TDP Chargesheet: విఫలమైన సిఎంగా జగన్‌ కొత్త రికార్డు సృష్టించారన్న చంద్రబాబు-chandrababu said that jagan has created a new record as a failed cm ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tdp Chargesheet: విఫలమైన సిఎంగా జగన్‌ కొత్త రికార్డు సృష్టించారన్న చంద్రబాబు

TDP Chargesheet: విఫలమైన సిఎంగా జగన్‌ కొత్త రికార్డు సృష్టించారన్న చంద్రబాబు

Sarath chandra.B HT Telugu
Feb 05, 2024 09:53 AM IST

TDP Chargesheet: విఫల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎద్దేవా చేశారు. 99 శాతం హామీల అమలు అనేది అతి పెద్ద బూటకమని ఆరోపించారు.

వైసీపీపై ఛార్జీషీట్ విడుదల చేసిన చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు
వైసీపీపై ఛార్జీషీట్ విడుదల చేసిన చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు

TDP Chargesheet: అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజాకోర్టులో శిక్ష పడడం ఖాయమని అతి పెద్ద ఫెయిల్యూర్ సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు.

ఎన్నికల ముందు ఊరూరా తిరిగి అడ్డగోలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ నేడు ప్రజలను నిట్టనిలువునా మోసం చేశాడని దుయ్యబట్టారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన టీడీఎల్పీ సమావేశంలో ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.

ఈ సమావేశంలో ‘ప్రజాకోర్టు – జగన్ నెరవేర్చని హామీలపై టీడీఎల్పీ ఛార్జ్ షీట్’ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ...మేనిఫెస్టో, పాదయాత్రలో మొత్తం 730 హామీల్లో 21 శాతం కూడా అమలు చేయకుండా 99 శాతం అమలు చేశానంటూ ప్రజల్ని వంచిస్తున్నాడని అన్నారు.

మోస పూరిత మాటలతో ప్రజలను మోసం చేస్తున్న జగన్ కు మరో రెండు నెలల్లో ప్రజాకోర్టులో శిక్ష తప్పదని చంద్రబాబు అన్నారు. ‘‘విద్యుత్ ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చి మాట తప్పి మడమ తిప్పి రూ.64 వేల కోట్ల భారం మోపాడన్నారు.

మద్య నిషేధం హామీని..అటకెక్కించి మద్యం అమ్మకాలపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి రూ.25 వేల కోట్లు అప్పులు తెచ్చాడు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ హామీ గాలికొదిలేశాడన్నారు.

నిత్యావసర వస్తువుల ధరలు, పన్నులు, ఛార్జీలతో ఒక్కో కుటుంబంపై రూ.8 లక్షల భారం మోపాడు. పెట్రోల్ డీజిల్ ధరలపై మాట తప్పి....జనం జేబులు కొల్లగొడుతున్నాడని మండి పడ్డారు.

వారంలో సీపీఎస్ రద్దు హామీపై మాట తప్పాడని తెలియక హామీ ఇచ్చానంటూ తప్పించుకున్నాడన్నారు. మెడలు వంచైనా ప్రత్యేక హోదా సాధిస్తానన్న హామీపై మాటే మాట్లాడడం లేదన్నారు.

జలయజ్ఞం అంటూ ఆర్భాటంగా ప్రకటించి, ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేదని ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ హామీ ఏమైందో తెలీదు. సొంత జిల్లాలో ఏర్పాటు చేస్తానన్న స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై నాలుక మడతేశాడన్నారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ హామీ గాలికొదిలేశాడన్నారు.

ఒక్కటని కాదు....తాను ఇచ్చిన ఏ హామీనీ జగన్ అమలు చేయలేదు ?’’ అని చంద్రబాబు దుయ్యబట్టారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.

Whats_app_banner