India Canada Issue : నిజ్జర్ హత్యపై కెనడా కవ్వింపు చర్యలు.. మీడియా కథనంపై స్పందించిన భారత్
India Canada Issue : ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి కెనడా మీడియా సంచలన కథనాన్ని ప్రచురించింది. దీనిపై భారత్ స్పందించింది. విదేశాంగ శాఖ తీవ్రంగా మండిపడింది.
ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి కెనడా మీడియా కథనాన్ని ప్రచురించింది. ఇందులో ప్రధాని మోదీ పేరును కూడా ప్రస్తావించారు. దీంతో భారత్ గట్టిగా బదులిచ్చింది. కెనడా అర్థంలేని ఆరోపణలు చేస్తుందని మండిపడింది.
కెనడాకు చెందిన గ్లోబ్ అండ్ మెయిల్ వార్తాపత్రికలో ఈ కథనాన్ని ప్రచురించారు. ఇందులో పేరు చెప్పని కెనడా అధికారులను కోట్ చేస్తూ వార్త పబ్లిష్ చేశారు. 'ఖలిస్థానీ కార్యకర్తను చంపడానికి ప్లాన్ చేసినట్లు మోదీకి తెలుసు. ఈ కుట్రలో భారత జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగ మంత్రి కూడా ఉన్నారు.' అని నివేదిక పేర్కొంది.
దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీర్ జైశ్వాల్ స్పందించారు. 'మేం సాధారణంగా మీడియా కథనాలకు స్పందించం. కానీ కెనడా ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ.. వచ్చిన కథనంపై స్పందించాల్సి వచ్చింది. ఇటువంటి హాస్యాస్పదమైన వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ప్రచారాలు ఇప్పటికే దెబ్బతిన్న సంబంధాలను మరింత దారుణంగా చేస్తాయి.' అని చెప్పారు.
ఖలిస్థానీ ఉగ్రవాది, కెనడియన్ పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ గత ఏడాది జూన్‌లో వాంకోవర్‌లో హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో దీనిపై స్పందించారు. ఢిల్లీకి చెందిన ఏజెంట్ ప్రమేయం ఉందని ఆరోపించడంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంక్షోభం ఏర్పడింది.
భారత హైకమిషనర్ సంజయ్ వర్మ, మరికొందరు దౌత్యవేత్తలకు హత్యతో సంబంధం కలిగి ఉందని కెనడా ఆరోపణలు చేసింది. భారత దౌత్యవేత్తలను దేశం నుంచి బహిష్కరించినట్లు కెనడా ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబరు 14న ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను న్యూ ఢిల్లీ బహిష్కరించిన తర్వాత కెనడా, భారతదేశం మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. భారతదేశ హైకమిషనర్‌ను నిజ్జర్ కేసులో పేర్కొన్నందుకు వివాదం పెద్దగా అయింది.
నిజ్జర్ నిషేధిత ఉగ్రవాద సంస్థ ఖలీస్థాన్ టైగర్ ఫోర్స్ వెనుక సూత్రధారి. పంజాబ్‌లో హిందూ పూజారి హత్యతో సహా పలు నేరాలకు సంబంధించి ఢిల్లీ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఉన్నాడు. అతడిని పట్టుకున్న వారికి రూ.10 లక్షల రివార్డు ఇస్తామని యాంటీ టెర్రర్ ఏజెన్సీ ఎన్ఐఏ ప్రకటించింది. అయితే ఆ తర్వాత అతడు హత్యకు గురయ్యాడు.