Ysrcp MPs: వైసీపీని వీడనున్నమరికొందరు రాజ్యసభ సభ్యులు? నాడు నేడు జగన్ చేసిన ఆ ప్రకటనలే కొంపముంచాయా?
Ysrcp MPs: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కూడా వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలే ఎన్డీఏ కూటమి నేతలు అప్రమత్తం అయ్యేలా చేశాయి. లోక్‌సభలో సంఖ్యాబలం తగ్గినా రాజ్యసభలో తమ మీదే బీజేపీ ఆధారపడాలంటూ జగన్ అండ్ కో చేసిన వ్యాఖ్యలే వైసీపీ సభ్యులు రాజీనామాలు చేయడానికి కారణమయ్యాయయనే వాదన వినిపిస్తోంది.
Ysrcp MPs: వైసీపీ రాజ్యసభ సభ్యులు ఇద్దరు రాజీనామాలు చేసిన గంటల వ్యవధిలోనే వాటిని అమోదిస్తున్నట్లు పార్లమెంటు నోటిఫికేషన్ జారీ చేయడం మరికొంతమంది ఎంపీలు అదే బాటలో ఉన్నారని ప్రచారం జరగడం ఏపీ తాజా రాజకీయాలకు అద్దం పడుతోంది. వైసీపీ సభ్యుల విషయంలో ఎన్డీఏ కూటమి దూకుడు ప్రదర్శించడానికి జగన్ వైఖరే కారణమని టీడీపీ నేతలు చెబుతున్నారు.
గత మే నెలలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 అసెంబ్లీ స్థానాలు, నాలుగు పార్లమెంటు స్థానాలకు పరిమితం అయ్యింది. అదే సమయంలో గత ఐదేళ్లలో జరిగిన పరిణామాలతో రాజ్యసభలో టీడీపీ తుడిచి పెట్టుకుపోయింది. రాజ్యసబలో టీడీపీ ఖాళీ అవడానికి దాదాపు ఐదేళ్ల సమయం పట్టింది. 2019లో టీడీపీ ఓటమి పాలైన తర్వాత టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌లు బీజేపీలో చేరారు. ఆ పార్టీ తరపున కనకమేడల ఒక్కరే మిగిలినా పదవీ కాలం పూర్తయ్యే వరకు టీడీపీలోనే కొనసాగారు.
గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీ ఓటమి పాలైన తర్వాత జగన్మోహన్ రెడ్డితో పాటు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎన్డీఏ కూటమిని అప్రమత్తం అయ్యేలా చేశాయి. దీంతో పాటు వైసీపీలో జగన్ వైఖరితో విసిగిపోయిన వారు, గతంలో రకరకాల సందర్భాల్లో అవమానాలకు గురైన నాయకులు అదను కోసం ఎదురు చూశారు. ఓటమి పాలైన పార్టీలో ఐదేళ్లు వృధా చేసుకోవడం ఎందుకని భావించిన నేతలు ఒక్కొక్కరుగా జారిపోతున్నారు. గురువారం బీదమస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణలు వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు.
2014-19 మధ్య కాలంలో 23 మంది సభ్యులు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అప్పట్లో కూడా టీడీపీ ప్రభుత్వాన్ని కూల్చేస్తానంటూ జగన్మోహన్ రెడ్డి పదేపదే ప్రకటనలు చేయడంతో టీడీపీ అప్రమత్తమైంది. 2014లో అధికారంలో ఉన్న టీడీపీ సభ్యుల్ని తమ వైపు తిప్పుకునేందుకు జగన్ ప్రయత్నిస్తారనే అనుమానంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకున్నారనే వాదన ఉంది. 2024లో ఓటమి పాలైన వెంటనే బీజేపీకి తమ అవసరం ఉందని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేసి ఎంపీలు పార్టీలు మారేలా జగన్మోహన్ రెడ్డి కారణమైనట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
మళ్లీ పదవులు గ్యారంటీ….
మోపిదేవి, బీద మస్తానరావులకు పదవులు గ్యారంటీ లభించడంతోనే వైసీపీని వీడినట్టు స్పష్టమైంది. మోపిదేవి రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలని భావిస్తున్నారు. అందుకనుగుణంా ఆయనకు ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి. బీద మస్తానరావు మరోసారి రాజ్యసభలో టీడీపీ తరపున అడుగు పెట్టనున్నారు.
లోక్‌సభలో తమ బలం తగ్గినా రాజ్యసభలో తమకు ఉన్న సంఖ్యా బలం దృష్ట్యా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమపై ఆధారపడాల్సిందేనని వైసీపీ నేతలు ఎన్నికల ఫలితాల తర్వాత పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. వైసీపీ నేతల్లో అంతర్గతంగా ఉన్న అసంతృప్తి గురించి ఏనాడు పట్టించుకోని పార్టీ నాయకత్వం, విపక్షంలో తమ వెంటే నడుస్తారని గుడ్డిగా భావించింది. పార్లమెంటులో అధికార కూటమిని వైసీపీ భవిష్యత్తులో ఎప్పుడైనా ఇరకాటంలో పెట్టొచ్చని అనుమానించిన పార్టీలు ఎంపీలను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేశాయి.
వైసీపీకి రాజ్యసభలో 11మంది సభ్యుల బలం ఉంది. వారిలో ఇద్దరు పార్టీని వీడారు. మిగిలిన వారిలో విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఎస్.నిరంజన్ రెడ్డి మాత్రమే పార్టీని వీడకపోవచ్చని పక్కాగా చెబుతున్నారు. గురువారం ఎంపీలు రాజీనామా చేసే సమయంలో వైసీపీ ఎంపీ గొల్లబాబురావు కూడా పార్లమెంటులో ప్రత్యక్ష మయ్యారు. ఆయన కూడా రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది. పార్టీ మారే విషయాన్ని ఆయన ఖండించలేదు. సమయం వచ్చినపుడు తన వైఖరి చెబుతానని గొల్లబాబురావు ప్రకటించారు. దాంతో ఆయన కూడా వైసీపీని వీడటం ఖాయమని స్పష్టమైంది.
మిగిలిన వారిలో పరిమళ్ నట్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్.కృష్ణయ్య, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి ఉన్నారు. ఆర్.కృష్ణయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాడైనా ఏపీ నుంచి రాజ్యసభకు అవకాశం కల్పించారు. ఆయనకు చంద్రబాబుతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను మంత్రి పదవి నుంచి రాజీనామా చేయించి రాజ్యసభకు పంపారు.
పారిశ్రామికవేత్త ఆళ్లకు జగన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నా ఎంతవరకు పార్టీలో కొనసాగుతారనేది నమ్మకం లేదు. ఎన్నికలకు ముందు ఆళ్ల సోదరుడు ఆర్కే కాంగ్రెస్‌లో చేరినా చివరి నిమిషంలో బలవంతంగా వెనక్కి తీసుకొచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీలో చివరకు ఇద్దరు ముగ్గురు మాత్రమే ఎంపీలు మిగిలే పరిస్థితులు ఉన్నాయి. రాజ్యసభ సభ్యులుగా ఉన్న వారిలో లోక్‌సభలో మిథున్ రెడ్డి, రాజ్యసభలో సాయిరెడ్డికి తప్ప మిగిలిన వారికి సొంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోడానికి వీల్లేని పరిస్థితులు ఉన్నాయి. గతంలో జగన్ ఢిల్లీ పర్యటనలకు వచ్చినపుడు సొంత సామాజిక వర్గానికి చెందిన ఎంపీలను మాత్రమే ఆయన నివాసంలోకి అనుమతించేవారు. మిగిలిన వారు బయట ఎదురు చూడాల్సి వచ్చేదనే ఆరోపణలు ఉన్నాయి. అదను కోసం ఎదురు చూసిన నాయకులంతా వైసీపీ అధికారాన్ని కోల్పోవడంతో తమ దారి తాము చూసుకుంటున్నారు.
ఎవరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదన్న మోపిదేవి….
తన రాజీనామాపై ఎవరికి సమాధానం చెప్సాల్సిన అవసరం లేదని మోపిదేవి వెంకటరమణ ప్రకటించారు. జగన్ వల్ల తాను జైలుకు వెళ్లానని, వైఎస్‌కు, జగన్‌కు చాలా తేడా ఉందని రాజీనామా తర్వాత ఢిల్లీలో చెప్పారు. తన రాజీనామాకు చాలా కారణాలు ఉన్నాయని, క్షేత్ర స్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఏ సందర్భంలో వైసీపీకి రాజీనామా చేస్తున్నాను..? ఏమిటనేది..? వైసీపీ నేతలు ఆలోచించుకోవాలన్నారు.
రాజ్యసభ పదవి తనకు మొదటి నుంచి ఆసక్తి లేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో టీడీపీలో చేరుతానని ప్రకటించారుఏడాదికాలంగా నా నియోజవర్గంలో జరుగుతున్న పరిణామాలతో చాలా ఇబ్బంది పడ్డాను. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులతో రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.
సార్వత్రిక ఎన్నికల సమయంలో తన సోదరుడికి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని మోపిదేవి కోరినా జగన్ వద్ద భంగపాటు తప్పలేదు. టిక్కెట్ అడగడానికైతే మరోసారి తన వద్దకు రావాల్సిన అవసరం లేదని జగన్ అన్నట్టు ప్రచారం జరిగింది. ఈ పరిణామాలతోనే మోపిదేవి పార్టీని వీడినట్టు చెబుతున్నారు.
సంబంధిత కథనం