CM Chandrababu: వరద మృతులకు రూ.5లక్షల పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు, ఊపందుకున్న సహాయ చర్యలు-cm chandrababu announced a compensation of rs 5 lakhs for the flood victims ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Chandrababu: వరద మృతులకు రూ.5లక్షల పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు, ఊపందుకున్న సహాయ చర్యలు

CM Chandrababu: వరద మృతులకు రూ.5లక్షల పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు, ఊపందుకున్న సహాయ చర్యలు

Bolleddu Sarath Chandra HT Telugu
Sep 04, 2024 12:48 PM IST

CM Chandrababu: బుడమేరు వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రూ.5లక్షల పరిహారం ప్రకటించారు. వరద సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వరద తీవ్రత తగ్గడంతో సహాయ చర్యల్లో వేగం పెంచాలని, ఇంటింటికి వెళ్లి సాయం అందించాలన్నారు.

వరద మృతులకు రూ.5లక్షల పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు
వరద మృతులకు రూ.5లక్షల పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu: విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసిన బుడమేరు వరద సహాయ చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వరదల్లో చనిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబాలకు మృతదేహాలను అప్పగించాలని, మృతదేహాల కోసం ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపునే గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం తరపున అందించాలని నిర్ణయించారుర.

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం నారా చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా చర్యలు చేపట్టి సాధారణ స్థితికి తీసుకొస్తున్నామని, ప్రతి ఇంటికి సహాయం అందించాలని సీఎం సూచించారు.

వరద తగ్గినందున ఆహారాన్ని డోర్ టు డోర్ వెళ్లే అవకాశం ఉందని, ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు బంగాళదుంప, కేజీ చక్కెర అందించాలని ఆదేశించారు. మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేసి బ్లాక్ మార్కెటింగ్ లేకుండా అతి తక్కువ ధరకు కూరగాయలు విక్రయించేలా చర్యలు చేపట్టాలని, నష్టాన్ని వివరించి కేంద్ర సాయం కోరుతామన్నారు.

ఆహారం, నీరు, బిస్కెట్స్, పాలు, అరటిపండ్లు అన్నీ డోర్ టు డోర్ అందాలని, అన్ని అంబులెన్స్ లు పూర్తి స్థాయిలో అందుబాటులో పెట్టాలని, విద్యుత్ పునరుద్ధరణ వేగవంతం చేయాలని శానిటేషన్ పనులు ఒక యుద్దంలా జరగాలన్నారు.

ప్రతి ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఇంటికి సంబంధించిన వారిని భాగస్వామ్యులను చేయాలని, వైరల్ ఫీవర్లు, దోమల బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కరపత్రాల ద్వారా ప్రజలను చైతన్య పరచాలని సూచించారు. ప్రతి సచివాలయంలో ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని ఎవరికి ఏ మెడిసిన్ కావాలన్నా అందించాలన్నారు. పంట నష్టంపై అంచనాలు నమోదు చేయాలని సూచించారు.

ఉదయం 2.3 లక్షల అల్పాహారం ప్యాకెట్లు పంపించామని, 4.5 లక్షల మందికి మధ్యాహ్నం, సాయంత్రానికి భోజనం సిద్ధం చేస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 2.5 లక్షల పాల ప్యాకెట్లు, 5 లక్షల వాటర్ బాటిళ్లతో పాటు 117 ట్యాంకర్లను పంపించామని, మరో 6 లక్షల నీళ్ల బాటిళ్లు సిద్ధంగా ఉంచామన్నారు. వాటర్ ప్యాకెట్లు 10 లక్షల తరలించామని, ...మరో 6 లక్షలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం 50 ఫైర్ ఇంజన్లు అందుబాటులో ఉన్నాయి. వాటితో పారిశుధ్య పనులు మొదలు పెట్టినట్టు అధికారులు పేర్కొన్నారు.