MLC Kavitha: తిహార్ జైలులో ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత.. ఢిల్లీకి కేటీఆర్, హరీశ్ రావు
MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల మరోసారి అస్వస్థతకు గురయ్యారు. తిహార్ జైలులో ఉన్న కవిత అస్వస్థతకు గురవగా.. జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవిత.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. తిహార్ జైలులో ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు.. ఢిల్లీ ఎయిమ్స్‌లో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కవిత వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. కవిత అస్వస్థతకు గురవడంతో.. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. వీరిద్దరు కవితను పరామర్శించే అవకాశం ఉంది.
నెల కిందట కూడా..
నెల కిందట కూడా కవిత ఉన్నట్టుండి కళ్లు తిరిగి కింద పడిపోయారు. జైలు అధికారులు వెంటనే కవితను దీన్ దయాల్ ఆసుపత్రికి తరలించారు. 5 నెలలుగా జైలులోనే ఉంటున్న కవిత.. పలుమార్లు జ్వరంతో బాధపడింది. కొంతకాలంగా లో బీపీతో బాధపడుతున్న కవిత.. అరెస్టైన సమయంలోనూ అదే సమస్యతో ఉన్నారు. దీంతో వైద్యులు సూచించినట్టు ఇంటి నుంచే మెడిసిన్ అందిస్తున్నారు. అప్పుడప్పుడు జైలులో వైద్యులతో చికిత్స అందిస్తున్నారు.
మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్టయ్యారు. ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ప్రధానంగా కవిత పేరు వినిపించింది. పలుమార్లు విచారణ జరిపిన అధికారులు.. మార్చి 15న కవితను అదుపులోకి తీసుకున్నారు. మార్చి 26వ తేదీ నుంచి జ్యూడీయల్ ఖైదీగా కవిత తీహార్ జైలులో ఉన్నారు. బెయిల్ కోసం కవిత పిటిషన్లు దాఖలు చేయగా.. ప్రతిసారీ నిరాశే ఎదురైంది.
సీబీఐ, ఈడీ కేసుల్లో తనకు బెయిలు ఇవ్వాలని కోరుతూ.. కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా జులై 1న బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. దాన్ని సవాలు చేస్తూ కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని తెలిపింది. తాజాగా కవిత పిటిషన్ విచారణకు రాగా.. మళ్లీ ఆగస్టు 27వ తేదీకి వాయిదా వేసింది. దీంతో కవిత జైలులోనే ఉంటున్నారు.