Godavari Floods : నలభై రోజులుగా నీటిలోనే…… ముంపులోనే లంక గ్రామాలు-godavari islands in floods water since 40days ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Godavari Islands In Floods Water Since 40days

Godavari Floods : నలభై రోజులుగా నీటిలోనే…… ముంపులోనే లంక గ్రామాలు

HT Telugu Desk HT Telugu
Aug 20, 2022 11:40 AM IST

గోదావరికి వరుస వరదలు పోటెత్తడంతో లంక గ్రామాలు విలవిలలాడుతున్నాయి. నెలన్నర వ్యవధిలో రెండు సార్లు ఊళ్లకు ఊళ్లు గోదావరి ముంపుకు గురయ్యాయి. రోజుల తరబడి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ప్రజలు వరద నీటిలోనే నానుతూ బతుకు సాగిస్తున్నారు.

గోదావరి వరదలతో లంక గ్రామాల విలవిల
గోదావరి వరదలతో లంక గ్రామాల విలవిల

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పడుతున్నా లంకల్లో ముంపు మాత్రం తగ్గడం లేదు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండటంతో 40 రోజులుగా లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు జలదిగ్భంధంలోనే కొనసాగుతున్నాయి. వరద తగ్గుతున్నా, గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో లంకవాసుల వరద కష్టాలు మాత్రం తగ్గడం లేదు. శుక్రవారం రాత్రికి భద్రాచలం వద్ద 47.20 అడుగుల నీటిమట్టం నమోదు అయ్యింది. 24 గంటలకు కేవలం నాలుగు అడుగుల నీటిమట్టం తగ్గింది. భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

పోలవరం ప్రాజెక్టు అప్పర్‌ స్కిల్‌ వే వద్ద 34.04 మీటర్లు, దిగువ స్పిల్‌ వే వద్ద 25.59మీటర్ల నీటి మట్టం నమోదైంది. 15 గేట్ల ద్వారా నీటిని 11.92 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరంలో కాటన్‌ బ్యారేజ్‌ వద్ద 15 అడుగుల నీటిమట్టం నమోదైంది. గత 24 గంటల్లో 0.70 అడుగుల నీటిమట్టం మాత్రమే తగ్గింది. 11.79 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా సముద్రంలోకి 14.80 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

పోలవరం ముంపు మండలాల్లో విలీన గ్రామాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టకపోవడంతో వరద బాధితులు జ్వరాల బారిన పడుతూ ఆసుపత్రులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. వరద నీరు చుట్టుముట్టడంతో లంక గ్రామాల్లో తాగునీటి కొరత సమస్య ఏర్పడింది. బి.ఆర్‌.అంబేద్కర్‌ కోననీమ, తూర్పుగోదావరి జిల్లాలోని 35 లంక గ్రామాలు ఇంకా ముంపులోనే ఉండగా, నదీ తీరానికి దగ్గరగా ఉన్న లంక గ్రామాలలో ఎనిమిది నుంచి పది అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది.

సఖినేటిపల్లి లంక, రాజోలు లంక, నున్నవారి బాడవ, పి.గన్నవరం మండలంలోని లంక గ్రామాల్లో తాగునీటి కొరత తీవ్రంగా ఉంది. తాగునీటిని కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉందని, అధికారులెవరు ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ముంపు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినవిల్లి, పి.గన్నవరం, మామిడికుదురు మండలాల్లోని లంక గ్రామాల ప్రజలు పడవలపైనే ప్రయాణాలు సాగిస్తున్నారు.

నానాటికి పెరుగుతున్న జ్వర బాధితులు...

40 రోజులుగా లంక గ్రామాల ప్రజలు నీటిలో ఉండడం వలన వివిధ రకాల రోగాల బారిన పడుతున్నారు. జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రులలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. చింతూరు ప్రభుత్వాసుపత్రికి రోజుకు 223 మంది రోగులు వస్తున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకు 54 డెంగీ కేసులు నమోదైనట్లు చింతూరు వైద్యాధికారులు చెబుతున్నారు. ఏలూరు జిల్లాలోని కుకునూరు, దాచారం, వింజరం, ముత్యాలంపాడు గ్రామాలు 20 రోజులుగా ముంపులోనే ఉండడంతో 15 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి.

గోదావరి, శబరి నదులు శాంతించడంతో చింతూరు, విఆర్‌ పురం, ఎటపాక, కూనవరం మండలాల్లో వరద కొద్దిగా తగ్గుముఖం పట్టంది. విలీన మండలాల్లోని రోడ్లన్నీ జలదిగ్భంధంలోనే ఉండగా మళ్ళీ వర్షాలు కురుస్తుండడంతో వరద పెరగవచ్చనే భయం ప్రజల్లో నెలకొంది. విఆర్‌ పురం మండంలోని లోతట్టు ప్రాంతాల గిరిజనులు … శ్రీరామగిరి, పోచారం, జీడిగుప్ప, కొటారుగొమ్ము, ఇప్పూరు, ములకపల్లిలో ఉంటున్నారు. పల్లెపాలెం, అయోధ్యలంక, పుచ్చల్లంక, మర్రిమూల, భీమలాపురం పంచాయతీల పరిధిలో వరద నీరు ఇంకా నాలుగు అడుగుల మేర ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు నీట మునగడంతో భీమలాపురం, కాపులపాలెం గ్రామాల్లో విద్యుత్తు సరఫరా లేదు. లంక గ్రామాల్లో1700 కుటుంబాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి లంక గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నా ప్రభుత్వ సాయం అందరికి అందడం లేదనే విమర్శలున్నాయి. యలమంచిలి మండలంలో ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి నిత్యావసరాలు, తాగునీరు, పశువులకు అవసరమైన గ్రాసాన్ని ఇంజిన్‌ పడవల ద్వారా తెచ్చుకుంటున్నారు.

IPL_Entry_Point

టాపిక్