Khairatabad Ganesh 2022 : ఖైరతాబాద్ గణేశుడి వద్దకు భారీగా వస్తున్న భక్తులు
31 August 2022, 15:11 IST
- Khairatabad Ganesh First Pooja : హైదరాబాద్ లో వినాయక చవితి సందడి నెలకొంది. గణేశ్ మండపాలతో నగరం కలకలలాడుతోంది. ఇక ఖైరతాబాద్ వినాయకుడి ప్రత్యేకత వేరు. ఈ ఏడాది పంచముఖ మహాలక్ష్ణి గణపతిగా కొలువుదీరి పూజలు అందుకుంటున్నాడు.
ఖైరతాబాద్ గణనాథుడు
భాగ్యనగరంలో వినాయక చవితి సందడి షురూ అయింది. అనేక రూపాల్లో గణపతి భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. ఖైరతాబాద్ గణేశుడు పంచముఖ మహాలక్ష్మి గణపతి రూపంలో దర్శనమిస్తున్నాడు. వినాయక చవితి పూజలను ఘనంగా నిర్వహించారు. గణనాథుడికి ఇరువైపులా త్రిశక్తి మహా గాయత్రి, షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి దర్శనమీతో దర్శనం ఇస్తున్నారు. ఈసారి 50 అడుగుల విగ్రహాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.
ఆనవాయితీగా పద్మశాలీలు పట్టు వస్త్రాలు, యజ్ఞోపవేతం గణేశుడికి సమర్పించారు. గుర్రపు బగ్గీపై పట్టువస్త్రాలు తెచ్చారు. ఒగ్గుడోలు, డప్పులు, నృత్యాల మధ్య ర్యాలీగా వచ్చి స్వామివారికి 50 అడుగుల భారీ యజ్ఞోపవేతం సమర్పించారు. ఖైరతాబాద్ గణనాథుడికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయలు తొలి పూజ చేశారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ఉత్సవ కమిటీని అభినందించారు. కరోనా కారణంగా రెండేళ్ల పాటు ఖైరతాబాద్ వినాయకుడి వద్దకు రాలేకపోయామని చెప్పారు. కరోనా వంటి వ్యాధులు రాకుండా ఉండాలని గణపతిని ప్రార్థించానని తెలిపారు. అందరం తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు.
ఖైరతాబాద్ వినాయకుడిని మట్టితో తయారు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇబ్బందులు లేకుండా గణేష్ చవితి ఉత్సవాలు నిర్వహించనున్నట్టుగా తెలిపారు. బొజ్జ గణపయ్య విగ్రహాల నిమజ్జనం కోసం భారీగా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.
నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గతేడాది ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులకు రిక్వెస్ట్ చేశామని, ఈ సంవత్సరము విగ్రహాన్ని మట్టితో తయారు చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకులను మాత్రమే ఉపయోగించాలని కోరారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
గణేష్ విగ్రహనికి తొలి పూజలు చేసిన తర్వాత విగ్రహన్ని సందర్శించుకొనేందుకు భక్తులకు అనుమతినిచ్చారు. దీంతో భారీగా భక్తులు తరలివస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఈ ప్రాంతంలో 9 మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు అధికారులు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. ఖైరతాబాద్ ప్రాంతంలోనూ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.