Munugode By Election : మునుగోడులో ఈ పనులు చేస్తే టీఆర్‌ఎస్‌కు కలిసి వచ్చే ఛాన్స్-if trs focus on pending works and unfulfilled promises in munugode it will be useful in bypoll ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  If Trs Focus On Pending Works And Unfulfilled Promises In Munugode It Will Be Useful In Bypoll

Munugode By Election : మునుగోడులో ఈ పనులు చేస్తే టీఆర్‌ఎస్‌కు కలిసి వచ్చే ఛాన్స్

Anand Sai HT Telugu
Aug 23, 2022 10:09 PM IST

Munugode Bypoll : మునుగోడు ఉపఎన్నిక వేడి రాజుకుంటోంది. ప్రధాన పార్టీలన్నీ అక్కడే తిష్ట వేస్తున్నాయి. ఎలాగైనా.. గెలవాలని ప్రణాళికలు వేస్తున్నాయి. అందివచ్చే ఏ అవకాశాన్ని వదులుకోవట్లేదు. అయితే అక్కడున్న పెండింగ్ ప్రాజెక్టులు, హామీలను ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ పూర్తి చేస్తుందా? అనే చర్చ నడుస్తోంది.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ (Stock Photo)

సీఎం కేసీఆర్ మీటింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన, రేవంత్ రెడ్డి ప్రచారం.. ప్రధాన పార్టీల నేతలందరూ మునుగోడు వైపే చూస్తున్నారు. ఇప్పటికే జంపింగ్స్ తో అక్కడ రాజకీయం వేడి రాజుకుంది. మునుగోడు నియోజకవర్గంలో గెలిచేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ మునుగోడుపై ఇప్పుడు ఎలాంటి వైఖరి తీసుకుంటుందనే చర్చ జరుగుతోంది. పెండింగ్ ప్రాజెక్టులు, హామీలపై దృష్టి సారిస్తే టీఆర్ఎస్ కు కలిసి వస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెండింగ్‌లో ఉన్న రోడ్ల నిర్మాణాల నుంచి అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనుల వరకు టీఆర్ఎస్ ఫోకస్ చేయాల్సి ఉంది. లేదంటే ఉపఎన్నికల్లో ఎదురీదేందుకు సిద్ధంగా ఉండాలని అభిప్రాయం ఉంది.

ట్రెండింగ్ వార్తలు

2015 జూన్‌లో నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌ సమస్యను ఎదుర్కొనేందుకు కీలకమైన డిండి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకానికి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. మునుగోడు మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామంలో ప్రాజెక్టు ఉంది. దేవరకొండ, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాలకు తాగునీరు, సాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భాగంగా చర్లగూడెం వద్ద రిజర్వాయర్ రావాల్సి ఉంది. దానితో పాటు మరో నాలుగు రిజర్వాయర్లను నిర్మించాలని నిర్ణయించారు.

డిండి ఎత్తిపోతల పథకం పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని, పనులను వేగవంతం చేయాలని గత ఏడాది జనవరిలో జరిగిన సమీక్షా సమావేశంలో జలవనరుల శాఖను ఆదేశించారు కేసీఆర్. ప్రాజెక్టు కింద 13,093 ఎకరాల భూమిని సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంలోని ప్రజలకు పూర్తి పునరావాసం ఇంకా అందలేదు. మార్కెట్‌ ధర కంటే తమ భూమికి ఇచ్చే పరిహారం చాలా తక్కువగా ఉందని స్థానికులు భావిస్తున్నారు. సరైన పరిహారం కోసం చాలా కాలంగా పోరాడుతున్నారు.

ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టులకు ప్రాధాన్యమిచ్చి పూర్తి చేయాలని, పెండింగ్‌లో ఉన్న పరిహారం, పునరావాస పనులను కూడా త్వరగా పరిష్కరించాలని టీఆర్‌ఎస్‌కు ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఏడు మండలాలు ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోకి గట్టుపల్ మండలం చేరింది. నాంపల్లి మండలం కిష్ణరాంపల్లి చర్లగూడెం ప్రాజెక్టు వల్ల మర్రిగూడ మండల ప్రజల్లో అసంతృప్తి నెలకొని ఉంది. మిగతా మండలాల్లో కూడా తమ సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. చండూరు మండలంలో రోడ్ల దుస్థితి దారుణంగా ఉంది. చేనేత కార్మికులకు సంక్షేమ పథకాలు అందకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం కొత్తగా ప్రకటించిన నేతన్న బీమా పథకం కలిసి వచ్చే అంశమని ప్రభుత్వం అనుకుంటోంది.

నూతనంగా ప్రకటించిన గట్టుపల్ మండల ప్రజలు మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. నాంపల్లి మండలంలో ప్రజారవాణా సేవలు మరింత మెరుగుపడాలని ప్రజలు భావిస్తున్నారు. ఏడు మండలాల్లో చూసుకుంటే.. నాంపల్లి మండల ప్రజలు ప్రభుత్వం నుంచి చాలా ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది.

మునుగోడులో రైతులు అభివృద్ధిని ఆశిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం వర్షాలపైనే సాగు చేస్తున్నారు. ఈ ప్రాంత ప్రజలు తీసుకున్న పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేయాలనే డిమాండ్ ఉంది. ఈ ఉపఎన్నికతో రోడ్లు వస్తాయని ప్రజలు అనుకుంటున్నారు. ఇక చౌటుప్పల్ మండలం విషయానికి వస్తే.. వలస జనాభా ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ చాలా వరకు కెమికల్ కంపెనీలు ఉన్నాయి. ఈ మండలంలో కూడా పింఛన్లు, రేషన్ కార్డుల కోసం చాలా మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇక్కడ డిమాండ్లను ప్రభుత్వం టార్గెట్ చేస్తే.. టీఆర్ఎస్ వైపే గాలి వీచే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయం ఉంది.

ఓ వైపు మునుగోడులో పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. రాజకీయ నేతలు క్యూలు కడుతున్నారు. చేరికలపై టీఆర్ఎస్ పార్టీ గురిపెట్టింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎంపీటీసీ, సర్పంచ్ లను పార్టీలోకి తీసుకుంది. మిగతా పెండింగ్ పనులు, హామీలపై దృష్టిపెడితే టీఆర్ఎస్ కు అవకాశాలు ఉన్నాయనే చర్చ నడుస్తోంది. మునుగోడు ప్రజల పల్స్ ఈ పనులతో పట్టుకోవచ్చని అంటున్నారు కొంతమంది. మునుగోడు ప్రజలపై ప్రభుత్వం ఎలాంటి వరాల జల్లు కురిపిస్తుందో చూడాల్సిందే.

IPL_Entry_Point

సంబంధిత కథనం