Lok Sabha Speaker : లోక్​సభ స్పీకర్​ని ఎలా ఎన్నుకుంటారు? ఈ పోస్ట్​కి ఎందుకంత డిమాండ్​?-how is lok sabha speaker elected explained in 5 points ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Lok Sabha Speaker : లోక్​సభ స్పీకర్​ని ఎలా ఎన్నుకుంటారు? ఈ పోస్ట్​కి ఎందుకంత డిమాండ్​?

Lok Sabha Speaker : లోక్​సభ స్పీకర్​ని ఎలా ఎన్నుకుంటారు? ఈ పోస్ట్​కి ఎందుకంత డిమాండ్​?

Sharath Chitturi HT Telugu
Jun 17, 2024 06:15 PM IST

తదుపరి స్పీకర్ ఎవరనే దానిపై ఊహాగానాలు కొనసాగుతుండగానే, లోక్ సభలో కీలకమైన పదవిని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన జనతాదళ్ (యునైటెడ్), తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లకు కేటాయించాలని ప్రతిపక్ష బీజేపీ పట్టుబట్టింది.

లోక్​సభకు నెక్ట్స్​ స్పీకర్​ ఎవరు?
లోక్​సభకు నెక్ట్స్​ స్పీకర్​ ఎవరు? (PTI)

Lok Sabha speaker : 18వ లోక్​సభ తొలి సమావేసాలు ఈ నెల 24న ప్రారంభంకానున్నాయి. ఇప్పుడందరి ఫోకస్​.. లోక్​సభ స్పీకర్​ పోస్ట్​పైనే! ఈ విషయంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. అసలు లోక్​సభ స్పీకర్​ పోస్ట్​కి అంత డిమాండ్​ ఎందుకు ఉంది? స్పీకర్​కి ఉన్న అధికారాలేంటి? లోక్​సభ నెక్ట్స్​ స్పీకర్​ రేసులో ఎవరెవరు ఉన్నారు? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము.

ఈసారి స్పీకర్ పదవి ఎందుకు ముఖ్యం?

ప్రధాని మోదీ నేతృత్వంలోని గత రెండు ప్రభుత్వాలకు భిన్నంగా బీజేపీకి ఈసారి పూర్తి మెజారిటీ రాలేదు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని మూడో కేంద్ర ప్రభుత్వం మిత్రపక్షాలతో కూడిన ఎన్​డీఏపై ఆధారపడింది.

ఇటీవల ముగిసిన లోక్​సభ ఎన్నికలు 2024 లో బీజేపీ 240 లోక్​సభ స్థానాలను గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ వరుసగా 16, 12 స్థానాలను గెలుచుకుని కొత్త ప్రధాని మోద నేతృత్వంలోని ప్రభుత్వంలో కీలక భాగస్వాములుగా అవతరించాయి.

మిత్రపక్షాలు ఏమంటున్నాయి?

అభ్యర్థిని ఎన్​డీఏ భాగస్వామ్య పక్షాలు ఉమ్మడిగా నిర్ణయించాలని టీడీపీ నేతలు చెబుతుండగా, బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థికి తమ పార్టీ కూడా మద్దతివ్వవచ్చని జేడీయూ నేత కేసీ త్యాగి సంకేతాలిచ్చారు.

లోక్​సభ స్పీకర్​ను ఎలా ఎన్నుకుంటారు?

Who is next Lok Sabha speaker : స్పీకర్​ను ఎన్నుకునే నియమాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 93లో పొందుపరిచారు. కొత్త లోక్​సభ మొదటిసారి సమావేశం కావడానికి ముందు స్పీకర్ పదవి ఖాళీ అవుతుంది. అంటే ప్రస్తుత సందర్భంలో జూన్ 24.

ఈ ప్రక్రియ ప్రకారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందు రాష్ట్రపతి ప్రొటెం స్పీకర్​ను నియమిస్తారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు ప్రోటెం స్పీకర్​ . జూన్ 24 నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో మొదటి రెండు రోజులు అంటే జూన్ 24, 25 తేదీల్లో కొత్తగా ఎన్నికైన లోక్​సభ ఎంపీల ప్రమాణ స్వీకారానికి కేటాయించనున్నారు. అభ్యర్థులకు మద్దతిచ్చే తీర్మానాలకు సంబంధించిన నోటీసులను ఎన్నికలకు ఒక రోజు ముందు అంటే జూన్ 25 మధ్యాహ్నం 12 గంటలలోపు సభా సభ్యులు సమర్పించాలి.

లోక్​సభ స్పీకర్​ను సాధారణ మెజారిటీతో ఎన్నుకుంటారు. అంటే సభలో ఉన్న సభ్యుల్లో సగానికి పైగా ఎంపీలు లోక్​సభ స్పీకర్ కావడానికి సంబంధిత అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుంది.

స్పీకర్​ను నియమించడానికి ఎలాంటి ప్రమాణాలు లేవు. బీజేపీ నేతలు సుమిత్రా మహాజన్, ఓం బిర్లా గత రెండు లోక్​సభల్లో స్పీకర్లుగా వ్యవహరించారు.

లోక్​సభ స్పీకర్ అధికారాలు ఏంటి?

Why is Lok Sabha speaker important : సభను నడపడానికి స్పీకర్ బాధ్యత వహిస్తారు. అందుకే అది చాలా కీలక పదవి. పార్లమెంటరీ సమావేశాల ఎజెండాను కూడా స్పీకర్ నిర్ణయిస్తారు. వాయిదాలు, అవిశ్వాసం వంటి తీర్మానాలను కూడా అనుమతిస్తారు.

సభా నియమాలకు సంబంధించి ఏదైనా వివాదం తలెత్తితే స్పీకర్ చాలా కీలకంగా వ్యవహరిస్తారు. రూల్స్​ని అర్థం చేసుకుని అమలు చేయాలి. వాటిని ఇంకెవరు సవాలు చేయలేరు. సభలో అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఉన్నందున స్పీకర్ కుర్చీ పక్షపాతం లేకుండా ఉండాలి.

స్పీకర్ కూడా ఒక నిర్దిష్ట పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ లోక్​సభకు ఎన్నికైన సభ్యుడు కావడంతో ఈ పాత్ర మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది.

అయితే, స్పీకర్ పదవి చేపట్టక ముందే పార్టీని వీడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు, ఎన్ సంజీవరెడ్డి మార్చి 1967లో నాల్గొవ లోక్ సభ స్పీకర్​గా ఎన్నికైన తరువాత కాంగ్రెస్​కు రాజీనామా చేశారు.

బీజేపీ మిత్రపక్షాలపై ఆధారపడుతుంది కాబట్టి, సభలో ప్రభుత్వం సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉండవచ్చు. అటువంటి పరిస్థితిలో, సభాపతి పాత్ర కీలకం అవుతుంది.

రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు ప్రకారం ఫిరాయింపుల ఆధారంగా సభ్యులను శిక్షించడంతోపాటు వారిపై అనర్హత వేటు వేసే అధికారం కూడా స్పీకర్​కు ఉంది.

ఈసారి స్పీకర్​ అయ్యేది ఎవరు?

కొన్ని నివేదికల ప్రకారం ఓం బిర్లా లోక్​సభ స్పీకర్​గా కొనసాగుతారు. బిర్లా లోక్​సభ ఎన్నికల్లో రాజస్థాన్​లోని కోటా నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచారు.

లోక్​సభ కొత్త స్పీకర్, డిప్యూటీ స్పీకర్​ను నిర్ణయించాల్సింది రాజకీయ పార్టీలేనని ఓం బిర్లా జూన్ 16న చెప్పారు. జూన్ 16న దేశ రాజధానిలోని రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ నివాసంలో సమావేశమైన ఎన్​డీఏ నేతలు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికపై చర్చించారు.

స్పీకర్ పదవి కోసం ప్రచారంలో ఉన్న ఇతర పేర్లలో దగ్గుబాటి పురంధేశ్వరి పేరు కూడా ఉంది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్​టీ రామారావు కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి ఆంధ్రప్రదేశ్​కి చెందిన బీజేపీ రాజకీయ నాయకురాలు, రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు.

పురంధేశ్వరి 2009లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రిగా, 2012లో వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రిగా పనిచేశారు. ఇటీవల ముగిసిన లోక్​సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్​లోని రాజమండ్రి నుంచి 2.3 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో.. పురంధేశ్వరి లోక్​సభ స్పీకర్​ అవ్వడం ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి.

స్పీకర్​గా పురంధేశ్వరి ఎన్నిక కావడం టీడీపీ అధినేత చంద్రబాబుకు సంతోషం కలిగించే విషయమే అవుతుంది! చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, పురంధేశ్వరి సోదరీమణులు. గత వారం ఆంధ్రప్రదేశ్​లో చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి పురంధేశ్వరి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.

WhatsApp channel

సంబంధిత కథనం