TSRTC Rent Buses: పెళ్లిళ్ల సీజన్... సూపర్ ఆఫర్ ప్రకటించిన టీఎస్ఆర్టీసీ
TSRTC Special Offer: శుభకార్యాలయాల వేళ తెలంగాణ ఆర్టీసీ సరికొత్త ఆఫర్ ప్రకటించింది. అద్దెకు తీసుకునే బస్సులపై 10 శాతం రాయితీ కల్పించనున్నారు.
TSRTC Latest News Updates: గత కొంతకాలంగా వినూత్న నిర్ణయాలతో ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అడుగులు వేస్తోంది. ఓ వైపు ప్రస్తుతం ఉన్న భారాన్ని తగ్గించుకోవటంతో పాటు... ప్రయాణికులను ఆకర్షించేలా మార్పులు తీసుకువస్తోంది. పెళ్లిళ్ల సీజన్ కావటంతో... ఆర్టీసీ స్పెషల్ ఆఫర్ తో ముందుకొచ్చింది. శుభకార్యాల కోసం తీసుకనే అద్దె బస్సులపై ప్రత్యేక రాయితీని ప్రకటించింది. ఈ మేరకు ఆర్టీసీ అన్ని రకాల బస్ సర్వీస్‌లపై 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది.
ఫిబ్రవరి మాసంలో భారీగా పెళ్లిళ్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఆర్టీసీ ఈ ఆఫర్ ను తీసుకువచ్చింది. శుభకార్యాల వేళ ప్రైవేటు వాహనాల కోసం ప్రజలు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశ్యంతోనే అద్దెకు తీసుకునే బస్సులపై 10 శాతం రాయితీ కల్పించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ ఏడాది జూన్ 30 వరకు అద్దె బస్సులపై 10 శాతం రాయితీ అమల్లో ఉంటుందని చెప్పారు. గతంలో మాదిరి కాకుండా... శుభకార్యాల కోసం బస్సులు కావాలనుకునే వారు ఎలాంటి క్యాష్ డిపాజిట్ లేకుండానే సదుపాయం కలిపించారు. అద్దె బస్సుల బుకింగ్ కోసం టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ www.tsrtconline.in ను సందర్శించాలని వెల్లడించారు.
ప్రత్యేక బస్సులు…
TSRTC Special Buses to Srisailam: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ఆర్టీసీ. హైదరాబాద్ నుంచి మొత్తం 390 ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈనెల 16 నుంచి 19 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఈ బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, జూబ్లీబస్‌స్టేషన్, దిల్‌సుఖ్‌నగర్ బస్‌స్టేషన్, ఐఎస్ సదన్, కేపీహెచ్‌బీ, బీహెచ్‌ఈల్ పాయింట్లతో పాటు నగరంలోని పలు ఇతర ప్రారతాల నుంచి ఈ స్పెషల్ బస్సులు నడపనున్నారు. 16 వ తేదీన 36 ప్రత్యేక బస్సులు నడపాలని... 17వ తేదీన 99, 18న 99 బస్సులు... ఇక 19న 88 బస్సులు నడపాలని అధికారులు నిర్ణయించారు. మిగతా 68 బస్సులు ఇతర ప్రాంతాల నుంచి నడపనున్నట్టు వెల్లడించారు.
టికెట్ రేట్లు...
ఎంజీబీఎస్ నుంచి శ్రీశైలానికి సూపర్ లగ్జరీలో ఒకరికి రూ.600, డీలక్స్‌లో రూ.540, ఎక్స్‌ప్రెస్ లో రూ.460 తీసుకుంటారు. నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి సూపర్ లగ్జరీలో ఒకరికి రూ.650, డీలక్స్‌లో రూ.580, ఎక్స్‌ప్రె్‌స్‌లో రూ.500 వసూలు చేస్తారు. ఇప్పటికే రిజర్వేషన్ ప్రక్రియ నడుస్తోంది. పలు ఫోన్ నెంబర్లను(99592 26250, 9959226248, 9959226257, 9959226246, 040-27802203, 9959226250, 9959226149) అందుబాటులోకి తీసుకువచ్చారు. మరిన్ని వివరాల కోసం టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ www.tsrtconline.in ను సందర్శించవచ్చు.
సంబంధిత కథనం