తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Assembly Elections : గజ్వేల్ బరిలో 'గద్దర్'..! కొత్త పార్టీ ప్రకటిస్తారా..?

TS Assembly Elections : గజ్వేల్ బరిలో 'గద్దర్'..! కొత్త పార్టీ ప్రకటిస్తారా..?

HT Telugu Desk HT Telugu

03 May 2023, 14:57 IST

    • Telangana Assembly Election 2023: ఎన్నికల టైం దగ్గర పడుతున్న వేళ తెలంగాణ రాజకీయాలు హీట్ ను పుట్టిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీలు పోటీ రెడీ అవుతున్న వేళ… మరో కొత్త పార్టీ కూడా ఏర్పాటు కాబోతుందన్న చర్చ గట్టిగా వినిపిస్తోంది.
ప్రజా గాయకుడు గద్దర్
ప్రజా గాయకుడు గద్దర్ (facebook)

ప్రజా గాయకుడు గద్దర్

Telangana Assembly Elections 2023: ఎన్నికల ఏడాది కావటంతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలలోని నేతలు టికెట్లపై లెక్కలు వేసుకుంటున్నారు. తేడా అనిపిస్తే చాలు... స్వరాలు మార్చేస్తున్నారు. ఇప్పటికే అసమ్మతి నేతలు... పక్క పార్టీల వైపు చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక మున్ముందు పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ప్రధాన పార్టీలే కాకుండా... ప్రాంతీయ పార్టీలు కూడా సత్తా చాటాలని చూస్తున్నాయి. అయితే మరో కొత్త పార్టీ కూడా రాబోతుందన్న చర్చ గట్టిగా వినిపిస్తోంది. ప్రజా యుద్ధనౌక గద్దర్ ఈ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీపై కూడా ఆయన కీలక ప్రకటన చేయటంతో ఈ వాదన మరింత బలపడింది.

పార్టీ ప్రకటిస్తారా..?

గత కొంతకాలంగా గద్దర్ ప్రకటనలు, వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2018 ఎన్నికల టైంలోనూ ఏదో ఒక సీటు నుంచి పోటీ చేస్తారని భావించినప్పటికీ అలా జరగలేదు. స్వయంగా సోనియాగాంధీని కుటుంబ సమేతంగా కలవటంతో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారని అంతా అనుకున్నప్పటికీ... పోటీ చేయలేదు. ఆ తర్వాత కొంత సైలెన్స్ గా ఉన్నప్పటికీ... ఇటీవల జరిగిన మునుగోడు ఉపఎన్నికలోనూ పోటీ చేస్తానని ప్రకటన చేశారు. కానీ ఇది కూడా జరగలేదు. ఇక ఈ మధ్య కాలంలో పలు వేదికలపై మాట్లాడుతున్న ఆయన... ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానని తాజాగా కూడా ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించి మంగళవారం కీలక కామెంట్స్ చేశారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. మెదక్ జిల్లా తూప్రాన్‌లో మంగళవారం పోలీసులను కలిసిన గద్దర్.... ఈ ఏడాది తనకు రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం మాట్లాడిన ఆయన.... తన వయసు 76 సంవత్సరాలని, కాబట్టి ఇక నుంచి పుట్టిన ఊళ్లోనే జీవించాలని అనుకుంటున్నట్టు తెలిపారు. తన సొంత గ్రామంపై ఓ పుస్తకం రాసినట్టు గద్దర్ ప్రకటించారు. ఈ మేరకు పోలీసులకు ఇచ్చిన లేఖ... గద్దర్ పార్టీ పేరుతో ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.

గద్దర్ పొలిటికల్ ఎంట్రీపై రకరకాల కథనాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు పార్టీల నుంచి ఆహ్వానాలు అందినప్పటికీ... ఆయన నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందన్న చర్చ కూడా ఉంది. అయితే గజ్వేల్ నుంచే పోటీ అని గద్దర్ చెప్పటంతో ఆ ప్రచారానికి చెక్ పడిందనే చెప్పొచ్చు. త్వరలోనే కవులు, కళాకారులతో కలిసి భారీ సమ్మేళనానికి కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటిని నేపథ్యంలో గద్దర్... ఏదైనా పార్టీలో చేరి పోటీ చేస్తారా..? లేక కొత్త పార్టీని ప్రకటించి బరిలో నిలుస్తారా..? అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.