Amaran Controversy: అమరన్ మూవీలో సాయి పల్లవి ఫోన్ నెంబరు వివాదం, కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలంటూ నోటీసులు పంపిన స్టూడెంట్
Sai Pallavi phone number: అమరన్ సినిమాలో సాయి పల్లవి సిగ్గుపడుతూ తన ఫోన్ నెంబరును ఒక కాగితంపై రాసి శివ కార్తికేయన్‌పై విసురుతుంది. సినిమాలో ఈ సీన్.. ఒక ఇంజినీరింగ్ స్టూడెంట్‌కి ఊహించని తిప్పలు తెచ్చింది.
దీపావళికి విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన అమరన్ మూవీపై ఆలస్యంగా ఒక వివాదం తెరపైకి వచ్చింది. రాజ్‌కుమార్ పెరియాసామి దర్శకత్వం వహించిన అమరన్ మూవీలో.. శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించారు. అక్టోబరు 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అమరన్ సినిమా ఇప్పటి వరకూ రూ.300 కోట్ల వరకూ వసూళ్లని రాబట్టింది.
సిగ్గుపడుతూ.. ఫోన్ నెంబరు రాసి
అమరన్ మూవీలో ఒక లవ్ సీన్‌లో భాగంగా సాయి పల్లవి తన ఫోన్ నెంబరును రాసి శివ కార్తికేయన్‌పై విసురుతుంది. సినిమాలో అయితే సీన్ బాగా వర్కవుట్ అయ్యింది. కానీ.. ఆ ఫోన్ నెంబరుని పట్టుకున్న ఫ్యాన్స్.. నిజంగానే అది సాయి పల్లవి ఫోన్ నెంబరు అనుకుని కాల్ చేస్తున్నారట. ఇంతకీ ఆ ఫోన్ నెంబరు ఎవరిదంటే? చెన్నైకి చెందిన వాగీశన్ అనే ఇంజినీరింగ్ స్టూడెంట్‌ది.
సాయి పల్లవి అనుకుని కాల్స్
అమరన్ మూవీ రిలీజ్ అయిన రోజు నుంచి వాగీశన్‌కి వందల సంఖ్యలో ఫోన్ కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయట. ఆ మొబైల్ నెంబరు సాయి పల్లవిదే అనుకుని భ్రమపడిన చాలా మంది ఫ్యాన్స్.. ఆమెతో మాట్లాడొచ్చు అనుకుని వరుసగా కాల్స్ చేస్తున్నారట. దాంతో అందరికీ ఇది సాయి పల్లవి నెంబరు కాదని సమాధానం చెప్పలేక.. వాగీశన్ చాలా ఇబ్బందిపడుతున్నాడట.
రూ.1.1 కోట్లు నష్టపరిహారం డిమాండ్
విపరీతమైన ఫోన్ కాల్స్ కారణంగా తాను తీవ్ర మానసిక వేదనని అనుభవిస్తున్నారని.. దాంతో నష్ట పరిహారంగా రూ.1.1 కోట్లు ఇవ్వాలని అమరన్ టీమ్‌కి వాగీశన్ లీగల్ నోటీసులు పంపాడు. ఆర్.మహేంద్రన్, వివేక్ కృష్ణానితో కలిసి సీనియర్ నటుడు కమల్‌హాసన్ ఈ అమరన్ సినిమాని నిర్మించాడు. విద్యార్థి లీగల్ నోటీసుపై ఇప్పటి వరకూ అమరన్ చిత్ర యూనిట్ స్పందించలేదు.
ఓటీటీలోకి అమరన్ మూవీ ఎప్పుడు?
అమరన్ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ ఓ మంచి ఫ్యాన్సీ రేటుకి కొనుగోలు చేసింది. వాస్తవానికి నవంబరు చివర్లోనే ఓటీటీలోకి అమరన్ స్ట్రీమింగ్‌కి రావాల్సి ఉంది. కానీ.. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో అమరన్ థియేటర్లలో నడుస్తుండటంతో.. డిసెంబరు తొలి వారంలో స్ట్రీమింగ్‌కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.