YS Jagan In Bhimavaram: ఆడవాళ్లను ఆట వస్తువులుగా చూసే పవన్‌కు ఓట్లేస్తారా.. సిఎం జగన్
YS Jagan In Bhimavaram: ప్యాకేజీలు కోసం త్యాగాలు చేసే పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రిగా ప్రజలకు ఒక్క మంచి చేయని చంద్రబాబు ఏ ముఖంతో ప్రజలను ఓట్లు అడుగుతారని జగన్ ప్రశ్నించారు.
YS Jagan In Bhimavaram: పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు చేసిందేమిటో చెప్పుకోడానికి ఒక్క మంచి పని కూడా లేదని జగన్ ఎద్దేవా చేశారు. ప్రజలకు మంచి చేయాలని చంద్రబాబు ఏనాడు ఆలోచించలేదని, కేవలం అవినీతి కోసమే పనిచేశారన్నారు
14 ఏళ్ల పాలనలో ప్రజల కోసం చంద్రబాబు ఏమీ చేయలేదని, చంద్రబాబుకు దోచుకోవడం.. పంచుకోవడమే తెలుసన్నారు. చంద్రబాబు సీఎం కావాలనే పవన్ పార్టీ పెట్టారని ఆఱోపించారు. ప్యాకేజీల కోసం త్యాగాలు చేసే వ్యక్తిని ఎన్నడూ చూడలేదని, ప్యాకేజీ స్టార్ ఆడవాళ్లను ఆటవస్తువుగా చూస్తారని, అలాంటి వారికి ఓటు వేయడం ధర్మమేనా? అని ప్రశ్నించారు.
భీమవరంలో జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల కార్యక్రమంలో సిఎం జగన్ పాల్గొన్నారు. తల్లల తల్లుల ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు జమ చేశారు. 8.09 లక్షల మంది విద్యార్థులకు రూ.584 కోట్లు ఆర్థిక సాయం విడుదల చేశారు. 2023-24 జూలై-సెప్టెంబర్ జగనన్న విద్యాదీవెన నిధులను జమ చేశారు.
ఇప్పటివరకు విద్యా దీవెన పథకం ద్వారా రూ.11,900 కోట్లు ఖర్చుచేశామని సిఎం చెప్పారు. జగనన్న వసతి దీవెన కింద రూ.4,275 కోట్లు ఇచ్చామని, నాలుగున్నరేళ్లలో విప్లవాత్మకమైన అడుగులు వేశామన్నారు. ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వ బడుల రూపురేఖల్ని మార్చామని 27.61 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందించినట్టు జగన్ చెప్పారు.
అవినీతిలో వాటాలు…
పద్నాలుగేళ్లు సిఎంగా పని చేసినా ప్రజలకు మంచి చేయడానికి చంద్రబాబు అధికారం ఉపయోగించలేదని ఎద్దేవా చేశారు. అవినీతి కోసమే అధికారాన్ని వాడుకున్నారని ఆరోపించారు. అవినీతిలో వాటాదారులకు బిస్కట్లు వేసి పంచి పెట్టారని ఆరోపించారు.
అధికారంలో ఉన్నపుడు ప్రజలకు మంచి చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదని, అధికారంలో ఉండగా దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం మాత్రమే చేశారన్నారు. 55నెలల్లో తాను చేయగలిగింది వారు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు.
వారు చేసిన పని వల్ల ప్రజల మనసుల్లో స్థానం కోల్పోయారని, విలువలు, విశ్వసనీయత లేదన్నారు. అధికారం అనేది ప్రజలకు మంచి చేయడం కోసం కాకుండా వారు బాగు పడటం కోసమేనని విమర్శించారు.
అధికారం కోసం ప్రజలకు అబద్దాలు చెబుతూ, మోసాలు చేస్తూ, వెన్నుపోటులు పొడిచే రాజకీయాలు చేస్తున్నారన్నారు. దుష్ట చతుష్టయానికి సంబంధించిన ముఠాలో భీమవరం ప్రజలు తిరస్కరించిన దత్తపుత్రుడు కూడా ఉన్నారని జగన్ ఆరోపించారు.
పవన్ కళ్యాణ్ నివాసం ఎక్కడ…
చంద్రబాబు దత్తపుత్రుడికి పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటుందని, అడ్రస్ అక్కడే ఉంటుందని, నాన్ లోకల్ అయినా, పక్క వాడు సిఎం కావాలని పార్టీ పెట్టిన వాడు పవన్ తప్ప ఎవరు ఉండరని జగన్ మోహన్ రెడ్డి ఎద్దేవా చేశాడు. ఒంటరిగా పోటీ చేసే సత్తా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు లేదన్నారు.
బాబు ముఖ్యమంత్రైతే చాలు అదే తనకు వందలకోట్లు అని, బాబు కోసం తన జీవితమని, అందులో అంగీకరించని వారిని తన పార్టీలో ఉండకూడదని, తన పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని తన సభల్లో చెప్పే వారిని కూడా ఎక్కడ చూడలేదన్నారు.
దత్త పుత్రుడికి బాబు పొత్తులో ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే, ఏ సీటు ఇవ్వకపోయినా ఓకే అన్నారు. చిత్తం ప్రభు అనే త్యాగాల త్యాగరాజును దత్తపుత్రుడిలో చూస్తున్నాం అన్నారు. ప్యాకేజీల కోసం త్యాగం చేసే వారిని ఎక్కడ చూడలేమన్నారు. ప్యాకేజీల కోసం తన వారిని త్యాగం చేసే త్యాగాల త్యాగరాజు ఇక్కడే చూస్తున్నామన్నారు.
త్యాగాల త్యాగరాజు పవన్ కళ్యాణ్…
త్యాగాల త్యాగరాజు నిజ జీవితంలో ఏ భార్యతో కూడా ముచ్చటగా ముణ్ణాళ్లు కూడా కాపురం చేయని మ్యారేజీ స్టార్ అని జగన్ ఎద్దేవా చేశారు. ఆడవారిని ఆట వస్తువులుగా చూస్తూ పెళ్లి అనే పవిత్ర వ్యవస్థ, సాంప్రదాయాన్ని మంట గలుపుతూ నాలుగేళ్లకోసారి పెళ్లి చేసుకోవడం, విడాకులు, ఇవ్వడం పరిపాటిగా మారిందన్నారు.
కార్లను మార్చినట్టు భార్యల్ని మార్చే పెద్ద మనిషి, మూడు నాలుగేళ్ల భార్య మార్చి, ఇప్పటికే ముగ్గురు భార్యల్ని మార్చేశాడన్నారు. తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, చెల్లెళ్లు ఉన్నారని ఇలాంటి వారు నాయకులు అయితే నాలుగేళ్లకోసారి ఇలా చేస్తే మన ఆడబిడ్డల పరిస్థితి ఏమిటన్నారు.
ఇలాంటి కార్యక్రమాలు చేసే ఇలాంటి వారికి ఓటు వేయడం ధర్మమేనా అని ప్రశ్నించారు. ఏ భార్యతో కనీసం మూడు నాలుగేళ్ల కాపురం చేయని మనిషి, చంద్రబాబుతో రాజకీయాల్లో తన వివాహ బంధం కనీసం పది-పదిహేనేళ్లు ఉండాలని చెబుతున్నాడన్నారు. రెండు విషాలు కలిస్తే మాత్రం అమృతం తయారవుతుందా అని ప్రశ్నించారు. నలుగురు కలిస్తే మంది పెరగడం తప్పా ప్రజలకు మంచి చేయగలుగుతారా అని సిఎం జగన్ అన్నారు.
పిల్లను ఇచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన క్యారెక్టర్ చంద్రబాబుదని, ప్రతి ఎన్నికల్లోను రంగురంగుల మ్యానిఫెస్టో చూపించి ప్రజల్ని మోసం చేసే చంద్రబాబు, ప్యాకేజీల కోసం తన వారిని తాకట్టు పెట్టే ఇద్దరి కుటిల నీతితో ఏ ఒక్కరైనా ఎదగగలరా అని ప్రశ్నించారు.
75ఏళ్ల చంద్రబాబు పద్నాలుగేళ్లు సిఎంగా పనిచేశాడని, మూడు సార్లు సిఎంగా ఉన్నాడని, నాలుగున్నరేళ్లు పరిపాలించిన తనతో ఢీకొడుతున్నాడని జగన్ చెప్పారు.
ఏమి మంచి చేశారో చెప్పాలి…
14ఏళ్లలో చేసిన మంచి ఏమైనా ఉంటే ప్రజలను ఓటు వేయమని అడగాలన్నారు. అమ్మఒడి కంటే మెరుగైన పథకం అమలు చేసి ఉంటే, తాను అమలు చేశానని చెప్పి ఓటు అడగాలని, పొదుపు సంఘాల మహిళల కోసం వైఎస్సార్ ఆసరా కంటే మెరుగైన పథకాన్ని అమలు చేసి ఉంటే చెప్పాలన్నారు.
వైసీపీ ప్రభుత్వం ఇచ్చినట్టు 31లక్షల ఇంటి స్థలాల్లో 22లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందని, ఇంతకంటే ఎక్కువగా తాను చేశానని బాబు చెప్పగలరా అన్నారు.
డిబిటి పథకాల ద్వారా రూ.2.45లక్షల కోట్లు నేరుగా ఖాతాలకు పంపించినట్టు చెప్పారు. 55నెలల్లోనే బటన్ నొక్కి డబ్బులు జమ చేశామని, తన పాలనలో ఎంత డబ్బు ఇచ్చాడో రచ్చబండ దగ్గర నిలబడి చెప్పగలరా అని ప్రశ్నించారు. 2014-19మధ్య ఎంత డబ్బు ఇచ్చారో చెప్పగలరా అన్నారు. తమ ప్రభుత్వం ఎంత ఇచ్చిందో చెప్పాలని, కుప్పంలోనైనా, ఏ ఇంట్లో అయినా తాను ఏమి చేశాడో చెప్పాలన్నారు. చంద్రబాబుకు మంచి చేసిన చరిత్ర లేనే లేదన్నారు.
కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామంలో అయినా ఆ గ్రామంలో గ్రామ సచివాలయం ఎవరు పెట్టారంటే గుర్తుకు వచ్చేది జగన్ అన్నారు. పౌర సేవల్ని గ్రామస్థాయికి చేర్చి, సచివాలయాల్లో పదిమంది ఉద్యోగులతో పౌరసేవలు ఎవరు తీసుకు వచ్చారు అంటే గుర్తుకు వచ్చేది జగన్ అన్నారు. ఏ గ్రామంలో అయినా ప్రతి యాభై ఇళ్లకు ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేస్తోంది ఎవరు, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసింది ఎవరో అందరికీ తెలుసన్నారు.
భీమవరం రియల్ హీరో…
భీమవరంలో సినిమా హీరోలు కాదని, రియల్ లైఫ్ హీరోను తాను నిలబెడుతున్నట్టు చెప్పారు. మంత్రి పదవి లేకపోయినా భీమవరంను జిల్లా కేంద్రం చేయాలని గ్రంథి శ్రీనివాస్ కోరాడని, రియల్ లైఫ్ హీరో మాత్రమే అలా కోరగలరన్నారు. భీమవరం మునిసిపాలిటీలో హౌసింగ్ కాలనీల లెవలింగ్‌కు రూ.39కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. వీరవాసరం మండలంలో రోడ్డు నిర్మాణానికి ఐదున్నర కోట్లు, యనమదర్రు డ్రెయిన్ పై ఫుట్‌పాత్ బ్రిడ్జి నిర్మాణం, కుందేరు డ్యామ్ వంతెనకు నిధులు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. sarathcb