YCP Lella Appi Reddy : టీడీపీ ఆఫీసుపై దాడి కేసు - వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌-mlc lella appi reddy arrested in tdp office attack case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ycp Lella Appi Reddy : టీడీపీ ఆఫీసుపై దాడి కేసు - వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌

YCP Lella Appi Reddy : టీడీపీ ఆఫీసుపై దాడి కేసు - వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 05, 2024 05:33 PM IST

టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో మంగళగిరి పోలీసులు దూకుడు పెంచారు. ఉదయం మాజీ ఎంపీ సురేశ్ ను అదుపులోకి తీసుకోగా... తాజాగా వైసీపీ ఎమ్మెల్యే లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్ చేశారు. మరికొంత మంది నేతలను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌

టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో అరెస్టులపర్వం కొనసాగుతోంది. ఇవాళ ఉదయం మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరికొంత మంది వైసీపీ నేతలు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారంలో వైసీపీ నేతలు తలశిల రఘురాం, దేవినేని అవినాష్‌, నందిగం సురేష్‌, లేళ్ల అప్పిరెడ్డి సహా ఇతర నేతలు హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కూడా జోగి రమేశ్ తో పాటు మరికొంత మంది నేతల పేర్లు ఉన్నాయి. ఈ కేసులో  జోగి రమేశ్ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ రెండు ఘటనల్లో నిందితులపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలో హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణ పూర్తైన నేపథ్యంలో తాజాగా వారి పిటిషన్లను రిజెక్ట్‌ చేస్తున్నట్టు హైకోర్టు తీర్పునిచ్చింది.

హైకోర్టు తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టు సూచనల ప్రకారం నిందితులపై రెండు వారాల పాటు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని వైసీపీ నేతలు అభ్యర్థించారు. రెండు వారాల పాటు గడువు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని హైకోర్టు పిటిషనర్లకు తెలిపింది. ఆ తర్వాత పిటిషన్లను పరిశీలించిన న్యాయస్థానం వాటికి తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు.

ఈ క్రమంలోనే ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, వైసీపీ నాయకులు దేవినేని అవినాశ్, నందిగం సురేష్, ఆ పార్టీ కార్యకర్తలు జి.రమేష్‌, షేక్ రబ్బానీ భాషా, చిన్నాబత్తిన వినోద్ కుమార్‌ సహా మరికొందరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు బుధవారం నిరాకరించింది.  ఈ క్రమంలోనే మంగళగిరి పోలీసులు దూకుడు పెంచారు. కేసుల్లో ఉన్న నేతలను అదుపులోకి తీసుకుని విచారించనున్నారు.

మరోవైపు మాజీ మంత్రి జోగిరమేష్‌ను కూడా అరెస్ట్ భయం వెంటాడుతోంది. చంద్రబాబు విపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన ఇంటిపై జరిగిన దాడి కేసులో జోగి రమేష్‌తో పాటు 13మందికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు జస్టిస్ వీఆర్‌కే కృపా సాగర్‌ బుధవారం తీర్పునిచ్చారు.

సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకోడానికి వీలుగా అరెస్టుల నుంచి రక్షణ కోసం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని చేసిన అభ్యర్థను కూడా కోర్టు తిరస్కరించింది. చంద్రబాబు నివాసం వద్ద ధర్నా పేరుతో హింసాత్మక చర్యలకు పాల్పడటాన్ని అమోదించలేమని న్యాయమూర్తి పేర్కొన్నారు. అక్కడకు వచ్చిన వారు ధర్నా పేరుతో ప్రతిపక్ష నాయకుడిని లక్ష్యంగా చేసుకున్నారని అభిప్రాయపడ్డింది.

టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో విజయవాడ డిప్యూటీ మేయర్ అవుతూ శైలజా రెడ్డి భర్త శ్రీనివాసరెడ్డిని పోలీసులు సింగ్‌నగర్‌లో అదుపులోకి తీసుకున్నారు. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే నిందితుల కోసం పోలీసులు రంగంలోకి దిగారు. 

ఉదయం మాజీ ఎంపీ అరెస్ట్

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్‌ను ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. బుధవారం ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఏపీ హైకోర్టు నిరాకరించడంతో.. సాయంత్రం నుంచి వేట మొదలైంది. నందిగం సురేష్‌ ఉద్దండరాయుని పాలెంలోని నివాసంలో అందుబాటులో లేకపోవడంతో.. ఆయన అచూకీ కోసం గాలించారు. హైదరాబాద్ మియాపూర్‌లో ఉన్నట్టు గుర్తించిన మంగళగిరి గ్రామీణ పోలీసులు.. అక్కడి పోలీసుల సహకారంతో అరెస్ట్‌ చేశారు. 

తాజాగా ఎమ్మెల్సీ అప్పిరెడ్డిని కూడా అరెస్ట్ చేయటంతో మరికొంత మంది నేతలను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఉత్కంఠగా మారింది.

టాపిక్