TRS On Munugode : మునుగోడులో టీఆర్ఎస్ 'సామూహిక' స్ట్రాటజీ-trs party planning to win hearts of munugode people ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Trs Party Planning To Win Hearts Of Munugode People

TRS On Munugode : మునుగోడులో టీఆర్ఎస్ 'సామూహిక' స్ట్రాటజీ

మునుగోడు
మునుగోడు

Munugode By Election : మునుగోడు ఉపఎన్నికను టీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా గెలవాలని అనుకుంటోంది. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సైతం.. జోరుగా ప్రచారం చేస్తున్నాయి. అయితే అధికార పార్టీ మాత్రం.. పలు కార్యక్రమాలతో ప్రజలు దగ్గరయ్యేలా ప్రణాళికలు వేస్తోంది.

మునుగోడు ఉపఎన్నిక(Munugode by poll)పై ఎవరికి తోచిన విధంగా వారు రాజకీయం చేస్తున్నారు. ఓటర్లను దగ్గర చేసుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. ప్రచారాలు, విందులు.. ఇలా మునుగోడు కొన్ని రోజులుగా హాట్ టాపిక్ అయింది. ఇందులో భాగంగానే అధికార టీఆర్ఎస్ పార్టీ(TRS Party).. ఓ కొత్త కార్యక్రమంతో ముందుకు వచ్చింది. నియోజకవర్గంలోని ప్రజల దగ్గరకు చేరువయ్యేందుకు సామూహిక భోజన కార్యక్రమాలను పెడుతోంది.

ట్రెండింగ్ వార్తలు

రానున్న ఉప ఎన్నికలో మునుగోడు అసెంబ్లీ సీటు(Munugode Assemby Seat)ను కైవసం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న టీఆర్‌ఎస్ సామూహిక భోజన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నంలో భాగంగానే విమర్శలు వస్తున్నాయి. టీఆర్‌ఎస్ నాయకత్వం ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. బీజేపీ(BJP), కాంగ్రెస్‌(Congress)లతో డూ ఆర్ డై అన్నట్టుగా ఉంది.

2014 ఎన్నికల్లో మునుగోడును టీఆర్ఎస్ గెలుచుకుంది. కానీ 2018లో సీన్ రివర్స్ అయింది. కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి(Komati Reddy Rajagopal Reddy) చేతిలో ఓడిపోయింది. తరువాత రాజ్‌గోపాల్ రెడ్డి అసెంబ్లీ, కాంగ్రెస్‌ను విడిచిపెట్టి ఈ సంవత్సరం ఆగస్టులో బీజేపీలో చేరడం ద్వారా ఉప ఎన్నిక(By Poll) అనివార్యమైంది. ఎలాగైనా గెలవాలని అనుకుంటున్న టీఆర్ఎస్.. ప్రజల దగ్గరకు వెళ్తోంది.

పార్టీ ప్రచారంలో భాగంగా ప్రారంభించిన సామూహిక మధ్యాహ్న భోజన కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ప్రతి మండలంలో వారం రోజుల పాటు ప్రజలతో కలిసి భోజనం చేయనున్నారు. వారి బాధలను తెలుసుకుంటారు. పట్టణాలు, గ్రామాల్లో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షిస్తారు. ప్రజలు తీసుకువచ్చే సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తారు.

తొలుత సామూహిక మధ్యాహ్న భోజన కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ మండలంలోని ప్రతి గ్రామం నుంచి వేలాది మందిని భోజనానికి ఆహ్వానించారు. సామూహిక మధ్యాహ్న భోజన కార్యక్రమాల ఏర్పాట్లను మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి(Kusukunta Prabhakar), ఎమ్మెల్సీ టి.రవీందర్‌రావు పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా ప్రజలను అలరించేలా సాంస్కృతిక కార్యక్రమాలు(Cultural Programmes) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

'ఈ కార్యక్రమాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలనేది మొత్తం ఆలోచన. ఇందులో మధ్యాహ్న భోజనం చేయడం మాత్రమే కాదు. ప్రజల ఫిర్యాదులను వినడం, గ్రామాలు, పట్టణాలలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలును సమీక్షిస్తాం. ఏవైనా లోటుపాట్లు గుర్తించడం వంటివి ఉంటాయి. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల లబ్ధిదారులు తమ ఆలోచనలు, అనుభవాలను పంచుకుంటారు. ప్రభుత్వం నుండి ఏం కావాలో అడుగుతారు.' అని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు.

షెడ్యూల్ ఇదే

సెప్టెంబర్ 21: చండూరు మండలం

సెప్టెంబర్ 22: నారాయణపూర్ మండలం

సెప్టెంబర్ 23: మర్రిగూడ మండలం

సెప్టెంబర్ 25: బతుకమ్మ ఉత్సవాల కారణంగా మధ్యాహ్న భోజన కార్యక్రమం లేదు

సెప్టెంబర్ 24: మునుగోడు మండలం

సెప్టెంబర్ 26: నాంపల్లి మండలం

WhatsApp channel