Vijayawada : చంద్రబాబుకు త్రుటిలో తప్పిన ప్రమాదం.. భద్రతా సిబ్బంది అప్రమత్తమై..-andhra pradesh chief minister chandrababu in vijayawada has averted an accident ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vijayawada : చంద్రబాబుకు త్రుటిలో తప్పిన ప్రమాదం.. భద్రతా సిబ్బంది అప్రమత్తమై..

Vijayawada : చంద్రబాబుకు త్రుటిలో తప్పిన ప్రమాదం.. భద్రతా సిబ్బంది అప్రమత్తమై..

Basani Shiva Kumar HT Telugu
Sep 05, 2024 05:52 PM IST

Vijayawada : ఏపీ సీఎం చంద్రబాబుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తూ రైల్వే ట్రాక్‌పై నిల్చున్నారు. ఒక్కసారిగా ట్రైన్ రావడంతో.. సెక్యూరిటీ అలెర్ట్ అయ్యి.. ట్రాక్ అవతలి పక్కకు తీసుకెళ్లారు. దీంతో ప్రమాదం తప్పింది.

చంద్రబాబుకు తప్పిన ప్రమాదం
చంద్రబాబుకు తప్పిన ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి త్రుటిలో ప్రమాదం తప్పింది. విజయవాడలోని మధురానగర్‌ వద్ద రైల్వే ట్రాక్‌పై సీఎం చంద్రబాబుకు ప్రమాదం తప్పింది. ట్రాక్‌పై చంద్రబాబు ఉండగానే రైలు వచ్చింది. భద్రతా సిబ్బంది అప్రమత్తమై.. రైల్వే ట్రాక్‌ అవతలి పక్కకు తీసుకెళ్లారు. రైలు వెళ్లిన తర్వాత చంద్రబాబు పర్యటన కొనసాగింది. చంద్రబాబుకు ఏ ప్రమాదం జరగకపోవడంతో.. అక్కడున్న వారంతా ఊపిరి పిల్చుకున్నారు.

చంద్రబాబు పర్యటనలో..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఎనికేపాడు వద్ద ఏలూరు కాల్వ, బుడమేరు ముంపు పరిశీలించారు. బల్లకట్టుపై బుడమేరు దాటి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాల్లో పనులపై అధికారులతో చర్చించారు. దెబ్బతిన్న పంటలు వివరాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుండి మరో ప్రాంతానికి పరిశీలనకు వెళ్లారు. సహాయక చర్యలు, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.

బుడమేరుకు మళ్లీ వరద..

బుడమేరుకు వరద ఉధృతి కొనసాగుతుంది. రామకృష్ణాపురంలో మళ్లీ ఇళ్లలోకి వరద నీరు వచ్చింది. ఇటీవలి వరదల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకున్న రామకృష్ణాపురం వాసులు మళ్లీ వరద రావడంతో ఆందోళన చెందుతున్నారు. మధ్యాహ్నం నుంచి రామకృష్ణాపురంలో రెండు అడుగులకు వరద పెరిగింది. రామకృష్ణాపురంపై అధికారులు మళ్లీ ఫోకస్ పెట్టారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

వరద ముంపుతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఆయనకు మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. ఏరియల్ సర్వే ద్వారా బుడమేరు, క్యాచ్‌మెంట్ ఏరియాలను చౌహాన్ పరిశీలించారు. అక్కడ నుంచి వరద ప్రభావిత ప్రాంతాలు.. జక్కంపూడి మిల్క్ ఫ్యాక్టరీ, కండ్రిక, అజిత్‌సింగ్ నగర్‌లను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి..

వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రికి నారా లోకేష్ వివరించారు. ఏరియల్ సర్వే అనంతరం ముఖ్యమంత్రి నివాసంలోని హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో వరద కారణంగా దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించారు. అనంతరం జక్కంపూడి కాలనీ మిల్క్ ఫ్యాక్టర్టీ ప్రాంతాన్ని ఎన్.డీ.ఆర్.ఎఫ్ బోట్‌లో పరిశీలించనున్నారు. విజయవాడ కలెక్టరేట్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ కు చేరుకుని.. వరద కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించనున్నారు.