గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు.. కోట్ల రూపాయల లంచం ఇచ్చారని అభియోగాలు!-us charges indian billionaire gautam adani in bribery case know in complete details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు.. కోట్ల రూపాయల లంచం ఇచ్చారని అభియోగాలు!

గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు.. కోట్ల రూపాయల లంచం ఇచ్చారని అభియోగాలు!

Anand Sai HT Telugu
Nov 21, 2024 09:19 AM IST

Gautam Adani US Case : అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. అధికారులకు లంచం ఇవ్వజూపరని అభియోగాలు నమోదు అయ్యాయి.

గౌతమ్ అదానీపై కేసు నమోదు
గౌతమ్ అదానీపై కేసు నమోదు (REUTERS)

అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ గౌతమ్ అదానీ అమెరికన్ ఇన్వెస్టర్లను మోసం చేశారని, ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చారని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) ఆరోపించింది. అదానీ మేనల్లుడు సాగర్ అదానీ, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్, అజూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ సిరిల్ కబనాస్‌పై కూడా అభియోగాలు నమోదయ్యాయి. మెుత్తం ఏడుగురిని ఈ కేసులో నిందితులుగా చేర్చినట్టుగా తెలుస్తోంది.

వైర్ మోసాలు, సెక్యూరిటీల మోసానికి పాల్పడేందుకు ఈ వ్యక్తులు కుట్ర పన్నారని ఎస్ఈసీ అభియోగాలు మోపింది. ఈ ఆరోపణలు బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టుకు సంబంధించినవి. అదానీ కంపెనీ తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయడం ద్వారా అమెరికా ఇన్వెస్టర్లు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి నిధులు సేకరించారని ఆరోపించారు. అదానీ గ్రీన్, అజూర్ పవర్ సంస్థలకు భారత ప్రభుత్వం ఇచ్చిన బిలియన్ డాలర్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను సద్వినియోగం చేసుకునేందుకు ఈ లంచం ఇచ్చినట్టుగా కూడా ఎస్ఈసీ ఆరోపించింది.

ఫెడరల్ సెక్యూరిటీస్ చట్టాల్లోని యాంటీ ఫ్రాడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఎస్ఈసీ ఫిర్యాదులో పేర్కొంది. ఎస్ఈసీ ప్రకటన ప్రకారం, ఈ కాంట్రాక్ట్ సమయంలో అదానీ గ్రీన్ యూఎస్ ఇన్వెస్టర్ల నుండి 175 మిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ .1,450 కోట్లు) సేకరించింది. మరోవైపు న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్‌లో అజూర్ పవర్ షేర్లు ట్రేడవుతున్నాయి.

అదానీ గ్రీన్, అజూర్ పవర్‌తో సంబంధం ఉన్న గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, కాబనీస్, ఇతరులపై న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం క్రిమినల్ అభియోగాలు నమోదు చేసింది. ఫారిన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్‌సీపీఏ)ను ఉల్లంఘించి లంచం ఇవ్వడానికి కుట్ర పన్నారనే అభియోగాలు ఉన్నాయి. 2020-2024 మధ్య అదానీ, ఆయన సహచరులు భారత ప్రభుత్వ అధికారులకు 250 మిలియన్ డాలర్లకు పైగా లంచాలు ఇచ్చారని అధికారులు చెబుతున్నారు. లంచం ఇవ్వడం వెనుక ఉద్దేశం సోలార్ పవర్ ప్రాజెక్టులను దక్కించుకోవడమేనని అంటున్నారు. ఇది వచ్చే 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్లకు పైగా లాభాలను ఆర్జించగలదని అంచనా.

అదానీ గ్రీన్ ఎనర్జీలో అక్రమ మార్గాల ద్వారా కంపెనీ పెట్టుబడిదారులు, రుణ దాతల నుంచి సుమారు మూడు బిలియన్ డాలర్లకుపైగా రుణాలు, బాండ్లు సేకరించిందని అభియోగాలు ఉన్నాయి. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ప్రకారం అదానీ అమెరికన్ ఇన్వెస్టర్లను మోసగించారని, అధికారులకు లంచాలు ఇచ్చారని ఆరోపణలు వస్తున్నాయి.

అదానీతోపాటుగా ఆయనకు చెందిన కొందరు వ్యక్తులు ఇన్వెస్టర్లను మోసం చేశారని ఆరోపించారు. అంతేకాకుండా దర్యాప్తును అడ్డుకునేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు నిందితులు ప్రయత్నించారని ఎఫ్‌బీఐ అసిస్టెంట్ డైరెక్టర్ జేమ్స్ డెన్నెహి తెలిపారు.

ఈ కేసు ఇప్పుడు అమెరికాలో పెద్ద కార్పొరేట్ మోసం, అవినీతి కేసుగా మారిందని అధికారులు అంటున్నారు. భారత అధికారులకు లంచం ఇచ్చి అమెరికన్ ఇన్వెస్టర్లను మోసం చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. అమెరికాలో నిధుల సమీకరణ కోసం 25 కోట్ల డాలర్లు(సుమారు రూ.2100 కోట్లు) లంచం ఇవ్వజూపారని, ఆ విషయం బయటకు రాకుండా తొక్కిపెట్టారని కూడా గౌతమ్ అదానీపై అభియోగాలు నమోదయ్యాయి.

Whats_app_banner