Munugodu Bypoll: మునుగోడులో ఇవాళ్టి నుంచి నామినేషన్లు-munugode by poll nominations starts from 7th october 2022 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Munugodu Bypoll: మునుగోడులో ఇవాళ్టి నుంచి నామినేషన్లు

Munugodu Bypoll: మునుగోడులో ఇవాళ్టి నుంచి నామినేషన్లు

HT Telugu Desk HT Telugu
Oct 07, 2022 06:20 AM IST

Munugodu bypoll 2022: మునుగోడు ఉపఎన్నికకు శుక్రవారం నోటిఫికేషన్‌ వెలువడనున్నది. నేటి నుంచి ఈ నెల 14 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనున్నది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

మునుగోడులో నామినేషన్లు షురూ
మునుగోడులో నామినేషన్లు షురూ (HT)

Munugodu bypoll Nominations: మునుగోడు ఉప ఎన్నికలో అసలు పర్వం మొదలుకాబోతుంది. ప్రధాన పార్టీలకు అగ్నిపరీక్షగా మారిన ఈ బైపోల్ ప్రక్రియ ఇవాళ్టి నుంచి మొదలుకానుంది. నేటి నుంచే నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ మేరకు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు.

చండూరులోని ఎమ్మార్వో కార్యాలయంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ పత్రాలను దాఖలు చేయవచ్చు. ఈ నెల 14 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 15న నామినేషన్లను పరిశీలిస్తారు. అక్టోబరు 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. రెండో శనివారం, ఆదివారం రోజుల్లో నామినేషన్లను స్వీకరించబడవు. ఉప ఎన్నికను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మరోవైపు న్నికల కోడ్‌ ఈ నెల 3 నుంచే అమల్లోకి వచ్చిన విషయం తెల్సిందే.

ఇదిలా ఉంటే నోటిఫికేషన్ రాకముందే మునుగోడులో ప్రధాన రాజకీయ పార్టీలు తెగ ప్రచారం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో నేటి నుంచే నామినేషన్‌లు మొదలుకానుండడంతో అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని వేగవంతం చేసేందుకు సిద్ధమయ్యాయి. కీ లీడర్లంతా మునుగోడులోనే మక్కాం వెయనున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ.. ఈ ఉపఎన్నికను ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలనంతా మునుగోడులో దింపి.. ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. 2,500 ఓటర్లకు ఒక ఎమ్మెల్యే చొప్పున.. 86 మంది ఎమ్మెల్యేలు మునుగోడులోనే ఉండాలని పార్టీ హైకమాండ్ ఆదేశించింది. అయితే ఇప్పటివరకు అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించలేదు. రేపోమాపో లేదా చండూరులో తలపెట్టే బహిరంగ సభలో అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక మునుగోడు ఉప ఎన్నికకు నవంబరు 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. నవంబరు 6న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.

IPL_Entry_Point