Rahul Gandhi: లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ; సీడబ్ల్యూసీ తీర్మానం ఆమోదం-cwc passes resolution to appoint rahul gandhi as lop in lok sabha ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rahul Gandhi: లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ; సీడబ్ల్యూసీ తీర్మానం ఆమోదం

Rahul Gandhi: లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ; సీడబ్ల్యూసీ తీర్మానం ఆమోదం

HT Telugu Desk HT Telugu
Jun 08, 2024 03:37 PM IST

లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని నియమిస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలను సాధించి, 99 సీట్లను గెల్చుకున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో శనివారం ఢిల్లీలో సమావేశమైన సీడబ్ల్యూసీ రాహుల్ ను లోక్ సభ లో ప్రతిపక్ష నేతగా తీర్మానించింది.

లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ
లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ (PTI)

Rahul Gandhi as LoP: లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని నియమించాలని కోరుతూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసిందని పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ శనివారం తెలిపారు. లోక్ సభలో ప్రతిపక్ష నేత పదవి చేపట్టాలని రాహుల్ గాంధీని సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా కోరింది. పార్లమెంటు లోపల ప్రతిపక్షానికి నాయకత్వం వహించడానికి రాహుల్ సరైన వ్యక్తి అని కేసీ వేణుగోపాల్ మీడియా సమావేశంలో అన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన అలుపెరగని కృషిని సీడబ్ల్యూసీ తీర్మానం ప్రశంసించింది.

భారత్ జోడో యాత్ర

‘‘కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేసిన భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ్ యాత్ర కాంగ్రెస్ ను దేశ ప్రజలకు మరింత దగ్గర చేసింది. ఆయన ఆలోచనలను, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఈ రెండు యాత్రలు దేశ రాజకీయాల్లో చారిత్రాత్మక మలుపులు. లక్షలాది మంది కార్యకర్తలు, కోట్లాది మంది ఓటర్లలో ఆశలు, విశ్వాసాన్ని ఈ రెండు యాత్రలు నింపాయి’’ అని సీడబ్ల్యూసీ తీర్మానంలో పేర్కొన్నారు.

రాజ్యాంగ పరిరక్షణ లక్ష్యంగా..

‘‘రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం సింగిల్ మైండెడ్ గా, పదునైనదిగా, సూటిగా సాగింది. 2024 ఎన్నికల్లో రాజ్యాంగ పరిరక్షణను ప్రధాన అంశంగా చేసింది ఆయనే. ఎన్నికల ప్రచారంలో చాలా శక్తివంతంగా ప్రతిధ్వనించిన పాంచ్ న్యాయ్-పచీస్ హామీ కార్యక్రమం రాహుల్ యాత్రల ఫలితమే. ఇందులో ప్రజలందరి భయాలు, ఆందోళనలు, ఆకాంక్షలను, ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు, కార్మికులు, దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, మైనారిటీల ఆకాంక్షలు ప్రతిబింబించాయి’’ అని ఆ తీర్మానంలో పేర్కొన్నారు.

రాహుల్ అంగీకరించారా?

లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత పదవిని స్వీకరించడానికి రాహుల్ గాంధీ అంగీకరించారా అని ప్రశ్నించగా, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు. తమ నాయకుడు, కార్యకర్తలను ఉత్సాహపరచడంతో కాంగ్రెస్ పునరుజ్జీవనం ప్రారంభమైందని వేణుగోపాల్ అన్నారు. సీడబ్ల్యూసీలో నాలుగు నెలల క్రితంతో పోలిస్తే వాతావరణం పూర్తిగా భిన్నంగా, ఉత్సాహంగా ఉందని ఆయన అన్నారు. ‘రాహుల్ గాంధీ కచ్చితంగా లోక్ సభలో ప్రతిపక్ష నేత కావాలి. ఇది మా కార్యవర్గ అభ్యర్థన. ఆయన నిర్భయుడు, ధైర్యవంతుడు’ అని సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ప్రమోద్ తివారీ అన్నారు.