Jagan Security: జడ్ ప్లస్ సెక్యూరిటీ కోసం హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి-ycp leader jaganmohan reddy approached the high court for z plus security ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Jagan Security: జడ్ ప్లస్ సెక్యూరిటీ కోసం హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి

Jagan Security: జడ్ ప్లస్ సెక్యూరిటీ కోసం హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి

Sarath chandra.B HT Telugu
Aug 06, 2024 06:47 AM IST

Jagan Security: వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జడ్ ప్లస్ సెక్యూరిటీ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెలువడక ముందు జూన్ 3నాటికి ఉన్న భద్రతను కల్పించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

జడ్ ప్లస్ సెక్యూరిటీ కోసం హైకోర్టును ఆశ్రయించిన జగన్ (ఫైల్ ఫోటో)
జడ్ ప్లస్ సెక్యూరిటీ కోసం హైకోర్టును ఆశ్రయించిన జగన్ (ఫైల్ ఫోటో)

Jagan Security: వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనకు ఉన్న భద్రతను కొనసాగించాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం తనకు ఉన్న జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని కుదించిందని సోమవారం హైకోర్టులో పిటిషన్ వేశారు.

కేంద్ర హోంశాఖ తనకు జడ్ ప్లస్ భద్రత కల్పించిందని, ఏపీలో ఓట్ల లెక్కింపునకు ఒక రోజు ముందు 2024 జూన్ 3న తనకు ఏ విధ మైన భద్రత ఉందో దాన్ని పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించాలని పిటిషన్‌లో జగన్ కోరారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి, రాష్ట్ర డీజీపీ, రాష్ట్రస్థాయి -సెక్యూరిటీ రివ్యూ కమిటీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి పిటిషన్‌లో 2019లో తనపై దాడి జరిగిందని.. సీఎం కాకముందే ఉన్నత స్థాయి భద్రత కల్పించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 139 మందితో భద్రత కల్పించారని తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ముందస్తు సమాచారం లేకుండా సెక్యూరిటీని గణనీయంగా తగ్గించారని పేర్కొన్నారు. ప్రస్తుతం భద్రతా విధుల్లో 59 మంది ఉన్నారని తెలిపారు.

ప్రస్తుతం చాలామంది ఎమ్మెల్యేలకు ఉన్న వ్యక్తిగత భద్రతాధికారిల కంటే తనకు తక్కువ భద్రత ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం తనను అంతం చేయాలని చూస్తోందని జగన్ ఆరోపించారు. జడ్ ప్లస్ భద్రతను పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్లో జగన్ పేర్కొన్నారు.

ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనకు కల్పించిన పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్లు, కౌంటర్‌ అసాల్ట్‌ టీములు, జామర్‌ను ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో జగన్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం తనకు కల్పించిన జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీని ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తగ్గించడాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని పిటిషన్‌లో జగన్ కోరారు.

ప్రతివాదులుగా కేంద్ర హోం శాఖ కార్యదర్శి, రాష్ట్ర హోం శాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, నిఘా విభాగం ఐజీ, గుంటూరు ఎస్పీ, రాష్ట్ర స్థాయి సెక్యూరిటీ రివ్యూ కమిటీని చేర్చారు. 2024 ఎన్నికల ఫలితాలు ప్రకటించి నెల గడవకముందే నాకున్న భద్రతా సిబ్బంది సంఖ్యను 59కి తగ్గించడం సహజ న్యాయసూత్రాలను ఉల్లంఘించడమేనన్నారు. ఎన్నికల ప్రచారంలో రాయితో దాడి చేశారని, ఈ ఘటనపై కేసు నమోదైందని పేర్కొన్నారు.

తన ఇల్లు, కార్యాలయం వద్ద ఉన్న భద్రతను పూర్తిగా తొలగించారని, ప్రస్తుతం తనకు ఇద్దరు వ్యక్తిగత భద్రతా సిబ్బంది మాత్రమే ఉన్నారని, ఎమ్మెల్యేలకు తనకంటే ఎక్కువ మంది ఇచ్చారని ఆరోపించారు. పోలీసులు కేటాయించిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం ప్రయాణానికి అనుకూలంగా లేదని, అందులో ఏసీ పనిచేయడం లేదన్నారు. వాహనం లేకపోవడంతో ఓ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకోవలసి వచ్చిందన్నారు. తననున భౌతికంగా లేకుండా చేస్తామని అధికార కూటమి నేతలు ప్రకటనలు చేశారని పలు కథనాలకు సంబంధించిన వివరాలను పిటిషన్‌లో పేర్కొన్నారు. జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ పునరుద్ధరించాలని కోరుతూ జూన్‌ 7న కేంద్ర హోం శాఖకు విజ్ఞప్తి చేశామని, వీటి ఆధారంగా భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలివ్వాలని జగన్ హైకోర్టును కోరారు.