తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsrtc - Osrtc Mou: గుడ్ న్యూస్.. ఇకపై ఒడిశాకు టీఎస్‌ఆర్టీసీ బస్సులు - రూట్లు ఇవే

TSRTC - OSRTC MoU: గుడ్ న్యూస్.. ఇకపై ఒడిశాకు టీఎస్‌ఆర్టీసీ బస్సులు - రూట్లు ఇవే

HT Telugu Desk HT Telugu

22 February 2023, 19:16 IST

    • TSRTC bus services to Odisha: ఒడిశాకు టీఎస్‌ఆర్టీసీ బస్సు సర్వీసులు నడవనున్నాయి. ఈ మేరకు బుధవారం ఇరు రాష్ట్రాలకు చెందిన రోడ్డు రవాణా సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఒడిశా బస్సులు కూడా తెలంగాణలో తిరగనున్నాయి.
ఒడిశా ఆర్టీసీతో తెలంగాణ ఆర్టీసీ ఒప్పందం
ఒడిశా ఆర్టీసీతో తెలంగాణ ఆర్టీసీ ఒప్పందం

ఒడిశా ఆర్టీసీతో తెలంగాణ ఆర్టీసీ ఒప్పందం

TSRTC Latest News Updates: గత కొంతకాలంగా వినూత్న నిర్ణయాలతో ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అడుగులు వేస్తోంది. ఓ వైపు ప్రస్తుతం ఉన్న భారాన్ని తగ్గించుకోవటంతో పాటు... ప్రయాణికులను ఆకర్షించేలా మార్పులు తీసుకువస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలకు బస్సులను నడుపుతున్న తెలంగాణ ఆర్టీసీ.... మరో అడుగు ముందుకు వేసింది. ఒడిశాకు బస్ సర్వీసులను నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాల రవాణా సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది.

ట్రెండింగ్ వార్తలు

TS AP Rains : తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు, రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు-పిడుగుపాటు హెచ్చరికలు జారీ

Hyderabad Pub : యువతులతో అసభ్యకర డ్యాన్సులు, ఆఫ్టర్ 9 పబ్ పై పోలీసుల దాడులు

Ganja Smuggling : చింతపండు బస్తాల మాటున గంజాయి రవాణా- గుట్టు రట్టు చేసిన వరంగల్ పోలీసులు

IRCTC Srilanka Tour Package : హైదరాబాద్ నుంచి శ్రీలంక రామాయణ యాత్ర- 5 రోజుల ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే!

10 బస్సులు....

ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో 10 బస్సులను తిప్పేందుకు సిద్ధమైంది టీఎస్ఆర్టీసీ. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర బస్సు సర్వీసుల ఏర్పాటుపై ఒడిశా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఓఎస్ఆర్టీసీ)తో టీఎస్ఆర్టీసీ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ బస్ భవన్ లో బుధవారం జరిగిన కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ సమక్షంలో సంస్థ ఎండీ వీసీ సజ్జానర్, ఓఎస్ఆర్టీసీ ఎండీ దిప్తేష్‌ కుమార్‌ పట్నాయక్‌ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వాటిని పరస్పరం అందజేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం.. టీఎస్‌ఆర్టీసీ 10 బస్సులను ఒడిశాకు.. ఓఎస్‌ఆర్టీసీ 13 సర్వీస్‌లను తెలంగాణకు నడపనుంది.

రూట్లు ఇవే...

హైదరాబాద్‌- జైపూర్‌ 2, ఖమ్మం-రాయఘఢ 2, భవానిపట్న - విజయవాడ (వయా భద్రాచలం) 2, భద్రాచలం-జైపూర్‌ 4 బస్సు సర్వీసులను టీఎస్‌ఆర్టీసీ నడపనుంది. నవరంగ్‌పూర్‌-హైదరాబాద్‌ 4, జైపూర్‌-హైదరాబాద్‌ 2, భవానిపట్న-విజయవాడ(వయా భద్రాచలం) 2, రాయఘఢ-కరీంనగర్‌ 2, జైపూర్‌-భద్రాచలం 3 బస్సులను ఓఎస్‌ఆర్టీసీ తిప్పనుంది.

తెలంగాణ-ఒడిశా మధ్యలో ప్రయాణికులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారని చెప్పారు టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్. డిమాండ్‌ నేపథ్యంలోనే ఓఎస్‌ఆర్టీసీతో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించామని, ఆయా మార్గాల్లో 10 బస్సులను ఒడిశాలో పరిధిలో 3378 కిలోమీటర్ల మేర నడపాలని సంస్థ నిర్ణయించిందని వెల్లడించారు. ఇరు రాష్ట్రాల ప్రజలు ఈ బస్సు సర్వీస్‌లను వినియోగించుకుని, క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

టీఎస్‌ఆర్టీసీ తీసుకువచ్చిన పలు కార్యక్రమాలను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ఓఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఈ సందర్భంగా వివరించారు. టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని ఓఎస్‌ఆర్టీసీ ఎండీ దిప్తేష్‌ కుమార్‌ పట్నాయక్‌ ప్రశంసించారు. తమ రాష్ట్రంలోనూ వాటిని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఈ ఒప్పందం వల్ల రెండు సంస్థల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందని అన్నారు. ఈ ఒప్పందం ప్రకారం 13 బస్సు సర్వీస్‌లతో తెలంగాణలో 2896 కిలోమీటర్ల మేర నడుపుతన్నట్లు వివరించారు.