తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Intermediate: ముగిసిన సెలవులు.. రేపట్నుంచే ఇంటర్ తరగతులు ప్రారంభం

TS Intermediate: ముగిసిన సెలవులు.. రేపట్నుంచే ఇంటర్ తరగతులు ప్రారంభం

31 May 2023, 17:00 IST

    • Telangana Inter Schedule: జూన్‌ 1 నుంచి ఫస్టియర్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. మే 31వ తేదీలో వేసవి సెలవులు పూర్తి కానున్నాయి.
జూన్ 1 నుంచి ఇంటర్ తరగతులు
జూన్ 1 నుంచి ఇంటర్ తరగతులు

జూన్ 1 నుంచి ఇంటర్ తరగతులు

Telangana Inter Admission Schedule 2023-24: ఇవాళ్టితో తెలంగాణ ఇంటర్ విద్యార్థుల వేసవి సెలవులు పూర్తి కానున్నాయి. రేపట్నుంచి (జూన్ 1వ తేదీ) తిరిగి కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఫస్టియర్ తో పాటు సెకండ్ ఇయర్ తరగతులు కూడా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే 2023 -24 విద్యా సంవత్సరానికి సంబంధించిన షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు మే 15వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. జూన్‌ 30లోగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని ఇంటర్‌ బోర్డు ఆదేశాలు కూడా ఇచ్చింది. ఇంటర్మీడియట్ బోర్డు గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే విద్యార్థులు చేరాలని ప్రకటనలో స్పష్టం చేసింది. గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను కూడా బోర్డు అధికారిక వెబ్ సైట్ టీఎస్‌బీఐఈ లో అందుబాటులో ఉంచింది. అడ్మిషన్ల ప్రక్రియకు ఎలాంటి ప్రవేశ పరీక్ష నిర్వహించవద్దని.. పదో తరగతి గ్రేడింగ్‌ ఆధారంగానే ప్రవేశాలు జరపాలని ఆదేశించింది. ఇక కాలేజీ సీట్లలో ఎస్సీలకు 15, ఎస్టీలకు 10, బీసీలకు 29, వికలాంగులకు 3, ఎన్‌సీ సీ, స్పోర్ట్స్‌, ఇతర అర్హతలున్న వారికి 5, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 3, ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించింది. ప్రతీ కాలేజీలో బాలికలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

తరగతుల నిర్వహణకు సంబందించి పలు మార్గదర్శకాలను కూడా ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఇందులో చూస్తే....ప్రతీ సెక్షన్‌లోనూ 88 మంది విద్యార్థులనే చేర్చుకోవాలని స్పష్టం చేసింది. అదనపు సెక్షన్లకు బోర్డు నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. విద్యార్థుల ఆధార్‌ నెంబర్‌ తప్పకుండా నమోదు చేయటంతో పాటు... అడ్మిషన్ల వివరాలను ప్రతీ రోజూ కాలేజీ బోర్డుపై ఉంచాల్సి ఉంటుంది. జోగిని, తండ్రి లేని పిల్లల విషయంలో పేరెంట్స్‌ కాలమ్‌లో తల్లి పేరు నమోదు చేయాలని సూచించింది.

ఇక ఇటీవల విడుదలైన తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సవరంలో 63.85% మంది పాస్ కాగా, సెకండియర్‌లో 67.26 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణ ద్వితీయ సంవత్సరం 63.49 శాతం మంది పాస్ అయ్యారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో మేడ్చల్, సెకండియర్ ఫలితాల్లో ములుగు జిల్లా మొదటి స్థానంలో నిలిచాయి. సెకండియర్ ఫలితాల్లో 1,73,61 మందికి గ్రేడ్‌-ఎ రాగా, 54,776 మంది విద్యార్థులకు గ్రేడ్‌-బి సాధించిన సంగతి తెలిసిందే.