Munugodu Bypoll: ప్రజాఫ్రంట్ నుంచి ప్రజాశాంతి వరకు... మునుగోడు బరిలో గద్దర్!
Munugodu bypoll 2022: మునుగోడులో పోటీ ఆసక్తికరంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రజాయుద్ధ నౌకగా పేరున్న గద్దర్ కూడా బైపోల్ బరిలో ఉండబోతున్నారు.
Gaddar Contest in Munugodu By poll: మునుగోడు బైపోల్ వేడి పెరుగుతోంది. నోటిఫికేషన్ రావటంతో ప్రధాన పార్టీలు వేగంగా పావులు కదిపే పనిలో పడ్డాయి. ఎవరికి వారు వ్యూహాల్లో మునిగిపోయారు. గెలుపే లక్ష్యంగా లెక్కలు వేసుకుంటున్నారు. అయితే ఇప్పటికే అభ్యర్థులు ఖరారు చేసేసిన బీజేపీ, కాంగ్రెస్... గ్రౌండ్ లో ప్రచారంపై దృష్టిపెట్టాయి. అయితే తాజాగా రంగంలోకి మరో ప్రముఖ వ్యక్తి అడుగుపెట్టబోతున్నారు. అదీ కేఏ పాల్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. సరిగ్గా ఈ పరిణామం రాజకీయవర్గాల్లో సరికొత్త చర్చకు దారి తీసింది.
ప్రజాశాంతి పార్టీ నుంచి....
మునుగోడులో ప్రధాన పార్టీలతో పాటు బీఎస్పీ కూడా బరిలో ఉండనుంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పర్యటనలు కూడా చేపట్టారు. కామ్రేడ్లు టీఆర్ఎస్ తో జతకట్టగా... జనసమితి, వైఎస్ఆర్టీపీలు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే కేఏ పాల్ స్థాపించిన ప్రజాశాంతి పార్టీ మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేయనుంది. ప్రజాగాయకుడిగా పేరున్న గద్దర్ ఆ పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. తెలంగాణలోని అనేక పార్టీలు తమతో చేతులు కలపాలని ఆహ్వానించినా కేఏ పాల్ పిలుపు మేరకు ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ప్రజాశాంతి పార్టీలో చేరినట్లుగా గద్దర్ ప్రకటించారు.
అప్పట్లో ప్రజాఫ్రంట్....
గద్దర్ సీన్ లోకి రావటంతో... మునుగోడు పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఎందుకంటే ఆ పార్టీలో ప్రజాగాయకుడు గద్దర్ అలియాస్ గుమ్మడి విట్టల్ రావు చేరడం... మునుగోడు నుంచి ఈ బైపోల్‌లో పోటీ చేస్తానని ప్రకటించడంతో కొంత ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు ప్రజా ఉద్యమాలు, విప్లవ పోరాటల్లో ఆయన చురుకుగా పాల్గొన్నారు. మలిదళ తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించారు. తెలంగాణ ప్రజాఫ్రంట్ అనే ఓ సంస్థను కూడా స్థాపించారు. అప్పుడే రాజకీయ పార్టీని కూడా ప్రకటిస్తారని చర్చ జరిగినప్పటికీ అలా జరగలేదు. అనంతరం ఫ్రంట్ నుంచి బయటికి వచ్చారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత... టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఖండిస్తూ వచ్చారు. ఇదే క్రమంలో ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, సోనియా గాంధీని కూడా కలిశారు. అయితే ఆయన కాంగ్రెస్ లో చేరటం ఖాయమని అనుకున్నారు. ఏ పార్టీలో చేరని గద్దర్ న్యూట్రల్ గా ఉంటూ వచ్చారు.
ఈ మధ్య కాలంలో బీజేపీ సభలోనూ కనిపించారు గద్దర్. ఆ పార్టీ నేతలకు కలిసి వినతి పత్రాలను కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనపై అనేక విమర్శలు కూడా వచ్చాయి. ఇక తాజాగా మునుగోడు బరిలో ఉండాలని అనుకోవటం... అదీ కేఏ పాల్ పార్టీ నుంచి కావటం మాత్రం అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇవాళో రేపో ప్రచారం కూడా మొదలుపెట్టే పనిలో ఉన్నారు.
మొత్తంగా ప్రజాయుద్ధ నౌకగా తెలంగాణ ప్రజలకు సుపరిచితమైన గద్దర్ మునుగోడు బరిలో ఏ మేరకు ప్రభావం చూపుతారు...? ప్రజల ఆశీస్సులు ఏ మేరకు ఉండబోతున్నాయనేది మాత్రం ఎన్నికల ఫలితాల వచ్చే వరకు వేచి చూడాల్సిందే.