Munugode Bypoll : 2023లో గాలి ఎటో.. మునుగోడుతో చెప్పాలనుకుంటున్న పార్టీలు-munugode assembly by election to show which way telangana 2023 is headed know in details ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Munugode Bypoll : 2023లో గాలి ఎటో.. మునుగోడుతో చెప్పాలనుకుంటున్న పార్టీలు

Munugode Bypoll : 2023లో గాలి ఎటో.. మునుగోడుతో చెప్పాలనుకుంటున్న పార్టీలు

Anand Sai HT Telugu
Aug 07, 2022 02:45 PM IST

మునుగోడు ఉపఎన్నికపైనే ఇప్పుడు అందరి కన్ను. రాబోయే ఎన్నికల్లో మార్పు జరగాలంటే ఈ ఎన్నికే కీలకమని పార్టీలు భావిస్తున్నాయి. 2023 ఎన్నికల్లో గాలి ఎటు వీస్తుందో తెలియాలంటే ఈ ఉపఎన్నిక ప్రామాణికమని పార్టీలు నమ్ముతున్నట్టుగా కనిపిస్తోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unplash)

మునుగోడులో పాగా వేసేందుకు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. రాజీనామాతో తెలంగాణ వ్యాప్తంగా చర్చ మెుదలైంది. అక్కడ ఉపఎన్నిక కొట్టినవారే.. వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధిస్తారని విపరీతంగా మాట్లాడుకుంటున్నారు. ఈ ఉపఎన్నిక.. గాలి ఎటు వీస్తుందో.. అటువైపే 2023 ఫలితాలు కూడా సానుకూలంగా ఉంటాయని నమ్ముతున్నారు.

దుబ్బాక, హుజూరాబాద్ లాంటి కీలక స్థానాల ఉపఎన్నికల విజయాన్ని సాధించిన బీజేపీ.. మళ్లీ గట్టి పోటీనిచ్చి ప్రత్యామ్నాయం మేమేనని చెప్పాలనుకుంటోంది. 2023 ఎన్నికలలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని కాషాయ పార్టీ చూస్తోంది. మరోవైపు బీజేపీ పాదయాత్రపై టీఆర్ఎస్ కాస్త గుర్రుగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ కోల్పోయిన స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని పెద్ద పరీక్షకు సిద్ధమవుతోంది. టీఆర్ఎస్ పార్టీ సైతం ఎలాగైనా మునుగోడులో పాగా వేసి తమపై వ్యతిరేకత లేదని చూపించుకోవాలనుకుంటోంది. త్రిముఖ పోరుతో మునుగోడుపైనే అందరి దృష్టి ఉంది.

మునుగోడును ఎలాగైనా సాధించి.. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని చూపించాలనుకుంటోంది హస్తం పార్టీ. ఓడిపోతే కాంగ్రెస్ పార్టీకి నల్గొండ జిల్లాలో సవాలుగా మారవచ్చు. రాజగోపాల్ రెడ్డి సోదరుడు, ఎంపీ వెంకట్ రెడ్డి కూడా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి పెద్ద పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉంది. టీపీసీసీ రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి బ్రదర్స్ విమర్శలు చేయడంతో ఈ ఉప ఎన్నిక వ్యక్తిగతంగా ఆయనకు అగ్నిపరీక్ష అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన పనితీరుపై విమర్శలు చేసిన కోమటిరెడ్డి గడ్డపై.. రేవంత్ ఏం చేస్తారనేది ఇప్పుడు అందరికీ ఆసక్తిగా ఉంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలు సైతం రేవంత్ రెడ్డిని కలవరపెడుతున్నట్టుగా తెలుస్తోంది.

2019లో హుజూర్‌నగర్ సీటును నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. గతేడాది టీఆర్‌ఎస్ నుంచి నాగార్జున సాగర్‌ను చేజిక్కించుకోవడంలోనూ ఎదురుదెబ్బ తగిలింది. 2019లో లోక్‌సభకు ఎన్నికైన తర్వాత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయడంతో హుజూర్‌నగర్‌లో ఉప ఎన్నిక జరిగింది. టీఆర్‌ఎస్ సిట్టింగ్ శాసనసభ్యుడు మరణించడంతో నాగార్జున సాగర్ స్థానం ఖాళీ అయింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానా రెడ్డిపై 18,000 ఓట్లకు పైగా ఆధిక్యంతో గెలుపొందారు. 2018 ఎన్నికల తర్వాత డజను మంది ఎమ్మెల్యేలను కోల్పోయింది కాంగ్రెస్‌ పార్టీ. మునుగోడును గెలిచి.. టీఆర్ఎస్ పార్టీని, బీజేపీని ఎలాగైనా కిందకు నెట్టాలను చూస్తోంది.

ఇంకోవైపు.. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పరాజయం పాలైంది. 2018 ఎన్నికల్లో 119 స్థానాలున్న అసెంబ్లీలో కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్న బీజేపీకి.. ఈ విజయాలు ఊపు తెచ్చాయి. ఇక వచ్చే ఎన్నికల్లో ఫలితాలు మారాలంటే మునుగోడు ఉపఎన్నిక కీలకమని భావిస్తోంది. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాషాయ పార్టీ అని చెబుతూ ఉంది.

హుజూరాబాద్ లో ఈటల మాదిరిగానే.. రాజ‌గోపాల్ రెడ్డితో మునుగోడులో పార్టీకి భారీ విజ‌యాన్ని అందించాల‌ని బీజేపీ అనుకుంటోంది. అందుకే మిషన్ ఆకర్ష్ కోసం ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కీలక నేతలను పార్టీలో చేర్చుకుంటోంది. గత నెలలో హైదరాబాద్‌లో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో కార్యకర్తల్లోనూ జోష్ పెరిగింది. దక్షిణ భారతంలో కర్ణాటక తర్వాత తెలంగాణపై ఆశలు పెట్టుకుంది బీజేపీ.

మరోవైపు అధికార టీఆర్‌ఎస్ పార్టీ.. ఎలాగైనా.. కాషాయయాత్రను అడ్డుకోవాలని చూస్తోంది. దుబ్బాక, హుజూరాబాద్‌లో జరిగిన పొరపాట్ల నుంచి గుణపాఠం నేర్చుకుని టీఆర్‌ఎస్‌ కొత్త వ్యూహంతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఎలాగైనా.. ఈ స్థానాన్ని సాధించి.. కాంగ్రెస్ స్థానంలోనూ మేమే గెలిచామంటే మాపై వ్యతిరేకత లేదని ప్రజల్లోకి ఓ మెసేజ్ పంపాలని చూస్తోంది. దీనికోసం ఇప్పటికే ప్రణాళికలు చేస్తోంది. ఈ గెలుపునే వచ్చే ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా వాడుకోవాలని గులాబీ పార్టీ ఎదురుచూస్తోంది.

IPL_Entry_Point

టాపిక్