Drones In Agriculture : చిత్తూరు జిల్లాకు 93 డ్రోన్లు.. పైలెట్ రైతులకు ట్రైనింగ్
Rythu Bharosa Kendram : డ్రోన్లతో వ్యయసాయం అనే మాట ఎప్పటి నుంచో వింటున్నాం. ఇతర దేశాల్లో ఉంది.. మన దగ్గరకు ఎప్పుడు వస్తుందా అని చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మన రాష్ట్రంలోకి వచ్చింది. తాజాగా చిత్తూరు జిల్లాకు 93 డ్రోన్లను ప్రభుత్వం కేటాయించింది.
చిత్తూరు జిల్లాలో డ్రోన్లను పంపిణీ చేసేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. మెుదట పంటలపై పురుగు మందులు స్ప్రే చేసేందుకు వినియోగంలోకి తెస్తారు. జిల్లాలో 93 డ్రోన్లను కేటాయించారు. వీటిని రుణంపై రైతు సంఘాలకు మంజూరు చేస్తున్నారు. వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చడానికి డ్రోన్‌లను ఉపయోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది.
చిత్తూరు జిల్లాలో రైతు భరోసా కేంద్రాలకు(ఆర్‌బీకే) అనుబంధంగా ఉన్న రైతులకు ప్రభుత్వం 93 డ్రోన్‌లను మంజూరు చేసింది. అంటే ఒక్కో మండలంలో మూడు డ్రోన్లు అందుబాటులోకి రానున్నాయి. డిప్లొమా చేసినవారు లేదా 10 + 2 అర్హత ఉన్నవారిని పైలట్ రైతులుగా నియమిస్తారు. పంటలకు ఎరువులు, పురుగుమందుల వంటి వ్యవసాయ ఇన్‌పుట్‌లను వర్తింపజేయడానికి డ్రోన్‌ల ఆపరేషన్‌లో వారికి శిక్షణ ఇస్తారు.
ప్రతి RBKలో డ్రోన్ హైరింగ్ సెంటర్ ఉంటుంది. రైతులు తమ వ్యవసాయ కార్యకలాపాల కోసం డ్రోన్‌లను ఉపయోగించేందుకు దీనిని సంప్రదించవచ్చు. భవిష్యత్తులో పురుగుమందులు పిచికారీ, ఎరువుల వాడకంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తాయి. రసాయన మితిమీరిన వినియోగాన్ని అరికట్టడంలో సహాయపడతాయి. ఇవి రైతులకు ఖర్చులను తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా, పంటలను అంచనా వేయడానికి, భూ రికార్డుల డిజిటలైజేషన్‌కు డ్రోన్‌లు ఉపయోగపడతాయి.
ఒక్కో డ్రోన్‌కు రూ.10 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇందులో రైతులకు 40 శాతం సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది. మిగిలిన డబ్బు బ్యాంకు రుణాల ద్వారా ఏర్పాటు చేస్తారు. డ్రోన్ల మంజూరు కోసం ఈ నెలాఖరులోగా రైతు సంఘాలను ఏర్పాటు చేస్తారు. ఒక్కో గ్రూపు నుంచి ఒక పైలట్ రైతును ఎంపిక చేసి డ్రోన్‌ల ఆపరేషన్‌లో శిక్షణ ఇస్తారు. ఎరువులు, పురుగుమందుల సక్రమ వినియోగంపై వారికి అవగాహన కల్పిస్తారు. కొనుగోలు చేసిన తర్వాత పైలట్ రైతులకే డ్రోన్‌లను కేటాయిస్తారు. రైతులు ఈ డ్రోన్‌లను ఆర్‌బీకేల నుంచి తక్కువ ధరకు అద్దెకు తీసుకోవచ్చు.
డ్రోన్‌లను ఉపయోగించే విధానంపైన ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శిక్షణ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. ఈ విధంగా రైతు గ్రూపులను ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇప్పించి వ్యవసాయ రంగంలో ఆధునిక మార్పులను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చూస్తోంది. వీటి ద్వారా చిత్తూరు జిల్లాలోని ప్రధాన ఉద్యాన పంటలు అయిన మామిడి, టమోటా, వరి ఇతర వాణిజ్య పంటలకు పురుగుమందులను పిచికారీ ఈజీగా చేయోచ్చు. ఒక్కో డ్రోన్ ఇచ్చే చోట ఉపయోగించాల్సిన విస్తీర్ణం కూడా ప్రభుత్వం నిర్ధిష్టంగా చెబుతుంది. ఇందులో భాగంగానే 31 మండలాలు ఉన్న చిత్తూరు జిల్లాకు 93 డ్రోన్లు ఇస్తున్నారు.