CM Jagan | ఆర్బీకేల్లో డ్రోన్లు.. నిర్వహణకు గ్రామాల్లోనే వ్యవస్థ ఏర్పాటు
కొవిడ్ లాంటి విపత్కార పరిస్థితుల్లోనూ.. రైతులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచిందని సీఎం జగన్ అన్నారు. బ్యాంకులు, నాబార్డ్ చేస్తున్న సాయం గొప్పదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని పలు కార్యక్రమాలకు నాబార్డ్, బ్యాంకులు సాయం చేస్తున్నాయన్నారు.
తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాబార్డ్ వార్షిక రుణ ప్రణాళికపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ సమీక్షలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నాబార్డ్ ఛైర్మన్ జీఆర్ చింతల.. తదితరులు ఉన్నారు.
రైతు భరోసా కేంద్రాల స్థాయిలోనే డ్రోన్లను అందుబాటులోకి తెస్తామని సీఎం జగన్ అన్నారు. అందుకోసం గ్రామస్థాయిలో ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి.. నిర్వహణను అప్పజెప్పుతామన్నారు. వ్యవసాయం రంగంలో టెక్నాలజీపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చిందని.. జగన్ అన్నారు. ఇప్పుడు నానో ఎరువులు ఉపయోగించే.. యుగంలో ఉన్నామని తెలిపారు.
2022-23 సంవత్సరానికి సంబంధించి రూ.2.54 లక్షల కోట్లతో రూపొందించిన నాబార్డు రుణ ఫోకస్ పేపర్ ను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నా బార్డు, బ్యాంకులు చేస్తున్న సాయాన్ని సీఎం కొనియాడారు. సహకార బ్యాంకులు, సహకార సంఘాలను ఆధునికీకరిస్తున్నట్టు సీఎం చెప్పారు. ఆర్‌బీకేల్లోని బ్యాంకింగ్ కరస్పాండెంట్లే బ్యాంకులు, సహకార సంఘాలకు అనుసంధాన కార్యకర్తలుగా వ్యవహరిస్తారని తెలిపారు. రైతుల ఉత్పత్తుల విషయంలో బ్యాంకుల సహకారం చాలా కావాలని.. తెలిపారు. అదనపు విలువ జోడించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో కరవు నివారణపై ప్రభుత్వం దృష్టిపెట్టినట్టు.. ఉపాధి కల్పనపైనా చర్యలు తీసుకుంటామన్నారు.
‘ఆర్బీకేల స్థాయిలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో గణనీయంగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం. గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీల్లాంటివి ఏర్పాటు చేస్తున్నాం. పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. దీనికి నాబార్డు సహాయ సహకారాలు కావాలి. రైతులు చేస్తున్న ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడానికే ఇవన్నీ చేస్తున్నాం. సహకార బ్యాంకులను, సొసైటీలను బలోపేతం చేస్తున్నాం. పారదర్శక విధానాలను తీసుకువస్తున్నాం.’ అని సీఎం జగన్ అన్నారు.
టాపిక్