AP CM Jagan : అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు….సీఎం జగన్-ap cm jagan releases funds to new beneficiaries of welfare schemes ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Cm Jagan : అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు….సీఎం జగన్

AP CM Jagan : అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు….సీఎం జగన్

HT Telugu Desk HT Telugu
Jul 19, 2022 01:28 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో అర్హత కలిగిన ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలు వర్తింప చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు సీఎం జగన్మోహన్‌ రెడ్డి ప్రకటించారు. సాంకేతిక కారణాలతో సంక్షేమ పథకాలను అందుకోలేక పోయిన వారితో పాటు కొత్త వారికి నిధులను ముఖ్యమంత్రి విడుదల చేశారు.

ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి
ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి

అధికారం అంటే ప్రజలపై అజమాయిషీ చేయడం కాదని అధికారమంటే ప్రజల మీద మమకారం, ప్రజలందరి సంక్షేమం అన్నారు ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి. అర్హత ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందనివారికి లబ్ధి చేకూరేలా, కొత్త లబ్ధిదారుల ఖాతాలోకి సంక్షేమ నిధుల విడుదల చేసే కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమంలో భాగంగా, మరో 3.10 లక్షల కుటుంబాలకు మేలు కలిగేలా ప్రభుత్వం సంక్షేమ పథకాలను విస్తరించింది. కొత్త లబ్ధిదారుల కోసం రూ.137 కోట్ల నిధులు విడుదల చేశారు. ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోందని, మరో 3 లక్షలు కుటుంబాలకు మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు ప్రకటించారు.

అర్హత ఉన్న ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు ఆగకూడదనే ఉద్దేశంతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. ఏపీలో కొత్తగా సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసిన 3,39,096 మందికి సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఈబీసీ నేస్తం కింద మరో 6,965 మందికి లబ్ధి చేకూరుతుందని, వైఎస్సార్‌ పింఛన్‌ కానుకకు కొత్తగా 2,99,085 మందిని ఎంపిక చేశామని, కొత్తగా 7,051 బియ్యం కార్డులు, 3,035 ఆరోగ్యశ్రీ కార్డులు, కాపు నేస్తం కింద 1249 మంది, వాహనమిత్ర కింద మరో 236 మందికి లబ్ధి మంజూరు చేసినట్లు సీఎం వెల్లడించారు.

న్యాయంగా, అవినీతికి తావులేకుండా, కులం, మతం, వర్గం, పార్టీలకు అతీతంగా, పారదర్శకంగా అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ సంకల్పమని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత సంక్షేమ పాలనకు ఉన్న తేడాను ప్రజలకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉందని సంబంధిత మంత్రులకు, అధికారులకు సీఎం జగన్‌ సూచించారు. అవినీతికి ఆస్కారం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, సంక్షేమ క్యాలండర్ తో పథకాలు అమలు చేస్తున్నామని ఇంటి గడప వద్దే సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు.

IPL_Entry_Point

టాపిక్