌మ‌కు క‌వాల‌ని టీడీపీ, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ చోటు చేసుకుంది. ప‌ర‌స్ప‌రం ఒక‌రిపై మ‌రొక‌రు దాడి చేసుకున్నారు. దీనిపై జ‌న‌సేన పార్టీ రాష్ట్ర నాయ‌క‌త్వం కూడా స్పందించింది.

వ‌న్నెపూడిలో టీడీపీ నేత వ‌ర్మ‌పై జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు దాడి చేయండం, త‌రువాత తాటిప‌ర్తిలో ఆల‌య నిర్వ‌హ‌ణ కోసం రెండు పార్టీలు మ‌ళ్లీ గొడవ ప‌డుతుండ‌టంతో ఎప్పుడు ఏం జ‌రుగుతోందోన‌ని నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న నెల‌కొంది.

పిఠాపురం నియోజ‌కవ‌ర్గంలో జ‌న‌సేన వ‌ర్సెస్ టీడీపీ ఇన్‌ఛార్జ్ వ‌ర్మ అన్న‌ట్లుగా వ్య‌వ‌హారం ముదురుతోంది. ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌క‌ముందే, ఎమ్మెల్యేలు బాధ్య‌త‌లు స్వీక‌రించ‌క ముందే సోష‌ల్ మీడియా వేదిక‌గా రెండు పార్టీలు చేస్తున్న విమ‌ర్శ‌, ప్ర‌తి విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో కూట‌మి నేత‌ల మ‌ధ్య త‌గాదా ఏ ప‌రిణామాల‌కు దారి తీయనుందోన‌ని చర్చ జ‌రుగుతోంది.

సోష‌ల్ మీడియా వేదికగా ఆరోప‌ణ‌లు

కాకినాడ వైసీపీ మాజీ ఎమ్మెల్యేతో టీడీపీ నేత వ‌ర్మ చేతులు క‌లిపార‌ని, భారీగా సొమ్ములు తీసుకున్నార‌ని జ‌న‌సేన సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆరోపిస్తుంది. దీనికి దీటుగానే టీడీపీ వ‌ర్మ అనుచ‌రులు కూడా ఎదురుదాడికి దిగుతున్నారు. ఎన్నిక‌ల్లో సీటు త్యాగం చేసి ప‌వ‌న్ క‌ళ్యాణ్ విజ‌యానికి అహ‌ర్నిశ‌లు శ్ర‌మించిన వ‌ర్మ‌పై ఇటువంటి ఆరోప‌ణలు చేయ‌డం త‌గ‌ద‌ని వ‌ర్మ అనుచ‌రులు పేర్కొంటున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో వ‌ర్మ‌ను క‌ట్ట‌డి చేసేందుకు, ఎంఎల్‌సి అవ‌కాశం ద‌క్కకుండా చేసేందుకు జ‌న‌సేన కీల‌క నేత‌లు కుట్ర‌పూరితంగా ఇలాంటి విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.

పిఠాపురం బాధ్యత మర్రెడ్డిదేనంటోన్న జనసేన..

పిఠాపురం నియోజ‌వ‌క‌ర్గంలో జ‌న‌సేన త‌ర‌పున మొత్తం చూసుకునేది అన‌ప‌ర్తికి చెందిన‌ మ‌ర్రెడ్డి శ్రీ‌నివాస్ అని జ‌న‌సేన ప్ర‌క‌టన విడుద‌ల చేసింది. పిఠాపురంలో వ‌న్నెపూడి, తాటిప‌ర్తి గ్రామాల్లో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌ల‌పై వివ‌రాలు సేక‌రిస్తున్నామ‌ని, పార్టీకి సంబంధించిన వ్య‌క్తులు ఉన్న‌ట్లు తేలితే చ‌ర్యలు తీసుకుంటామ‌ని జ‌న‌సేన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.నాగ‌బాబు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అయితే ఇప్ప‌టికే అధికారులు త‌న‌కు అన్ని వివ‌రాలు తెల‌పాల‌ని వ‌ర్మ హుకుం జారీ చేసిన‌ట్లు తెలిసింది. వ‌ర్మ ఎత్తుగ‌డ‌ల‌ను చిత్తు చేసేందుకు జ‌న‌సేన మ‌ర్రెడ్డి శ్రీ‌నివాస్ రంగంలో దింపింది. ఆయ‌న ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గ కోఆర్డినేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు.

(రిపోర్టింగ్‌ జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

సంబంధిత కథనం