AP Assembly Session : జూన్ 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, మూడు రోజుల పాటు నిర్వహణ-amaravati ap assembly session dates confirmed june 24 to 26 three days session conducts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Assembly Session : జూన్ 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, మూడు రోజుల పాటు నిర్వహణ

AP Assembly Session : జూన్ 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, మూడు రోజుల పాటు నిర్వహణ

Bandaru Satyaprasad HT Telugu
Jun 17, 2024 08:28 PM IST

AP Assembly Session : ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు తేదీలు ఖరారు చేసింది. జూన్ 24 నుంచి మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నారు.

జూన్ 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
జూన్ 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly Session : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి తొలి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తోంది. జూన్ 24 నుంచి మూడు రోజుల పాటు అంటే జూన్ 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే వాస్తవానికి ఈ నెల 19 నుంచే సమావేశాలు నిర్వహించాల్సి ఉండగా, గవర్నర్ అబ్దుల్ నజీర్ బక్రీద్ సందర్భంగా సెలవులపై ఉన్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాల తేదీల్లో మార్పు జరిగింది. ఈ నెల 24న ప్రొటెం స్పీకర్ ఎన్నిక తర్వాత నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

yearly horoscope entry point

స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు!

ఏపీలో పొత్తుతో పోటీ చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కూటమి ప్రభుత్వానికి సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్ పంపకాలు కూడా పూర్తయ్యాయి. జనసేనకు మూడు మంత్రి పదవులు, బీజేపీకి ఒక కేబినేట్ స్థానాన్ని కేటాయించారు చంద్రబాబు. కేబినెట్ లో సీనియర్లతో పాటు కొత్త వారికి అవకాశం కల్పించారు. అయితే ఇప్పుడు స్పీకర్ పదవిపై ఆసక్తి నెలకొంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను సీనియర్లకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఏపీ శాసనసభ స్పీకర్ రేసులో టీడీపీ సీనియర్ల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు పేరు ప్రథమంగా వినిపిస్తుంది.

అయ్యన్నకు స్పీకర్ గా అవకాశం ఇస్తారని తెలుస్తోంది. అయ్యన్న పాత్రుడి పేరును దాదాపు ఖరారు అయినట్లేనని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవిపై జనసేన ఆసక్తిగా ఉందని తెలుస్తోంది. జనసేన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి లేదా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్లను డిప్యూటీ స్పీకర్ పదవికి పరిశీలిస్తున్నట్లు సమాచారం. చీఫ్‌ విప్‌గా టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర పేరును చంద్రబాబు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. వీటిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

జగన్ అసెంబ్లీ వస్తారా?

ఏపీ అసెంబ్లీ సమావేశాలు జూన్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాల తొలిరోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ప్రోటెం స్పీకర్ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. టీడీపీ నుంచి 135 మంది, జనసేన నుంచి 21, వైసీపీ నుంచి 11 మంది, బీజేపీ నుంచి 9 మంది ఎమ్మెల్యేలు ఈసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గత సభలో 151 సభ్యులతో ఉన్న వైసీపీ ఈసారి 11కే పరిమితం అయ్యింది. వైసీపీ ప్రతిపక్ష హోదా కూడా లభించలేదు. అసలు వైసీపీ ఎమ్మెల్యేలు ముఖ్యంగా జగన్ అసెంబ్లీ వస్తారా? అనేది చర్చగా మారింది. అందరు ఎమ్మెల్యేలతో కలిసి జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారా? లేదా స్పీకర్ ఛాంబర్ లో బాధ్యతలు తీసుకుంటారా? అనేది ఆసక్తిగా మారింది.

Whats_app_banner

సంబంధిత కథనం