Munugode Bypoll : ఏమో.. మునుగోడు.. ఇండియాలో కాస్ట్‌లీ బైపోల్ అగునేమో!
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు.. మాకు ఇంత ఆస్తి అని అఫిడవిట్ లో చూపిస్తారు. కానీ గ్రౌండ్ లెవెల్ వచ్చే సరికి.. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. కట్టల కట్టల డబ్బులు, మందు, బీర్లు ఏర్లై పొంగుతాయి. ఇప్పుడు రాబోయే మనుగోడు ఉపఎన్నికలో ఇలాంటి పరిస్థితే కనిపిస్తుందా? ఇండియాలోనే కాస్ట్ లీ ఎన్నిక అవుతుందా?
పొలిటికల్ లీడర్లకు ఓ కథ తెలిసే ఉంటుంది. ఆ స్టోరీ ఏంటంటే.. 'ఓ రాజకీయ నాయకుడిని తన సన్నిహితులు అడుగుతారంట. ప్రజలను ఇంత ఇబ్బందులకు గురిచేస్తున్నావ్ కదా వచ్చే ఎన్నికల్లో ఓట్లేస్తారా? అని అడుగుతారట. దానికి ఆ రాజకీయ నాయకుడు ఓ కోడిని తీసుకొచ్చి.. దాని మీద ఉన్న ఈకలు పీకేస్తాడు. అప్పుడు పక్షి విలవిలలాడుతుంది. అదే సమయంలో ఆ రాజకీయ నాయుకుడు దానికి కొన్ని ధాన్యం గింజలు వేయగానే.. మళ్లీ కిక్కురుమనకుండా వచ్చి తింటుందట.' ఇది ఆ రాజకీయ నాయకుడు చెప్పిన కథ. ఎన్నికల ముందు సంక్షేమ పథకాలు, డబ్బులు పంచడం ఇలాంటిదానిలోకే వస్తుందేమో.
ఇదంతా ఎందుకు చెప్పుకోవడమంటే.. ఇండియాలో హుజూరాబాద్ కాస్ట్ లీ ఎన్నికగా అందరిలోనూ అభిప్రాయం ఉంది. ఉపఎన్నికకు ముందు డబ్బు.. మద్యం.. వాట్ నాట్.. సామ,దాన,భేద, దండోపాయాలు అన్ని ఉపయోగించారనే చర్చ ఉంది. ఓటర్లను ఆకట్టుకోవడమే పని. అంతకుముందు జరిగిన నష్టాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఉపఎన్నిక మాత్రం.. దేశం దృష్టిని ఆకర్శించింది. ఇప్పుడు ఇవే మాటలు మునుగోడు బైపోల్ పై ఉన్నాయి. ఎవరూ కనివిని ఎరుగని రీతిలో ఇక్కడ ఎన్నిక జరగబోతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. ప్రతి పార్టీకి ఈ ఉపఎన్నిక ఎంతో కీలకం. అస్త్రశస్త్రాలన్నీ ఉపయోగిస్తాయనేది ఇప్పుడు ప్రచారం. ఉపఎన్నికలయ్యే వరకూ ఓటర్లను రాజుల్లా చూసుకుంటారనేది చర్చ. ఆ తర్వాత పరిస్థితి ఏంటో చెప్పనక్కర్లేదు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఆ రోజు నుంచి.. పార్టీల దృష్టంతా మునుగోడుపైనే.. ఎలాగైనను గెలవవలెను మునుగోడును అనే నినాదంతో పావులు కదుపుతున్నాయి. గెలిచి తీరాల్సిందేననే పట్టుదలతో ఉన్నాయి. ఈ ఒక్క సెమీ ఫైనల్ కొడితే.. ఇక ఫైనల్ లో ఏ ఢోకా ఉండదనేది పార్టీల ఆలోచన. ఇంత ఆలోచించినప్పుడు.. డబ్బులు, మద్యం ఎంత పంచుతారనేది అసలు ప్రశ్న. అందుకే ఎప్పుడు చూడని విధంగా ఇండియాలో మునుగోడు ఉపఎన్నిక కాస్ట్ లీ అవుతుందేమోననే చర్చ నడుస్తోంది..!
అంతెందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా.. హుజురాబాద్ ను మించిన ఉపఎన్నిక మునుగోడు అవుతుందని కామెంట్స్ చేశారు. అంటే అందరి దృష్టి ఆకర్శిస్తుందనా? లేదంటే పార్టీలు.. హుజురాబాద్ లో ఖర్చు చేసినదని కంటే ఎక్కువగా డబ్బులు పెడతాయనా? అనే ప్రశ్నలు ఉన్నాయి.
ఓ సారి హుజూరాబాద్ ఉపఎన్నిక చూసుకుంటే.. దేశంలోనే కాస్ట్‌లీ బై పోల్ అని రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది. ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీలు గట్టి ప్రయత్నాలు చేశాయి. ఒక్క ఓటుకు రూ.10 నుంచి రూ.15 వేల వరకు ఇచ్చినట్టుగా ప్రచారం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో అయితే రూ.20 వేలు కూడా నడిచిందట. ఈ విషయాన్ని ఓటర్లు కూడా ఆ సమయంలో చెప్పారు. అక్కడక్కడా డబ్బు దొరికిన ఘటనలు కూడా ఉన్నాయి. ఫ్యామిలీ ప్యాకేజీ కింద డబ్బులు ఇచ్చినట్టుగా కూడా ఆరోపణలు వినిపించాయి. హుజురాబాద్ మండలంలోని ఓ గ్రామానికి ఉప ఎన్నిక సందర్భంగా వెంటనే రోడ్డు పడింది. ఇప్పుడు మునుగోడులో ఇలాంటి పరిస్థితే వస్తుందా.. ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..!
సంబంధిత కథనం