AP Rains : ఏపీ వాసులకు చల్లటి కబురు, రానున్న 5 రోజులు వర్షాలు-amaravati weather update rain in many districts in ap next five days ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Rains : ఏపీ వాసులకు చల్లటి కబురు, రానున్న 5 రోజులు వర్షాలు

AP Rains : ఏపీ వాసులకు చల్లటి కబురు, రానున్న 5 రోజులు వర్షాలు

Bandaru Satyaprasad HT Telugu
Jun 15, 2024 10:39 PM IST

AP Rains : ఏపీలో రానున్న 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.

ఏపీ వాసులకు చల్లటి కబురు, రానున్న 5 రోజులు వర్షాలు
ఏపీ వాసులకు చల్లటి కబురు, రానున్న 5 రోజులు వర్షాలు (APSDMA )

AP Rains : రాయలసీమ నుంచి పశ్చిమమధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 3.1-5.8 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో రాబోయే 5 రోజులలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రేపు(ఆదివారం) అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

పిడుగులు పడే అవకాశం

ఎల్లుండి(సోమవారం) అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.శనివారం సాయంత్రం 6 గంటల నాటికి విజయనగరం జిల్లా దత్తిరాజేరులో 78.5 మి.మీ, బాడంగిలో 60.2 మి.మీ,కాకినాడ జిల్లా శంఖవరంలో 51.7 మి.మీ, విజయనగరం నెల్లిమర్లలో 37.5 మి.మీ, చీపురుపల్లిలో 37 మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.

తెలంగాణలో వర్షాలు

ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రజలు హైదారాబాద్ వాతావరణ కేంద్రం కూల్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని తెలిపింది. ద్రోణి కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు సముద్రమట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తన ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది. దీంతో ఆదివారం కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, రంగారెడ్డి, వరంగల్‌, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడనున్నాయని వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పెద్దపల్లి, భూపాలపల్లి, రంగారెడ్డి, భువనగిరి, నిర్మల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Whats_app_banner

సంబంధిత కథనం