MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఇవాళ విచారణ.. సుప్రీంకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ-suspense over supreme court decision on mlc kavitha bail petition ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mlc Kavitha: ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఇవాళ విచారణ.. సుప్రీంకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఇవాళ విచారణ.. సుప్రీంకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ

Basani Shiva Kumar HT Telugu
Aug 27, 2024 09:32 AM IST

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నిర్ణయం పట్ల ఉత్కంఠ నెలకొంది. బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాధన్ ధర్మాసనం ముందుకు కవిత పిటిషన్ వచ్చింది. విచారణ నేపథ్యంలో.. బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం ఢిల్లీలో మకాం వేసింది.

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించి.. మనీలాండరింగ్ కేసులో బీఆర్‌ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. అయితే.. తనకు బెయిల్ మంజూరు చేయాలని కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఈడీ, సీబీఐ కౌంటర్..

ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై న్యాయమూర్తులు బి.ఆర్. గవాయ్, కె.వి. విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపే అవకాశం ఉంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ, మనీలాండరింగ్ కేసుల్లో కవితను అరెస్టు చేశారు. అయితే.. ఈ కేసుల్లో తనకు బెయిల్‌ను నిరాకరిస్తూ.. జూలై 1న ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వాటిని సవాలు చేస్తూ.. కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో.. ఆగస్టు 12న విచారణ జరిగిన సుప్రీం కోర్టు.. కౌటంర్ దాఖలు చేయాలని సీబీఐ, ఈడీనీ ఆదేశించింది.

వేర్వేరు కేసులు నమోదు..

ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో అవినీతి, మనీలాండరింగ్‌కు సంబంధించి.. సీబీఐ, ఈడీ వేర్వేరుగా కేసులు నమోదు చేశాయి. మార్చి 15న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ఆమె నివాసం నుంచి కవిత(46)ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏప్రిల్ 11న తీహార్ జైలు నుంచి ఆమెను సీబీఐ అరెస్ట్ చేసింది. తనపై వచ్చిన ఆరోపణలను కవిత ఖండించారు. తాను ఏ పొరపాటు చేయలేదని స్పష్టం చేశారు.

ఢిల్లీకి కేటీఆర్, హరీష్ రావు..

కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో.. కవిత సోదరుడు కేటీఆర్, బావ హరీష్ రావు సోమవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. వీరితో పాటు కొందరు బీఆర్ఎస్ నేతలు కూడా ఢిల్లీకి వెళ్లారు. బెయిల్ కోసం ప్రముఖ లాయర్లతో కేటీఆర్, హరీష్ రావు చర్చలు జరుపుతున్నారు. బెయిల్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మంగళవారం కవితకు కచ్చితంగా బెయిల్ వస్తుందని ఆశిస్తున్నారు.

కవితకు అస్వస్థత..

తీహార్‌ జైలులో ఎమ్మెల్సీ కవిత ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు.. ఢిల్లీ ఎయిమ్స్‌లో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కవిత వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నారు. నెల కిందట కూడా కవిత ఉన్నట్టుండి కళ్లు తిరిగి కింద పడిపోయారు. జైలు అధికారులు వెంటనే కవితను దీన్ దయాల్ ఆసుపత్రికి తరలించారు. 5 నెలలుగా జైలులోనే ఉంటున్న కవిత.. పలుమార్లు జ్వరంతో బాధపడింది. కొంతకాలంగా లో బీపీతో బాధపడుతున్న కవిత.. అరెస్టైన సమయంలోనూ అదే సమస్యతో ఉన్నారు. దీంతో వైద్యులు సూచించినట్టు ఇంటి నుంచే మెడిసిన్ అందిస్తున్నారు. అప్పుడప్పుడు జైలులో వైద్యులతో చికిత్స అందిస్తున్నారు.