Munugodu Bypoll: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ఆయనేనంట...!-who is the trs candidate in munugodu bypoll 2022 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Who Is The Trs Candidate In Munugodu Bypoll 2022

Munugodu Bypoll: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ఆయనేనంట...!

Mahendra Maheshwaram HT Telugu
Sep 25, 2022 07:06 AM IST

trs candidate for munugode: ఓవైపు బీజేపీని ఇరుకున పెట్టేలా పావులు కదపుతున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్... మరోవైపు మునుగోడు విషయంలోనూ జాగ్రత్తగా ముందుకెళ్లేలా కార్యాచరణ రూపొందించే పనిలో పడ్డారు. అయితే అభ్యర్థిపై ప్రకటన చేయని గులాబీ బాస్... పరోక్షంగా అభ్యర్థి ఎవరనే విషయంపై లీకులు ఇస్తున్నారనే టాక్ జోరుగా వినిపిస్తోంది.

మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి..?
మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి..? (HT)

TRS On Munugodu Bypoll: మునుగోడు బైపోల్ వేడి పెరుగుతోంది. ఓవైపు ఇతర కార్యక్రమాలపై దృష్టిపెడుతున్న ప్రధాన పార్టీలు... అదేస్థాయిలో మునుగోడుపై కన్నేస్తున్నాయి. ఎవరికి వారు వ్యూహాల్లో మునిగిపోయారు. గెలుపే లక్ష్యంగా లెక్కలు వేసుకుంటున్నారు. అయితే ఇప్పటికే అభ్యర్థులు ఖరారు చేసేసిన బీజేపీ, కాంగ్రెస్... గ్రౌండ్ లో ప్రచారంపై దృష్టిపెట్టారు. ఇదిలా ఉంటే.... టీఆర్ఎస్ టికెట్ ఎవరికి టికెట్ ఇస్తారు? ఎప్పుడు ప్రకటిస్తారు? అనే దానిపై ఆసక్తి నెలకొంది.

కూసుకుంట్లకే టికెట్.....?

kusukuntla prabhakar reddy: వాస్తవానికి ఉపఎన్నిక తెరపైకి వచ్చిన నాటి నుంచి చాలా మంది పేర్లు వచ్చాయి. అయితే కూసుకుంట్ల వైపే టీఆర్ఎస్ అధినాయకత్వం మొగ్గుచూపినట్లు వార్తలు వచ్చాయి. అధికార పార్టీ అనుకూల పత్రికలోనూ వార్తలు కూడా ప్రచురితం అయ్యాయి. అయితే రెబల్స్ బెడద ఎక్కువగా ఉండటం, సామాజిక సమీకరణాలు, ప్రత్యర్థి పార్టీల వ్యూహల అంచనా వేసిన టీఆర్ఎస్ అధినాయకత్వం... అభ్యర్థి ఎవరనేది ప్రకటించలేదు. అయితే గ్రౌండ్ లో మాత్రం వేగంగా పావులు కదుపుతూనే వస్తోంది. జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి అన్నీ తానై చూస్తు వస్తున్నారు. ఇక నియోజకవర్గ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా ఆయన వెంటే ఉంటున్నారు. ప్రతి కార్యక్రమాన్ని మంత్రి డైరెక్షన్ లో చేపడుతూ వస్తున్నారు.

తాజాగా మునుగోడు నియోజకవర్గ నేతలతో ప్రగతి భవన్ వేదికగా కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సమావేశంలోనే అభ్యర్థిగా కూసుకుంట్లనే అనే లీక్ ఇచ్చినట్లు కూడా సమాచారం. అయితే ఇప్పుడే అధికారికంగా ప్రకటించకుండా... చండూరు వేదికగా తలపెట్టే బహిరంగ సభలో ప్రకటిద్దామని చెప్పినట్లు తెలుస్తోంది.

ఇక నియోజకవర్గంలోనూ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చుట్టుముట్టేస్తున్నారు. ఏ చిన్న కార్యక్రమం జరిగినా వెళ్తున్నారు. అసమ్మతి నేతలను తన వైపు తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారంట..! సామూహిక భోజనాలు, ఆత్మీయ సమ్మేళనాలను కూడా నిర్వహిస్తూ... అన్నివర్గాలకు దగ్గరయ్యేలా పావులు కదిపేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరగుతుండటంతో ఆయనే అభ్యర్థి అని చర్చ జోరుగా నడుస్తోంది.

మొత్తంగా మునుగోడు విషయంలో అచితూచీ అడుగులు వేస్తున్న టీఆర్ఎస్ నాయకత్వం... అభ్యర్థిగా అనుకుంటున్న కూసుకుంట్లనే ఫైనల్ గా ఖరారు చేస్తుందా..? లేక చివరి నిమిషంలో మరో పేరు ప్రకటిస్తుందా అనేది వేచి చూడాలి....!

IPL_Entry_Point

సంబంధిత కథనం