AP Rains : ఏపీ ప్రజలకు అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు
AP Rains : ఏపీకి మరో ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అధికారుల హెచ్చరికలతో.. అన్నదాతల్లో ఆందోళన మొదలైంది.
హిందూ మహాసముద్రం, దక్షిణ అండమాన్ సముద్రంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో నవంబర్ 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత, ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి.. తర్వాతి 2 రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై వాయుగుండంగా మారే అవకాశం ఉందని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో (26, 27) తేదీల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని స్పష్టం చేశారు. ఉద్యానవన పంట మొక్కలు, చెట్లు పడిపోకుండా సపోర్టు అందించాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
పెరుగుతున్న చలి..
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో రాత్రి పూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఉదయం 10 గంటల వరకు పలు ప్రాంతాల్లో పొగ మంచు కనిపిస్తుంది. పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పగటి పూట ఉష్ణోగ్రతలు సైతం క్రమంగా తగ్గుతున్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
తెలంగాణలో గరిష్టంగా గంటకు 11 కిలోమీటర్ల వేగంతో మేర గాలులు వీస్తాయని.. ఏపీలో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో పగటి పూట ఉష్ణోగ్రత గరిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్, ఏపీలో గరిష్టంగా 31 డిగ్రీల సెల్సియస్ ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.
రాత్రి సమయంలో తెలంగాణలో 17 డిగ్రీల సెల్సియస్, ఏపీలో 21 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని ఐఎండీ అంచనా వేస్తోంది. దీంతో రాత్రివేళ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్, రామగుండం, నిజామాబాద్ జిల్లాల్లో పొంగ మంచు దట్టంగా కనిపిస్తుంది. ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై కనిపిస్తుంది.