Ganesh Utsav: సీనియర్ సిటిజన్లకు ‘గణేశ్ మండపాల టూర్ ప్యాకేజ్’
Ganesh Utsav: సీనియర్ సిటిజన్లకు వినాయక మండపాల సందర్శన భాగ్యం కలిగించే దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమం చేపట్టింది.
Ganesh Utsav: 60 ఏళ్లు పైబడిన వారు గణేశ్ మండపాలను దర్శించాలనుకుంటే, నామమాత్ర రుసుముతో వారికి సంబంధిత నగరంలోని అన్ని ప్రముఖ గణేశ్ మండపాలను చూసే అవకాశం కల్పిస్తున్నారు.
Ganesh Utsav: నాలుగు నగరాల్లో..
ముంబై, పుణె, నాగపూర్, థానెల్లో సీనియర్ సిటిజన్లకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు మహారాష్ట్ర టూరిజం శాఖ ప్రకటించింది. టూరిజం శాఖ వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకుని, రుసుము చెల్లిస్తే, వారిని దగ్గరుండి ఆయా నగరాల్లోని ప్రముఖ వినాయక మండపాలను చూపిస్తారు. సెప్టెంబర్ నెలలోని 2, 5, 7 తేదీల్లో వారికి ఈ అవకాశం లభిస్తుంది. రెండవ తేదీన ఈ సౌకర్యాన్ని పెద్ద ఎత్తున సీనియర్ సిటిజన్లు వినియోగించుకున్నారని, ఈ ట్రిప్ ను వారెంతో ఎంజాయ్ చేశారని మహారాష్ట్ర టూరిజం మంత్రి ప్రభాత్ లోధా తెలిపారు.
Ganesh Utsav: గైడ్ కూడా..
సీనియర్ సిటిజన్లతో పాటు స్థానికంగా ఒక గైడ్ ను కూడా వాహనంలో ఉండేలా ఏర్పాటు చేశారు. ఆ గైడ్ ఆయా మండపాల ప్రత్యేకతను, ఆయా ప్రాంతాల గొప్పదనాన్ని వివరిస్తారు. ముంబైలో ఈ సేవలు పొందాలనుకునే సీనియర్ సిటిజన్లు భారతీయులైతే రూ. 850, విదేశీయులైతే రూ. 1600 చెల్లించాల్సి ఉంటుంది. ఉదయం ప్రారంభమయ్యే ఈ ట్రిప్ సాయంత్రానికి ముగుస్తుంది. ఇప్పటివరకు మహారాష్ట్రలోని నాలుగు నగరాల్లో సుమారు 1600 మంది సీనియర్ సిటిజన్లు ఈ గణేశ్ మండపాల దర్శనం కోసం దరఖాస్తు చేసుకున్నారు.
Ganesh Utsav: రెండేళ్ల కొలాహలం..
వినాయక నవరాత్రి ఉత్సవాలకు ముంబై పెట్టింది పేరు. అంగరంగ వైభవంగా ఇక్కడ ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. అయితే, కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఆంక్షల నడుమ ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. అందుకే, ఈ సంవత్సరం గణేశ్ ఉత్సవాల్లో ఎలాంటి ఆంక్షలు ఉండవని, కరోనా ముందు ఎలా ఉత్సవాలు జరుపుకున్నామో..ఇప్పుడు కూడా అలాగే జరుపుకుంటామని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఇటీవల ప్రకటించారు.