CM Jagan Delhi Tour : 'హస్తిన' కేంద్రంగా ఏపీ పాలిటిక్స్...! ఇవాళ ఢిల్లీకి సీఎం జగన్
AP CM Jagan Delhi Tour 2024: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
AP CM Jagan Delhi Tour 2024: ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ టూర్ ఖరారైంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు విజయవాడ నుంచి హస్తినకు వెళ్లనున్నారు ముఖ్యమంత్రి. షెడ్యూల్ ప్రకారం… ఇవాళ జన్‌పథ్ నివాసంలో బస చేయనున్నారు. రేపు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు.
ఈ పర్యటనలో ప్రధానంగా ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. గత పర్యటనలో కూడా సీఎం జగన్ ఈ విషయంతో పాటు పలు అంశాలపై చర్చించారు. పోలవరం నిధులు త్వరితగతిన విడుదలతో పాటు కేంద్ర జలశక్తి శాఖ పరిశీలనలో ఉన్న అంశాలతో పాటు పెండింగ్ అంశాల పరిశీలన విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఏపీకి రావాల్సిన గ్రాంట్లతో పాటు విభజన హామీలను మరోసారి మోదీ దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు ముఖ్యమంత్రి జగన్. కొత్త మెడికల్ కాలేజీలు, పౌరసరఫరాల శాఖకు సంబంధించిన సబ్సిడీ బకాయిల అంశాన్ని కూడా చర్చించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే మరోవైపు మరికొద్దిరోజుల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర రాజకీయాలతో పాటు మరికొన్ని కీలక అంశాలు కూడా ఈ కీలక భేటీలో చర్చకు రావొచ్చని తెలుస్తోంది.
ఢిల్లీలో చంద్రబాబు, పవన్…
Chandrababu meets Amith shah: సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు భేటీ అయ్యారు. బుధవారం సాయంత్రం ఢిల్లీ వచ్చిన చంద్రబాబు రాత్రి పొద్దుపోయిన తర్వాత 11.30గంటలకు అమిత్ షా నివాసానికి చేరుకున్నారు. దాదాపు గంట పాటు ఈ చర్చలు జరిగాయి. భేటీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. భేటీ ముగియనడానికి పది నిమిషాల ముందే జేపీ నడ్డా అమిత్ షా నివాసం నుంచి వెళ్లిపోయారు.
అమిత్ షాతో భేటీ పూర్తైన తర్వాత ఇరు పార్టీల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. టిడిపి అధినేత చంద్రబాబు తో చర్చల పై పెదవి విప్పని బిజేపి వర్గాలు. చర్చల గురించి అధికారికంగా ఏలాంటి ప్రకటనలు, సమాచారం ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ నుంచి వచ్చే అవకాశం లేదని బిజేపి వర్గాలు స్పష్టం చేశాయి. చర్చలపై మాట్లాడేందుకు బిజేపి నాయకులు ఏమాత్రం ఇష్టపడలేదు. చర్చలు ముగిసిన తర్వాత అమిత్ షా నివాసం నుంచి రామ్మోహన్ నాయుడు నివాసానికి చంద్రబాబు వెళ్లారు. రాత్రి రామ్మోహన్ నాయుడు నివాసంలోనే బస చేశారు. చంద్రబాబు భేటీ తర్వాత టీడీపీ, బీజేపీ మధ్య ఒక అవగాహన కుదిరినట్లు టీడీపీ వర్గాలు సంకేతాలను ఇచ్చాయి. ఇరు పార్టీల ప్రయోజనాల రీత్యా కలిసి పని చేయడంపై టీడీపీ, బీజేపీ మధ్య ఒక అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. సుమారు గంటపాటు జరిగిన చర్చల్లో ఏపీలో ఇరుపార్టీలను బలోపేతం చేయడంపై చర్చలు జరిగినట్టు తెలుస్తోంది . దేశవ్యాప్తంగా ఎన్డీయే కూటమిని తిరిగి బలోపేతం చేస్తున్నామని, దేశాన్ని బలోపేతం చేయాలంటే అన్ని ప్రాంతాల్లో తమ కూటమి అవసరమని అమిత్ షా పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan Delhi Tour) కు కూడా బీజేపీ అధిష్టానం నుంచి పిలుపువచ్చినట్లు సమాచారం.. దీంతో పవన్ హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. ఇవాళ బీజేపీ పెద్దలతో పవన్ చర్చలు జరిపే అవకాశం ఉంది. ఈ భేటీలో చంద్రబాబు కూడా ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక జరిగితే… మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరటంతో పాటు సీట్ల విషయంలో కూడా అవగాహనకు వచ్చే ఛాన్స్ ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే… ఓవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలు ఢిల్లీలో ఉండగానే… మరోవైపు ముఖ్యమంత్రి జగన్ ఇవాళ హస్తినకు వెళ్తుండటంతో… నవ్యాంధ్ర రాజకీయం ఆస్తకికరంగా మారిపోయింది.