AP Capital Issue: ఆంధ్రప్రదేశ్..అమరావతి, వివాదానికి ముగింపు ఎప్పుడు? అమరావతిపై కీలకం కానున్న బీజేపీ వైఖరి…
AP Capital Issue: దేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటులో ఏ రాష్ట్రానికి తలెత్తని సమస్య ఆంధ్రప్రదేశ్‌కు ఎదురైంది. కొత్త రాష్ట్రాల ఏర్పాటులో రాజధాని ఎంపిక అధికారం అయా రాష్ట్రాలకే దక్కింది. రాజధాని నగరాల విషయంలో ఏ రాష్ట్రానికి తలెత్తని సంక్లిష్టమైన సమస్యను ఏపీలో ఎలా అధిగమిస్తారనేది ఆసక్తిగా మారింది.
AP Capital Issue: ఆంధ్రప్రదేశ్ అమరావతి.. ఏపీ రాజధాని నగరాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించిందా అంటే ఒక్కోసారి ఔనని, ఒక్కోసారి రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ ఇష్టమని చెబుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని బట్టి కేంద్ర ప్రభుత్వ వైఖరీలో మార్పు కనిపిస్తుండటమే అన్ని అనుమానాలకు కారణం అవుతోంది.
2014-18 మధ్య కేంద్రంతో పాటు, ఏపీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని ఏ దశలోను కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించలేదు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాల పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం లేకపోవడమే ఇందుకు కారణమని సరిపెట్టుకున్నా చాలా ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు. 2019 డిసెంబర్‌లో వైసీపీ ప్రభుత్వం ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించింది. ఆ వెంటనే అమరావతి రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు ఆందోళన బాట పట్టారు. 2020 జనవరి నుంచి 2024 సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలల ముందు వరకు ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.
రాజధాని విషయంలో ఏపీ హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును వైసీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. ఈ వివాదానికి ముగింపు పలికే విషయంలో ఏపీ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణాన్ని 2015లో ప్రారంభించారు. అదే ఏడాది పనులు ప్రారంభించారు. 2016 నుంచి పాలనా వ్యవహారాలు అమరావతి నుంచి సాగుతున్నాయి. 2019 డిసెంబర్‌లో రాజధాని నగరాన్ని అమరావతి నుంచి విశాఖపట్నం తరలిస్తున్నట్టు ఏపీ అసెంబ్లీలో వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రకటించారు. అమరావతిలో రాజధాని నిర్మాణం చేయడం కంటే విశాఖలో ఏర్పాటు చేయడమే మేలని వాదించారు. 2024 వరకు ఇదే వైఖరికి కట్టుబడి ఉన్నారు.
2024ఎన్నికల్లో జగన్ ఓటమి పాలయ్యారు. భవిష్యత్తులో ఎప్పుడైనా జగన్ అధికారంలోకి వస్తే అప్పుడు అమరావతి పరిస్థితి ఏమిటనే సందేహాలకు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఏపీలో అమరావతి కేంద్రంగా ఇప్పటికే హైకోర్టు కార్యకలాపాలు నడుస్తున్నాయి. సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ నరసింహరెడ్డి కమిటీ ఆధ్వర్యంలో హైకోర్టు నిర్మాణాన్ని, సదుపాయాలను గుర్తించిన తర్వాత ఏపీ హైకోర్టు ఏర్పాటైంది.
అదే సమయంలో న్యాయ వ్యవహారాలను కర్నూలు కేంద్రంగా నిర్వహిస్తామని వైసీపీ ప్రకటించింది. ఇందులో భాగంగా కొన్ని కార్యాలయాలను కూడా అక్కడ ఏర్పాటు చేసింది.
మరోవైపు 2019-24 మధ్య పలు సందర్భాల్లో ఏపీ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా భవిష్యత్తులో తలెత్తే పరిణామాలకు ముగింపు పలకాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాల రాజధాని ఎంపిక అంశం లో జోక్యం చేసుకోవడం వాటి పాలనా వ్యవహారాల్లో తలదూర్చడమేనని భావిస్తే.. అమరావతి వివాదం ఎప్పటికీ రాజుకుంటూనే ఉంటుంది.
కేంద్రం వైఖరి ఏమిటి…?
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గతంలోనే కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని చెబుతున్నా దానికి సంబంధించిన ఎలాంటి ధృవీకరణ ఇప్పటి వరకు విడుదల కాలేదు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీఆర్‌డిఏ చట్టాన్ని ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. సిఆర్‌డిఏ పేరును ఏఎండిఏగా మార్పు కూడా చేసింది. ఆ తర్వాత కోర్టు వివాదాల నేపథ్యంలో పలు బిల్లుల్ని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది.
మరోవైపు ఆర్టికల్ 370ని రద్దు చేసిన సమయంలో సర్వే ఆఫ్ ఇండియా భారత మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్ 'రాజధాని' అమరావతి లేకపోవడం అప్పట్లో పెద్ద దుమారాన్ని రేపింది. ఆ తర్వాత మ్యాప్‌లలో అమరావతిని చేర్చారు. అయితే 2020లో సర్వే ఆఫ్ ఇండియా హిందుస్తాన్ టైమ్స్ ప్రతినిధికి ఆర్టీఐలో ఇచ్చిన సమాధానంలో ఏపీ రాజధాని నగరాన్ని గుర్తిస్తూ తమ వద్ద ఎలాంటి ప్రతిపాదన లేదని సమాధానం ఇచ్చింది. కేంద్రం నుంచి తమకు ఎలాంటి సమాచారం అందుబాటులో లేదని 2020 జనవరిలో సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారత మ్యాప్‌లో అమరావతికి చోటు దక్కింది.
అమరావతిని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తిస్తే దాని భౌగోళిక సరిహద్దుల్ని నిర్ణయించి ప్రత్యేకంగా పోస్టల్ కోడ్ విడుదల చేయాల్సి ఉంటుంది. ఇప్పటికీ అమరావతి రాజధాని ప్రాంతానికి అయా గ్రామాల పోస్టల్ కోడ్‌లను మాత్రమే వినియోగిస్తున్నారు. వెలగపూడి గ్రామ పిన్ కోడ్‌తోనే ప్రస్తుతం రాజధాని పాలన సాగుతోంది.
అమరావతి వ్యవహారంలో 2015-19 మధ్య పలు ప్రకటనలు, కథనాలు వెలువడినా రాజధాని నగరాన్ని నోటిఫై చేస్తూ ఎలాంటి అధికారిక ప్రకటన కేంద్రం నుంచి జారీ కాలేదు. ఉమ్మడి రాజధానిపై ఉన్న హక్కుల్ని ఉమ్మడి రాజధానిపై ఉన్న హక్కుల్ని వదులుకోవడం ఇష్టం లేక అమరావతిని నోటిఫై చేసి ఉండకపోవచ్చని ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారులు అభిప్రాయపడ్డారు. రాజధాని ఏర్పాటు విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడినా అధికారికంగా గెజిట్ జారీ కాలేదని గుర్తు చేస్తున్నారు.
టీడీపీ హయాంలో రాజధాని పరిధిలోని ప్రాంతాన్ని నిర్వచిస్తూ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ)ను ఏర్పాటు చేస్తూ పలు ప్రభుత్వ ఉత్తర్వులు (జీఓలు) జారీ అయ్యాయి. రాజధానిని పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాలేదని అధికారులు గుర్తు చేస్తున్నారు.
"అమరావతిని రాజధానిగా ప్రకటించాలని, దాని సరిహద్దులను నిర్వచించడం మరిచారు. ‘‘పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉమ్మడి రాజధాని గడువు ముగిసిన నేపథ్యంలో అమరావతిని స్పష్టంగా నిర్వచించాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది. ఈ అంశంపై ఇప్పటికే ఫైల్ సర్క్యులేట్ చేసి రాజధానిగా నోటిఫై చేసేందుకు అధికారిక లాంఛనాలు పూర్తి చేసి ఉండాల్సింది. రాజధాని ఎంపిక చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది.
AP పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం, 2024 వరకు హైదరాబాద్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లకు పరిపాలనా రాజధానిగా ఉంటుంది కాబట్టే అమరావతిని ఇప్పటి వరకు రాజధానిగా నోటిఫై చేయలేదని సిఆర్‌డిఏ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ నిర్ణయం కావడంతోనే అమరావతిని అధికారికంగా నోటిఫై చేయలేదని చెబుతున్నారు.
అమరావతిని నోటిఫై చేస్తే హైదరాబాద్‌పై పదేళ్ల పాటు ఉండే హక్కులను వదులుకోవాల్సి వస్తుందని 2024 వరకు ఉమ్మడి అడ్మిషన్లతో పాటు ఇతర హక్కులను కోల్పోవాల్సి వస్తుందనే ఆ పనిచేయలేదని చెబుతున్నారు. ఉమ్మడి రాజధాని కొనసాగుతున్న సమయంలో మరో రాజధాని ఉండటం సాంకేతికంగా సాధ్యం కానందునే సిఆర్‌డిఏ పేరుతో చట్టం చేసినట్టు వివరిస్తున్నారు.
అమరావతి పేరిట గెజిట్‌ను ప్రచురించకపోవడం, హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేయకపోవడంలో లాభనష్టాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. అమరావతి నోటిఫై అయ్యుంటే షెడ్యూల్ 9, 10 ఆస్తుల వివాద పరిష్కారం కుదరదని మరో అధికారి వివరించారు.
కేంద్రం వైఖరి ఏమిటి…?
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని వివాదానికి ముగింపు పలకాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ఈ ఏడాది దాదాపు రూ.15వేల కోట్ల రుపాయలను అంతర్జాతీయ సంస్థల ద్వారా రుణంగా ఇప్పించేందుకు కేంద్రం గ్యారంటీ ఇవ్వనుంది. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని గడువు ముగియడంతో ఏపీ రాజధానిని నోటిఫై చేయాలనే షరతు విధించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. కేంద్రం ద్వారా విడుదలయ్యే నిధులకు రాజధాని నగరాన్ని నోటిఫై చేయాలనే షరతు విధించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో తలెత్తే అన్ని రకాల వివాదాలకు ముగింపు పలికేలా చట్టబద్దమైన నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదని బీజేపీ వర్గాలు తెలిపాయి. గతంలో టీడీపీ చేసిన చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం రద్దు చేయడం, వేల కోట్ల రుపాయల నిర్మాణాలను నిరుపయోగంగా మార్చి రాజధాని నిర్మాణంలో జాప్యం చేయడం వంటి అంశాలను కేంద్రం పరిశీలనలో ఉన్నాయని చెబుతున్నారు. మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ వాటాగా రావాల్సిన షెడ్యూల్ 9,10 ఆస్తుల విభజనను కేంద్రం ఎలా పరిష్కరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
సంబంధిత కథనం