Lok Sabha Speaker: లోక్ సభ స్పీకర్ గా దగ్గుపాటి పురంధేశ్వరి?.. వ్యూహాత్మకంగా బీజేపీ అడుగులు
Modi 3.0 Cabinet: ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ పై స్పష్టత వచ్చిన నేపథ్యంలో, ఇప్పుడు కీలకమైన లోక్ సభ స్పీకర్ పదవి ఎవరికి దక్కనుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఎన్డీయేలో కీలక మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ, జేడీయూలు ఈ పదవిని కోరుతున్న నేపథ్యంలో, బీజేపీ వ్యూహాత్మంకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు మోదీ 3.0 ప్రభుత్వంలో మంత్రి పదవుల అంశంపై స్పష్టత వచ్చింది.దాంతో, దేశ రాజకీయాలు ఇప్పుడు లోక్ సభ స్పీకర్ పదవి చుట్టూ కేంద్రీకృతమయ్యాయి. ఈ కీలక పదవిని చేజిక్కించుకోవాలని ఎన్డీయేలో కీలక మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ, జేడీయూలు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు, సంకీర్ణ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించాల్సిన స్పీకర్ పదవిని మిత్రపక్షాలకు ఇవ్వాలని బీజేపీ, ప్రధాని మోదీ భావించడం లేదు.
పురంధేశ్వరికి స్పీకర్ పదవి..
ఈ నేపథ్యంలో స్పీకర్ పదవి కోసం బీజేపీ నేత, ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ చీఫ్, ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున రాజమండ్రి స్థానం నుంచి గెలిచిన పురంధేశ్వరి పేరు తెర పైకి వచ్చింది. పురంధేశ్వరికి స్పీకర్ పదవి ఇవ్వనున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. పురంధేశ్వరికి స్పీకర్ పదవి ఇవ్వడం కోసమే, ఆమెకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదని తెలుస్తోంది. మరోవైపు, పురంధేశ్వరికి స్పీకర్ పదవి ఇవ్వడం వల్ల బీజేపీకి వ్యూహాత్మకంగా బీజేపీకి చాలా ప్రయోజనాలున్నాయి. పురంధేశ్వరికి స్పీకర్ పదవి ఇవ్వడాన్ని టీడీపీ చీఫ్, ఎన్డీయేలో కీలక మిత్రపక్షమైన టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు వ్యతిరేకించలేరు. ఆమెను కాదని, తమ పార్టీ ఎంపీకి స్పీకర్ పదవి ఇవ్వాలని కోరలేరు. ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ, జనసేలతో కలిసి ఎన్డీయే తరఫున ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు.. అటు అసెంబ్లీ, ఇటు లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అందువల్ల, పురంధేశ్వరి స్పీకర్ గా ఎన్నికవడాన్ని చంద్రబాబు వ్యతిరేకించలేరు. అంతేకాదు, చంద్రబాబు భార్య భువనేశ్వరి, పురంధేశ్వరి అక్కా చెల్లెళ్లు. వారిద్దరు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కుమార్తెలు. ఇవన్నీ కాకుండా, పురంధేశ్వరికి స్పీకర్ పదవిని ఇవ్వడం ద్వారా తమ ప్రభుత్వం మహిళలకు సముచిత స్థానం కల్పిస్తోందని బీజేపీ ప్రచారం చేసుకోవచ్చు.
రేసులో ఓం బిర్లా..
లోక్ సభ స్పీకర్ పదవి రేసులో గత లోక్ సభలో స్పీకర్ గా వ్యవహరించిన ఓం బిర్లా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనవైపే మెజారిటీ బీజేపీ నేతలు మొగ్గు చూపుతున్నారని, గత లోక్ సభ లో ఆయన విజయవంతంగా సభను నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఓం బిర్లా 2024 లోక్ సభ ఎన్నికల్లో రాజస్తాన్ లోని కోటా నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
లోక్ సభ స్పీకర్ ను ఎలా ఎన్నుకుంటారు?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 93 ప్రకారం లోక్ సభ రద్దు కాగానే స్పీకర్ పదవి ఖాళీ అవుతుంది. కొత్తగా ఎన్నికైన పార్లమెంటు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడం కోసం రాష్ట్రపతి సీనియర్ ఎంపీని ప్రొటెం స్పీకర్ గా నియమిస్తారు. దీని తరువాత, లోక్ సభ స్పీకర్ ను సాధారణ మెజారిటీతో ఎన్నుకుంటారు. అంటే సభలో ఉన్న సభ్యుల్లో సగానికి పైగా ఎంపీలు ఎన్నుకున్న వ్యక్తి స్పీకర్ పదవి చేపడ్తారు. స్పీకర్ ను నియమించడానికి ఎలాంటి ప్రమాణాలు లేవు. బీజేపీ నేతలు సుమిత్రా మహాజన్, ఓం బిర్లా గత రెండు లోక్ సభల్లో స్పీకర్లుగా వ్యవహరించారు.
లోక్ సభ స్పీకర్ పాత్ర?
సభను నడపడానికి స్పీకర్ బాధ్యత వహిస్తారు కాబట్టి లోక్ సభలో కీలక పదవి. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో స్పీకర్ ది అత్యంత కీలకమైన బాధ్యత. స్పీకర్ కూడా ఒక నిర్దిష్ట పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ లోక్ సభకు ఎన్నికైన సభ్యుడు కావడంతో ఈ పాత్ర మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. కొందరు నేతలు స్పీకర్ పదవి చేపట్టక ముందే పార్టీని వీడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు, ఎన్ సంజీవరెడ్డి మార్చి 1967 లో నాల్గవ లోక్ సభ స్పీకర్ గా ఎన్నికైన తరువాత కాంగ్రెస్ కు రాజీనామా చేశారు.