Hyderabad Police : మరో రెండు వారాలు.. హైదరాబాద్ పోలీసులు బిజీబిజీ
04 September 2022, 21:14 IST
- గణేశ్ ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే బిజీబిజీగా ఉన్నారు. క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటున్నారు. అయితే మరో రెండు వారాలపాటు ఇదే పరిస్థితి కొనసాగేలా కనిపిస్తుంది.
ఖైరతాబాద్ గణేశ్
గణేష్ ఉత్సవాల బందోబస్త్ విధుల్లో ఉంటూ సెప్టెంబర్ 9న జరిగే విగ్రహ నిమజ్జనోత్సవాల వరకు కాళ్లరిగేలా తిరగనున్నారు పోలీసులు. హైదరాబాద్ పోలీసు సిబ్బందికి కాస్త విశ్రాంతి కూడా లభించడం లేదు. అయితే ఒక వారం తర్వాత, సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవానికి సంబంధించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. భద్రత కల్పించడంలో మళ్లీ కఠినమైన సమయాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.
సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పరేడ్ గ్రౌండ్‌లో అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భద్రత, బందోబస్త్ గురించి హైదరాబాద్ పోలీసులకు ఎటువంటి సమాచారం లేదని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలను ప్రకటించింది. మరోవైపు ఎంఐఎం కూడా ఈ వేడుకను ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది.
పోలీసు రక్షణ, బందోబస్త్ ఏర్పాట్లు కోరుతూ కేంద్రం నుంచి తమకు ఎలాంటి సమాచారం రాలేదని హైదరాబాద్ నగరానికి చెందిన ఓ సీనియర్ పోలీసు అధికారి అన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. భద్రతా ఏర్పాట్లకు సంబంధించి సీనియర్ అధికారులు నిర్ణయం తీసుకుంటారని ఆ అధికారి తెలిపారు.
గణేష్ ఉత్సవాల సందర్భంగా నగర పోలీసులు విధులు నిర్వర్తించడంలో బిజీగా ఉన్నారు. సున్నిత ప్రాంతాల్లో బలగాలను మోహరించారు. గణేష్ నిమజ్జన ఊరేగింపును దృష్టిలో ఉంచుకుని బయట పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బందిని నగరానికి రప్పించారు. కాగా, విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి, వీవీఐపీల పర్యటన సందర్భంగా భద్రతా చర్యల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్‌కు రక్షణగా కేంద్ర బలగాలను నియమించాలని కేంద్రం నిర్ణయించింది.
కేంద్ర బలగాల బృందం శనివారం పరేడ్ గ్రౌండ్‌ను సందర్శించింది. సెప్టెంబర్ 17న అదనపు భద్రతా ఏర్పాట్లను అందించడానికి వివరాలను సేకరించింది. అయితే, వారి రాక గురించి ఎటువంటి ఇన్‌పుట్‌లు అందలేదని హైదరాబాద్ పోలీసులు తెలిపారు.