Handloom : దేశంలోనే మెుదటిసారి.. తెలంగాణలో నేతన్నకు బీమా-telangana launches insurance scheme nethanna ku bima for weavers ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Handloom : దేశంలోనే మెుదటిసారి.. తెలంగాణలో నేతన్నకు బీమా

Handloom : దేశంలోనే మెుదటిసారి.. తెలంగాణలో నేతన్నకు బీమా

Anand Sai HT Telugu
Aug 07, 2022 05:51 PM IST

దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని చేనేత, పవర్‌లూమ్ కార్మికులకు బీమా సౌకర్యాన్ని కల్పించే ‘నేతన్నకు బీమా’ పథకాన్ని ప్రారంభించింది. దేశంలో ఇలాంటి పథకం మరెక్కడా లేదు.

నేతన్నకు బీమా
నేతన్నకు బీమా (unplash)

మంత్రి కేటీఆర్ ఆదివారంనాడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నకు బీమా పథకాన్ని ప్రారంభించారు. చేనేత రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నందున జీఎస్‌టీని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. చేనేతను ప్రోత్సహించేందుకు జాతిపిత మహాత్మా గాంధీ స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించారని అన్నారు. దురదృష్టవశాత్తు 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత చేనేత వస్త్రాలపై జీఎస్టీ విధించిన తొలి ప్రభుత్వం బీజేపీనేనని అన్నారు.

నేత కార్మికుల్లో విశ్వాసం నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబీమాతో సమానంగా నేతన్నకు బీమాను ప్రవేశపెట్టారు. ఎల్‌ఐసీతో కలిసి అమలు చేస్తున్న బీమా కవరేజీ పథకం వల్ల రాష్ట్రంలోని 80 వేల మంది చేనేత, పవర్‌లూమ్ నేత కార్మికులకు లబ్ధి చేకూరుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. చేనేత కార్మికుడు సహజంగా, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు 10 రోజుల్లో నామినీ ఖాతాలో వేస్తామన్నారు.

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపుపై కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడారు. త్వరలో రామప్ప చీరలను మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఆలయంలోని అందమైన శిల్పకళను వర్ణించే విధంగా రూపొందించిన చీరలను తీసుకువచ్చేలా ప్రణాళికలు చేస్తున్నట్టుగా వెల్లడించారు. తెలంగాణ పథకాల పట్ల ఆకర్షితులై ఒడిశా, కర్నాటక, మధ్యప్రదేశ్‌ల నుంచి ప్రత్యేక బృందాలు అధ్యయన కోసం వస్తున్నట్టుగా మంత్రి కేటీఆర్ తెలిపారు.

'తెలంగాణ ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు, పథకాల ద్వారా చేనేత రంగానికి మద్దతు ఇస్తోంది. దాదాపు అంతరించిపోయిన తేలియా రుమాల్, ఆర్మూర్ సిల్క్ చీరలు, సిద్దిపేట గొల్లభామ చీరలు, హెచ్‌ఐఎంఆర్‌యూ చీరలను పునరుద్ధరించి నేటి తరానికి అందించాం. రాష్ట్ర ప్రభుత్వం 'చేనేత మిత్ర' (ఇన్‌పుట్ సబ్సిడీ లింక్డ్ వేతన పరిహారం పథకం), 'నేతన్నకు చేయూత' (తెలంగాణ చేనేత నేత కార్మికుల పొదుపు నిధి మరియు భద్రతా పథకం), 'పావలా వడ్డీ' పథకం వంటి కొన్ని ప్రధాన కార్యక్రమాలను ప్రారంభించింది. ' అని కేటీఆర్ అన్నారు.

చేనేత కార్మికులను మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2018లో కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డును ఏర్పాటు చేసింది. నేత కార్మికులకు ధృవీకరణ పత్రం, సన్మానంతోపాటు నగదు పురస్కారాన్ని అందజేస్తారు. ఇది గత సంవత్సరం నుండి రూ.10,000 నుంచి రూ.25,000కి పెంచారు. ఈ ఏడాది 28 మంది నేత కార్మికులకు అవార్డు అందజేశారు. అవార్డు ప్రారంభించినప్పటి నుంచి 131 మంది నేత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసి సత్కరించింది. జాతీయ చేనేత దినోత్సవంలో భాగంగా పీపుల్స్ ప్లాజాలో ప్రత్యేక ఎక్స్‌పో కమ్ సేల్ నిర్వహిస్తున్నారు. ఈ ఎక్స్‌పోలో వివిధ రాష్ట్రాలకు చెందిన 100 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.

IPL_Entry_Point