MLA Video : ఎమ్మెల్యే ఆదిమూలంపై ఫిర్యాదు చేసిన బాధిత మహిళ.. తిరుపతి ఈస్ట్‌ పీఎస్‌లో కేసు నమోదు-case against mla adimulam in tirupati east ps in sexual video affair ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mla Video : ఎమ్మెల్యే ఆదిమూలంపై ఫిర్యాదు చేసిన బాధిత మహిళ.. తిరుపతి ఈస్ట్‌ పీఎస్‌లో కేసు నమోదు

MLA Video : ఎమ్మెల్యే ఆదిమూలంపై ఫిర్యాదు చేసిన బాధిత మహిళ.. తిరుపతి ఈస్ట్‌ పీఎస్‌లో కేసు నమోదు

Basani Shiva Kumar HT Telugu
Sep 06, 2024 02:38 PM IST

MLA Video : సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమాలంపై తిరుపతి ఈస్ట్ పీఎస్‌లో కేసు నమోదైంది. బాధిత మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. తనను లైంగికంగా వేధించారని టీడీపీకి చెందిన మహిళా నాయకురాలు వీడియోలు విడుదల చేశారు. చంద్రబాబుకు లేఖ కూడా రాశారు.

ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం
ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం (X)

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై తిరుపతి ఈస్ట్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. ఆదిమూలంపై బాధిత మహిళ ఫిర్యాదు చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతిలోని భీమాస్‌ ప్యారడైజ్‌ హోటల్‌లో.. తనపై అత్యాచారం చేసినట్టు బాధితురాలు ఫిర్యాదు చేశారు. దీంతో హోటల్ సీసీ ఫుటేజ్‌‌ను పోలీసులు సేకరించారు.

వీడియో సంచలనం..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక కార్యకలాపాల వీడియో సంచలనంగా మారింది. ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి.. ఎమ్మెల్యే‌గా గెలిచిన కోనేటి ఆదిమూలం లైంగిక కార్యకలాపాల వీడియోతో దొరికిపోయాడు. ఎమ్మెల్యే తనపై చేసిన అఘాయిత్యానికి సంబంధించిన వీడియోను.. బాధితురాలు తాజాగా విడుదల చేసింది. ఈ వీడియో ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై బాధితురాలు టీడీపీ చీఫ్ చంద్రబాబుకు లేఖ రాసింది.

చంద్రబాబుకు లేఖ..

'నేను తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలిని. నా వయస్సు 36 సంవత్సరాలు. నాకు భర్త గిరిబాబు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నేను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి మహాలక్ష్మి, యువగళం, బాబుతో నేను, బాదుడే బాదుడు, సూపర్ సిక్స్, ధర్నాలు, నిరసనలు వంటి కార్యక్రమాలను అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేశాను. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేశాను' అని వివరించారు.

ఆదిమూలంపై వ్యతిరేకతతో..

'కోనేటి ఆదిమూలంను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడాన్ని నేను గట్టిగా వ్యతిరేకించాను. బీఫాం ఇవ్వొద్దని చెప్పాను. అయినా ఆయనకు బీఫాం ఇచ్చిన తర్వాత పార్టీ ఆదేశాలతో.. అన్ని మండలాల మహిళలు, పార్టీ నాయకులను కలుపుకొని చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం కోసం ఆహర్నిశలు కృషి చేశాను. ఆదిమూలం ఎమ్మెల్యే అయ్యాక నాపై కక్షగట్టారు. అసభ్యంగా ప్రవర్తిస్తూ.. సెక్స్ చేయాలని ఒత్తడి చేశారు. నేను తప్పించుకుంటూ వచ్చాను' అని బాధితురాలు వివరించారు.

కోరిక తీర్చాలని..

'ఆదిమూలం తన కోరికను తీర్చాలని నన్ను బెదిరించాడు. ఈ వేధింపులు భరించలేక.. 06-07-2024 తేదీన తిరుపతి భీమాస్ ప్యారడైజ్‌లోని రూమ్ నంబర్ 109కి సాయంత్రం 4 గంటలకు, 17-07-2024 తేదీన రూమ్ నంబర్ 105కి మధ్యాహ్నం 3 గంటలకు ఆదిమూలం నన్ను లైంగికంగా చెరిచినాడు. ఆ తర్వాత అర్ధరాత్రి, ఎప్పుడుపడితే అప్పుడు ఫోన్లు చేసి టార్చర్ చేశాడు' అని బాధితురాలు లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

భర్తకు చెప్పడంతో..

'ఎమ్మెల్యే పదే పదే ఫోన్లు చేయడాన్ని నా భర్త గమనించారు. ఎమ్మెల్యేతో అర్ధరాత్రి ఏం ఫోన్లు.. అతనితో నీకు ఏం పని అని గట్టిగా గద్దించారు. నేను నా భర్తకు జరిగిన విషయాన్ని చెప్పాను. నా భర్త సూచనల ప్రకారం.. ఆదిమూలంకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఎమ్మెల్యే మళ్లీ పిలిచినప్పుడు పెన్ కెమెరాతో భీమాస్ ప్యారడైజ్ రూమ్ నంబర్ 105కి వెళ్లాను. అతని కామ క్రీడలను పెన్ కెమెరాలో బంధించి నా భర్తకు అప్పగించాను. కావున ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకొని.. నా కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతున్నాను' అని బాధితురాలు చంద్రబాబుకు లేఖ రాశారు. దీంతో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.