Jagan security : జగన్ సెక్యూరిటీ ఎంత మంది..? ఈ ఇష్యూ హైకోర్టు వరకు ఎందుకు వెళ్లింది.. ముఖ్యమైన 10 అంశాలు ఇవే..
Jagan security : ప్రస్తుతం ఏపీలో జగన్ సెక్యూరిటీ గురించి చర్చ జరుగుతోంది. అందుకు కారణం.. హైకోర్టులో ఆయన భద్రత గురించి వాదనలు జరగడమే. అయితే.. సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వం ఏం చెబుతోంది.. జగన్ ఏమంటున్నారు అనే చర్చ జరుగుతోంది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్ రెడ్డి ఇటీవల ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ఎంత మంది భద్రత సిబ్బందిని నియమించారో.. ఇప్పుడు కూడా అంతమందిని దానిని పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీనిపై తాజాగా విచారణ జరిగింది. ఈ పిటిషన్‌కు సంబంధించి ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది.
1.జగన్ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఐపీఎస్ అధికారి ఎస్ఎన్ విశ్వనాథ్ కౌంటర్ దాఖలు చేశారు. ఎల్లో బుక్ మార్గదర్శకాల ప్రకారం.. జడ్‌ప్లస్ కేటగిరి వ్యక్తికి 58 మంది భద్రత సిబ్బందిని ఇస్తారని కౌంటర్‌లో వివరించారు.
2.జగన్ తన ప్రభుత్వ హయాంలో 2023లో తీసుకొచ్చిన ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ చట్టం ప్రకారం.. జడ్‌ప్లస్ భద్రత సిబ్బందికి అదనంగా సిబ్బందిని కల్పించారని విశ్వనాథ్ వివరించారు.
3.ఎన్నికల్లో జగన్ పరాజయం పాలవడంతో.. సీఎం పదవి కోల్పోయారని.. అదనపు భద్రత సిబ్బందిని పొందే విషయంలో జగన్, ఆయన కుటుంబ సభ్యులకు 2023లో తెచ్చిన చట్టం వర్తించదని ఐపీఎస్ అధికారి కోర్టుకు వివరించారు.
4.అదనపు భద్రత సిబ్బందిని పొందడానికి జగన్, ఆయన కుటుంబం అనర్హులని విశ్వనాథ్ కోర్టుకు వివరించారు. సీఎం నుంచి ఎమ్మెల్యే స్థాయికి మారినప్పటికీ.. జగన్‌కు ఈ ఏడాది జులై 20 వరకు గతంలో ఇచ్చిన భద్రతనే కొనసాగించామని కౌంటర్‌లో స్పష్టం చేశారు.
5.రాష్ట్రస్థాయి ప్రత్యేక సెక్యూరిటీ రివ్యూ కమిటీ.. జులైలో సమావేశం నిర్వహించింది.. కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యే, ఎంపీల స్థాయి ఆధారంగా భద్రతను కల్పించాలని సిఫారసు చేసిందని విశ్వనాథ్ కోర్టుకు వివరించారు.
6.ఎమ్మెల్యేగా జగన్ 1+1 భద్రత పొందేందుకు అర్హులని ప్రభుత్వం కౌంటర్‌లో స్పష్టం చేసింది. గతంలో మాదిరిగా జడ్‌ప్లస్ భద్రత, బుల్లెట్ రెసిస్టెంట్ అలాగే కొనసాగుతోందన్నారు. మూడు షిఫ్ట్‌లలో ఇద్దరు పర్సనల్ సెక్యూరిటీ అధికారులు భద్రత పర్యవేక్షణను చూస్తున్నారని కోర్టుకు వివరించారు.
7.వీఐపీల భద్రతను కేవలం విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సంఖ్యను బట్టి చూడకూడదని.. భద్రత విధుల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో దోహదపడుతోందని విశ్వనాథ్ కౌంటర్‌లో వివరించారు. 2014లో నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి సీఎం పదవి నుంచి త్పపుకున్నాక.. వై కేటగిరి సెక్యూరిటీ మాత్రమే పొందుతున్నారని కౌంటర్‌లో వివరించారు.
8.ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై రిప్లై కౌంటర్ వేసేందుకు సమయం కావాలని.. మాజీ సీఎం జగన్ తరఫు న్యాయవాది సుమన్ కోరారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్‌ఎన్ చక్రవర్తి.. విచారణను సెప్టెంబర్ వాయిదా వేశారు.
9.ఎన్నికల ముందు జగన్‌పై జరిగిన దాడి, గతంలో విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడి గురించి వివరిస్తూ.. రిప్లై ఇచ్చే అవకాశం ఉంది. జగన్ ఇటీవల ఎక్కడికి వెళ్లినా.. క్రౌడ్ ఎక్కువగా వస్తున్నారని కోర్టుకు వివరించే అవకాశం ఉంది. అయితే.. జగన్ తరఫు లాయర్ వేసే కౌంటర్ రిప్లై పై ఆసక్తి నెలకొంది.
10.ఇటీవల జగన్ సెక్యూరిటీపై హోంమంత్రి అనిత కూడా స్పందించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 900 మంది పైగా భద్రతా సిబ్బంది ఉండేవారని వివరించారు. దీనివల్ల కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు అయ్యేదని చెప్పారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదని.. అందుకే భద్రత తగ్గించినట్టు వివరించారు.