AP Political Trolls: గీతాంజలి సరే.. మిగిలిన వారికి న్యాయం దక్కేనా..! ట్రోల్ మూకలకు అడ్డు కట్ట వేయాల్సింది ఎవరు?
AP Political Trolls: ఏపీ రాజకీయాల్లో గీతాంజలి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా ట్రోలింగ్స్ భరించలేక తెనాలిలో వివాహిత ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచి వేసింది. ఆమె మరణానికి బాధ్యులెవరు?
AP Political Trolls: ఇంటి పట్టా అందుకున్న సంతోషంలో ఓ యువతి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురి కావడంతో ఆమె రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం ఏపీలో చర్చగా మారింది.
అధికార, విపక్షాల మధ్య సోషల్ మీడియా వార్‌కు అమాయకురాలు బలైపోయింది. సొంతింటి కల నెరవేరిన సంతోషంలో మీడియా ముందు మాట్లాడిన మాటల్ని విపరీతార్థాలతో ట్రోల్ చేయడంతో మనస్తాపానికి గురైందని మృతురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
మార్చి 4వ తేదీన తెనాలిలో జరిగిన కార్యక్రమంలో గీతాంజలి అనే యువతి ఇంటి పట్టాను అందుకుంది. ఈ సందర్భంగా తనకు జరిగిన మేలు గురించి ఇంటర్వ్యూ ఇస్తూ ఉద్వేగానికి గురైంది. తమ కుటుంబంలో జరిగిన మేలును మీడియా ముందు చెప్పింది. ఆ తర్వాత రెండ్రోజులకు ఆమె వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి.
గీతాంజలి అనుకూలంగా కొందరు ప్రచారం చేస్తే, ఆమెను ట్రోల్ చేస్తూ కించపరుస్తూ మరికొన్ని ముసుగు ముఖాలు చెలరేగిపోయాయి. ప్రభుత్వం ద్వారా పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలను రకరకాల రూపాల్లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై ప్రచారం చేయడం, దానికి కౌంటర్ ఇచ్చే క్రమంలో ప్రత్యర్థులు పెడర్థాలతో ట్రోల్ చేయడం ఏపీలో సాధారణం అయిపోయింది.
ముఖ్యమంత్రి సంతాపం
తెనాలి యువతి గీతాంజలి ఆత్మహత్య ఘటనపట్ల ముఖ్యమంత్రి వైయస్.జగన్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురించేసిందని సీఎం అన్నారు. గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ కూడా చట్టం వదిలిపెట్టదని ముఖ్యమంత్రి అన్నారు.
అందరికీ న్యాయం జరిగేనా...
ఏపీలో రాజకీయాలకు మహిళలే మొదటి టార్గెట్ అవుతున్నారు. దాదాపు దశాబ్ద కాలంగా ఈ తరహా విపరీత ధోరణి కేవలం ఏపీ రాజకీయాల్లో మాత్రమే కనిపిస్తోంది. ప్రత్యర్థుల్ని మానసికంగా కుంగదీయడానికి, వ్యక్తిత్వ హననాలకు సోషల్ మీడియా వేదికగా మారుతోంది. ఈ క్రమంలో వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఏ రాజకీయ పార్టీ చొరవ చూపడం లేదు. సొంత కుటుంబ సభ్యులు ఈ తరహా ట్రోలింగ్‌లకు గురవుతున్నా ముఖ్యమైన వ్యక్తులు సైతం వాటిపై చర్యలు తీసుకోలేకపోతున్నారు.
మొదటి బాధితురాలు షర్మిల...
కాంగ్రెస్ పార్టీని వీడి వేరు కుంపటి పెట్టుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయన తరపున జగనన్న వదిలన బాణాన్ని అంటూ జగన్ సోదరి షర్మిల పాదయాత్ర చేపట్టారు. ఏపీలో వందల కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు.
సరిగ్గా ఆ సమయంలోనే సోషల్ మీడియాలో ఆమెపై విపరీతమైన దాడి జరిగింది. జగన్‌మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే క్రమంలో ప్రత్యర్థులకు షర్మిల తేలికపాటి టార్గెట్ అయ్యారు. ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ విపరీతమైన దుష్ప్రచారం జరిగింది. దీనిని ఖండిస్తూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకోవాల్సి వచ్చింది.
ఆ తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో ఇవి సాధారణం అయిపోయాయి. ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న నేతల కుటుంబాల్లో మహిళలంతా ఏదొక సమయంలో సోషల్ మీడియా బారిన పడ్డారు. ముఖ్యమంత్రి సతీమణి వైఎస్.భారతి, YS Bharati తల్లి విజయమ్మ, సోదరి షర్మిల Sharmila, వివేకానందరెడ్డి కుమార్తె సునీత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి Bhuvaneswari , కోడలు బ్రహ్మణి brahmani, టీడీపీ నాయకురాలు అనిత, పవన్ కళ్యాణ్ కుటుంబంలో మహిళలు గత కొన్నేళ్లలో ఏదొక సందర్భంలో ట్రోలింగ్‌కు గురయ్యారు.
ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో తరచూ వీరంతా అవమానాలకు గురవుతూనే ఉంటారు. మీమ్స్ పేరుతో అసభ్యకరంగా వారిని చిత్రీకరించే ప్రయత్నాలకు అడ్డుకునే వారే లేకుండా పోయారు. రాజకీయ నాయకులు స్వయానా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
తేలికపాటి లక్ష్యాలుగా మహిళలు…
రాజకీయ విమర‌్శల్ని ఎదుర్కొనే క్రమంలో వారి వ్యక్తిత్వాలను కించపరిచేలా దుష్ప్రచారాలు జరుగుతున్నా వాటికి అడ్డుకట్ట వేసే చర్యలు మాత్రం కొరవడ్డాయి. ఈ తరహా ట్రోలింగ్ ముఠాలను అన్ని రాజకీయ పార్టీలు పెంచి పోషిస్తున్నాయనే అపవాదు ఉంది. రాజకీయ ప్రచారాల కోసం ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ సైన్యాలు ఎదుటి వారిని మానసికంగా దెబ్బతీయడం కోసం నిరంతరం దుష్ప్రచారాలు, అసత్యాలపై ఆధారపడుతుంటాయి.
రాజకీయ పార్టీల ప్రచారాల కోసం సొంతంగా నడుపుకుంటున్న డిజిటల్ సైన్యాలు ముసుగు ముఖాలతో నకిలీ ఖాతాలతో ఫేస్‌బుక్, ట్విట్టర్లలో చెలరేగిపోతున్నాయి. మహిళలపై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న వారిలో ఆయా పార్టీలకు చెందిన మహిళలు కూడా ఉండటం గమనార్హం. మహిళలకు చెందిన ఖాతాల నుంచి ఈ తరహా ట్రోల్స్ చేస్తున్నా ఏ రాజకీయ పార్టీ వాటిని ఖండించిన దాఖలాలు లేవు.
నిఘా లేదు, కట్టడి అసలే లేదు…
దొంగ ఖాతాలతో ప్రత్యర్థి పార్టీలకు చెందిన మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, అసభ్యంగా చిత్రీకరించడం, వారి వ్యక్తిగత జీవితాలపై బురద చల్లడం ద్వారా పైశాచిక ఆనందం పొందే ముఠాలను కట్టడి చేయడానికి పోలీస్ శాఖ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
ఈ తరహా ఉదంతాలపై మొదట్లోనే ఉక్కు పాదం మోపి ఉంటే గీతాంజలి వంటి ఘటన జరిగి ఉండేది కాదు. ఏపీలో మహిళలపై జరుగుతున్నంతగా సోషల్ మీడియా దాడులు ఇతర రాష్ట్రాల్లో పెద్దగా కనిపించవు. సోషల్ మీడియాలో ముసుగు ముఖాలతో మహిళలపై దాడులు చేసే వారిని తేలిగ్గానే గుర్తించే అవకాశం ఉన్నా అలాంటి వారిపై తమకు తాముగా పోలీసులు చర్యలు తీసుకున్న సందర్భం ఒక్కటి కూడా లేదు.
మహిళల భద్రత,రక్షణ కోసం ఏపీలో దిశ పేరిట ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఫోన్‌లో బటన్ నొక్కితే ప్రత్యక్షం అవుతామని పోలీస్ శాఖ గర్వంగా చెప్పుకుంటుంది. బహిరంగంగా సోషల్ మీడియా వేదికలపై చెలరేగిపోతున్న వారిని కట్టడి చేసే విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తుంటుంది.
సంబంధిత కథనం