Rajagopal Reddy : ​​​​​​ఎట్టకేలకు క్లారిటీ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా-komatireddy rajagopal reddy resigns to congress party ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rajagopal Reddy : ​​​​​​ఎట్టకేలకు క్లారిటీ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా

Rajagopal Reddy : ​​​​​​ఎట్టకేలకు క్లారిటీ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా

HT Telugu Desk HT Telugu
Aug 02, 2022 08:18 PM IST

కొన్నిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం హాట్ టాపిక్ గా మారింది. ఆయన రాజీనామా చేస్తారా? లేదా? అనే విషయంపై చర్చ నడుస్తూనే ఉంది. దీనిపై తాజాగా క్లారిటీ వచ్చేసింది.

<p>రాజగోపాల్ రెడ్డి రాజీనామా</p>
రాజగోపాల్ రెడ్డి రాజీనామా

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంపై కొన్ని రోజులుగా అందరికీ ఆసక్తి నెలకొంది. ఆయన బీజేపీని పొగుడుతూ.. కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూ వస్తున్నారు. రాజీనామా చేస్తానని చెబుతున్నారు. అయితే ఈ అంశంపై స్పష్టత మాత్రం లేదు. కానీ తాజాగా దీనిపై క్లారిటీ వచ్చేసింది. కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తున్నట్టుగా రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.

తెలంగాణలో కుటుంబపాలన సాగుతోందని రాజగోపాల్ రెడ్డి ఆరోపణలు చేశారు. కేసీఆర్ కోసమే తెలంగాణ తెచ్చినట్టుగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారన్నారు. రాష్ట్రానికి అప్పులకుప్పగా మార్చేశారన్నారు. సామాన్య పేద కుటుంబాల్లో సంతోషం లేదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. 'తెలంగాణ వచ్చాక.. ఫలితాలు కొద్దిమంది మాత్రమే అనుభవిస్తున్నారు. అప్పుల కారణంగా తెలంగాణలో శ్రీలంక తరహా పరిస్థితులు వచ్చినా రావొచ్చు. నా నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఎంత చూసినా.. అవీ ఫలించలేదు.' అని రాజగోపాల్ రెడ్డి అన్నారు.

తన రాజీనామాపై కొన్ని రోజులుగా ఉద్దేశపూర్వంగా తప్పుదారి పట్టిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడులో ఉపఎన్నిక జరిగితే.. మునుగోడులో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని మునుగోడు ప్రజలే నిర్ణయిస్తారన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ అంటే గౌరవం ఉందన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అరాచక పాలనకు చరమగీతం పాడటం బీజేపీకి మాత్రమే సాధ్యమన్నారు.

12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వెళ్లటం తప్పు. వారిని తీసుకోవటం కూడా తప్పు. తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో బందీ అయింది. సీమాంధ్రుల కనుసన్నల్లో కేసీఆర్ ప్రభుత్వం నడుస్తోంది. కొద్ది మంది మాత్రమే తెలంగాణ ఫలితాలు అనుభవిస్తున్నారు. పార్టీలు మారిన వారికి దోచిపెట్టటం మినహా ప్రజలకు మేలు జరగలేదు. నియంత లాగా పరిపాలన సాగుతోంది. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం బలహీనపడటంతో ఏమీ చేయలేకపోయాం. రాజీనామా చేస్తే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుంది. నా మునుగోడు నియోజకవర్గంలో కొందరికైనా మేలు జరుగుతుంది. కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రజల కోసమే ఉన్నారు.

- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ఒకటి రెండు రోజుల్లో స్పీకర్ నుంచి సమయం తీసుకుని తన రాజీనామా లేఖను సమర్పిస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తాను పార్టీ మారే ముందు వేల మంది ప్రజలను కలిశానని చెప్పారు.

Whats_app_banner