Kolleru Flood: విజయవాడలో వరద తగ్గినా కొల్లేరు కోలుకోవడం కష్టమే,కొందరి స్వార్థానికి మూల్యం చెల్లిస్తున్న లక్షలాది ప్రజలు-even if the flood in vijayawada recedes it will be difficult for kolleru to recover if it recedes here it will increas ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kolleru Flood: విజయవాడలో వరద తగ్గినా కొల్లేరు కోలుకోవడం కష్టమే,కొందరి స్వార్థానికి మూల్యం చెల్లిస్తున్న లక్షలాది ప్రజలు

Kolleru Flood: విజయవాడలో వరద తగ్గినా కొల్లేరు కోలుకోవడం కష్టమే,కొందరి స్వార్థానికి మూల్యం చెల్లిస్తున్న లక్షలాది ప్రజలు

Bolleddu Sarath Chandra HT Telugu
Sep 06, 2024 09:54 AM IST

Kolleru Flood: గత ఐదు రోజులుగా వరద ముంపులో ఉన్న విజయవాడ నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. నగరాన్ని ముంచెత్తిన వరద ప్రవాహం క్రమంగా శాంతిస్తోంది. అయితే బుడమేరు వరద నీరు వేగంగా కొల్లేరును ముంచెత్తబోతోంది. ఇప్పటికే గుడివాడ డివిజన్‌ పరిధిలో పంట పొలాలను బుడమేరు ప్రవాహం ముంచెత్తుతోంది.

వరద ముంపు నీడలో కొల్లేరు అభయారణ్యం
వరద ముంపు నీడలో కొల్లేరు అభయారణ్యం

Kolleru Flood: గత ఐదు రోజులుగా వరద ముంపులో ఉన్న విజయవాడ నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. నగరాన్ని ముంచెత్తిన వరద ప్రవాహం క్రమంగా శాంతిస్తోంది. అయితే అదే బుడమేరు వరద నీరు వేగంగా కొల్లేరును ముంచెత్తబోతోంది. 30,31 తేదీల్లో కురిసిన వర్షాలతో బుడమేరు పొంగి ప్రవహిస్తోంది. బుడమేరు చరిత్రలో ఎరుగని వరద ప్రవాహం విజయవాడను ముంచెత్తింది.

అదే సమయంలో బుడమేరు ప్రవాహం సజావుగా ఉప్పుటేరు మీదుగా సముద్రంలోకి వెళ్లే అవకాశం లేకపోవడంతో ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలు ఇప్పుడు ప్రమాదం ముంగిట నిలిచాయి. 2005కు మించి కొల్లేరు ముంపుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి.

రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం బుడమేరు వరద సహాయ చర్యల్లో నిమగ్నమై ఉన్న సమయంలో బుడమేరు చప్పుడు లేకుండా కృష్ణా, ఏలూరు జిల్లాలను ముంచెత్తుతోంది. 2005 నాటి విపత్తును మించి బుడమేరు ఉగ్రరూపాన్ని ప్రదర్శించడంతో ఇప్పుడు నిజంగానే కొంప కొల్లేరయ్యేలా ఉంది. కొల్లేటి లంకల్లో ఉన్న వేలాది మంది ప్రజలు ఇప్పుడు పర్యావరణ విధ్వంసానికి బలవుతున్నారు. దాదాపు 44 లంక గ్రామాలను మొదట వరద ముంచెత్తుతుంది. రెండు జిల్లాల్లోని 14 కాల్వలు డ్రెయిన్ల నుంచి కొల్లేరుకు ఉధృతంగా వరద నీరు కొల్లేటిని ముంచెత్తుతోంది.

మనిషి స్వార్థానికి మూల్యం…

ప్రపంచంలోనే అతి పెద్ద మంచి నీటి సరస్సును కబళించిన మనుషుల స్వార్థానికి మరోసారి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. 5వ కాంటూరు వరకు కొల్లేటిని కాపాడాలన్నా సంకల్పానికి అడ్డు తగిలిన ఆంధ్రా రాజకీయం.. దాని ఫలితాన్ని 20ఏళ్లలో రెండోసారి అనుభవించనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుల్లో ఒకటైన కొల్లేరును కబళించి చేపలు చెరువులుగా మార్చేసిన బడాబాబులు, రాజకీయ నాయకులస్వార్థానికి ఇప్పుడు లక్షలాది మంది ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు.

కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వరద నీటి ప్రవాహంతో సహజసిద్ధంగా ఏర్పడిన కొల్లేరు ఎన్నో పక్షి జాతులకు, మత్స్య సంపదగా ఆశ్రయంగా ఉండేది. కొల్లేటి సహజత్వానికి వాటిల్లుతున్న ముప్పును గ్రహించి పాతికేళ్ల క్రితమే దానిని అభయారణ్యంగా అంతర్జాతీయ ఒప్పందాలతో గుర్తించారు.

అయితే కొల్లేటి సహజ సంపదను దోచుకునే యావలో చెరువులు తవ్వేసి, సహజ విస్తీర్ణానికి అడ్డంకులు సృష్టించి కొల్లేరును ఎడాపెడా ఆక్రమించిన ఫలితాన్ని ప్రస్తుతం విజయవాడ అనుభవిస్తోంది. బుడమేరు జన్మస్థలం నుంచి 170కి.మీ దూరంలో ఉండే కొల్లేరులొకి వరద నీరు ప్రవహించే మార్గాలను మూసేసి చేపలు, రొయ్యల చెరువులు తవ్వేయడంతో నీటి ప్రవాహానికి అటంకాలు ఏర్పడ్డాయి.

2005లో కూడా సరిగ్గా ఇదే జరిగింది. అప్పట్లో వారం రోజుల పాటు విజయవాడ నగరం ముంపులో ఉండిపోయింది. విజయవాడకు ముంపు తగ్గిన 20రోజుల పాటు కొల్లేటి లంక గ్రామాలు జలదిగ్భంధంలో ఉండిపోయాయి. ఈ పరిస్థితికి కారణాన్ని గ్రహించి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి ఆపరేషన్ కొల్లేరుకు ఆదేశించారు.

కృష్ణా జిల్లా కలెక్టర్ నవీన్ మిట్టల్, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ లవ్ అగర్వాల్ నేతృత్వంలో ప్రత్యేకంగా ఆపరేషన్ కొల్లేరును చేపట్టారు. వరద ప్రవాహానికి అడ్డుగా ఉన్న అక్రమ చెరువుల్ని గుర్తించి బాంబులు పెట్టి వాటిని పేల్చేస్తే తప్ప వరద ప్రవాహం సజావుగా వెళ్లలేదు. ఇదంతా జరగడానికి దాదాపు 20 రోజుల సమయం పట్టింది.

తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు…

కొల్లేరు అక్రమ చెరువుల ధ్వంసాన్ని అడ్డుకోడానికి గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన బడా బాబులు పెద్ద ఎత్తున ఒత్తిడి చేసినా నాటి ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ లవ్ అగర్వాల్‌కు కొల్లేరు ఆక్రమణదారుల నుంచి ప్రాణహాని ఉంటుందనే హెచ్చరికలతో ప్రభుత్వం ప్రత్యేక భద్రతను కూడా ఏర్పాటు చేసింది. ఉధృతంగా సాగిన ఆపరేషన్‌ కొల్లేరు రాజకీయ ఒత్తిళ్లతో ముందుకు సాగలేదు.

అప్పటి కాంగ్రెస్‌ పార్టీలోని నాయకులే దీనికి అడ్డుపడ్డారు. 2004-14 మధ్య ఏలూరు ఎంపీగా పనిచేసిన కావూరి సాంబశివరావు నేతృత్వంలో ఆపరేషన్‌ కొల్లేరును అడ్డుకోడానికి అక్వా సాగుదారులు ఢిల్లీ వరకు ఫిర్యాదులు చేశారు. కొల్లేరు అభయారాణ్యం విస్తీర్ణాన్ని 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకు కుదించాలని కావూరి తీవ్ర స్థాయిలో యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి చేశారు.

జైరామ్‌ రమేష్‌ ఆగ్రహం…

2010-11 మధ్య కాలంలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జై రామ్ రమేష్ వద్దకు అప్పటి ఎంపీ కావూరి కొల్లేరు రైతుల్ని తీసుకొచ్చి కాంటూరు కుదించాలని లేఖను అందించారు. దీనిపై జైరామ్‌ రమేష్‌ మీడియా సమక్షంలోనే కావూరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రపంచంలోనే అత్యంత అరుదైన మంచినీటి సరస్సును కాపాడుకోవాల్సిన వాళ్లు దాని పరిధిని కుదించాలని డిమాండ్ చేయడమేంటని నిలదీశారు. స్థానిక ప్రజల జీవనాధారం కాబట్టి కొల్లేరు పరిధిని తగ్గించాల్సిందేనని కావూరి అప్పట్లో వాదించారు. రామ్‌సార్‌ ఒప్పందాలు, అంతర్జాతీయ పర్యావరణ చట్టాలను ఉల్లంఘించి నిబంధనలకు విరుద్ధంగా తాను వ్యవహరించలేనని అప్పట్లో జైరామ్‌ రమేష్‌ స్పష్టం చేశారు.

ఆ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పార్టీ రాజకీయ నాయకులు కొల్లేరు కాంటూరు పరిధిని కుదించాలంటూ అఖిలపక్షంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. రాజకీయ పార్టీలన్ని పర్యావరణం కంటే స్థానిక ఓటు బ్యాంకు రాజకీయాలకు అండగా నిలిచాయి.

కొల్లేరులో జరుగుతున్న పర్యావరణ విధ్వంసం, అక్రమ చెరువుల నిర్మాణం, దాని వల్ల ఏర్పడుతున్న నష్టం గురించి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని రాజకీయ పార్టీలకు స్ఫష్టమైన అవగాహన ఉంది. అయితే కొల్లేరు కేంద్రంగా జరిగే అక్వా వ్యాపారం స్థాయి కోస్తా జిల్లాల రాజకీయాలను శాసించే స్థాయిలో ఉండటమే కాంటూరు కుదింపు డిమాండ్లకు మద్దతివ్వడానికి కారణంగా కనిపిస్తుంది.

బెజవాడ వరదలకు కొల్లేరుకు సంబంధం ఏమిటి...

అసలు విజయవాడను ముంచెత్తిన వరదలకు కొల్లేరుకు ముంపుకు ఉన్న సంబంధం చాలా సింపుల్...కృష్ణాజిల్లాలో ప్రవహించే వాగులు వంకల్ని కలుపుకుని బుడమేరు 150కి.మీలు ప్రయాణించి కొల్లేరుకు చేరుతుంది. ఆ నీరు ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి వెళ్లాలి. ఇదంతా సాఫీగా జరగాలంటే ఎలాంటి ఆక్రమణలు ఉండకూడదు.

సాదారణ సమయంలో 245చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న కొల్లేరు అభయారణ్యానికి బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, ఎర్ర కాలు వంటి వాటి నుంచి సహజమైన నీరు అందుతుంది.వదల సమయంలో ఇది గరిష్టంగా 700చదరపు కి.మీలకు విస్తరిస్తుంది. దాదాపు 65 కిలోమీటర్ల పొడవున ప్రస్తుత ఏలూరు, కృష్ణా జిల్లా గుడివాడ డివిజన్ల పరిధిలో కొల్లేరు వ్యాపించి ఉంటుంది.

గత 30ఏళ్లుగా కొల్లేరులో జరుగుతున్న చేపల సాగుతో మంచినీటి సరస్సును ఆక్రమించి దాని సహజ స్వరూపాన్ని మార్చేసి చెరువుల్ని నిర్మించారు. ఫలితంగా కొల్లేరులోకి ఎగువు నుంచి వచ్చే వరద ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. 1999లో దీనిని అభయారణ్యంగా గుర్తించారు. ప్రపంచంలో చిత్తడి నేలల ప్రాధాన్యతను గుర్తించే రామ్‌సర్‌ అంతర్జాతీయ ఒప్పందంలో భాగంగా కొల్లేరు అభయారణ్యంగా అంతర్జాతీయంగా గుర్తించారు.

స్థానికంగా నివసించే వడ్డీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు చేపలు పట్టి జీవించుకోడానికి వీలు కల్పించడంతో, దానిని అడ్డుపెట్టుకుని బడాబాబులు, అక్రమార్కులు యథేచ్ఛగా కొల్లేరులో చెరువులు తవ్వేశారు. ప్రస్తుతం కొల్లేరు వేల సంఖ్యలో చేపల చెరువులు ఉన్నాయి. 2001లో రిమోట్ సెన్సింగ్ ద్వారా తీసిన చిత్రాల్లో 42శాతం కొల్లేరులో అక్రమ చేపలు చెరువులు, మరో 9శాతం వ్యవసాయ భూములు ఉన్నాయి. ప్రస్తుతం కొల్లేరు అభయారణ్యంలో ఎంత భాగంగా సురక్షితంగా ఉందనే దానిపై కూడా స్పష్టత లేదు.

సంబంధిత కథనం