TRS Alliance : వామపక్షాల పొత్తుతో టీఆర్ఎస్ నేతలు హర్ట్ అవుతున్నారట
Munugode By Election : మునుగోడులో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని.. అధికార టీఆర్ఎస్ పార్టీ వామపక్షాలతో పొత్తుపెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ పొత్తు కొనసాగుతుందా? లేదా అనే విషయం పక్కన పెడితే.. కొంతమంది అధికార పార్టీ నేతలు మాత్రం హర్ట్ అవుతున్నారట.
టీఆర్ఎస్, వామపక్షాల మధ్య పొత్తుపై పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో గెలిచిన సెగ్మెంట్లలో ఎన్నికల అవకాశాలపై వామపక్షాల నేతలు చర్చలు ప్రారంభించారు. 2009లో పాలేరు నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రామిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో ఓడిపోయారు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఇప్పుడు ఆయన ఆ స్థానంపై కన్నేశారని తెలుస్తోంది.
పాలేరు, భద్రాచలం, వైరా, కొత్తగూడెం కమ్యూనిస్టులు కోరుతున్నట్టుగా తెలుస్తోంది. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సాంబశివరావు 2009 ఎన్నికల్లో కొత్తగూడెం స్థానం నుంచి గెలుపొందారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అక్కడ బరిలోకి దిగాలి చూస్తున్నారట.
వీరభద్రం సూచన మేరకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపై అధికార పార్టీతో సీపీఎం అవగాహన కుదుర్చుకుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు సీపీఎం మద్దతు ప్రకటించింది. అయితే సీపీఎంలోని బహుజనులు టీఆర్‌ఎస్‌తో పొత్తుపై గుర్రుగా ఉన్నారట. వీరిలో కొందరు బహుజన కమ్యూనిస్టు పార్టీని స్థాపించేందుకు పార్టీని వీడాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ కారణంగా ఎన్నికల పొత్తు విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయడం తెలివైన పని అని సీపీఐ(ఎం) నాయకత్వం భావించింది. ఇకపై ప్రెస్‌మీట్‌లలో కాకుండా పార్టీ వేదికలపైనే ముందుగా పొత్తును ప్రకటించాలని పార్టీ నిర్ణయించింది.
ఇందులో భాగంగానే.. తమ్మినేని వీరభద్రం.. మునుగోడు వరకు మాత్రమే అధికార పార్టీతో ఎన్నికల పొత్తు అని ప్రకటించారని చర్చ నడుస్తోంది. పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి, వైరా ఎమ్మెల్యే రాములునాయక్, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు ఈ సీట్లపై వామపక్షాల డిమాండ్‌ను టీఆర్‌ఎస్ హైకమాండ్ అంగీకరిస్తే టికెట్ గల్లంతు కానుంది. ఇటు ఎమ్మెల్యేలు కానీ అటు టీఆర్‌ఎస్ నేతలు కానీ ఈ దశలో ఎలాంటి కామెంట్స్ చేసేందుకు సిద్ధంగా లేరు.
అధికార పార్టీతో పొత్తుపై సీపీఐ తన వైఖరిని స్పష్టంగా చెప్పిందని టీఆర్‌ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ అంటన్నారు. సీపీఐ(ఎం) కూడా అందుకు అంగీకరించి ముందుగా మునుగోడులో మద్దతు పలికిందని చెబుతున్నారు. బీజేపీ తమకు ప్రధాన శత్రువు అని, 2023 ఎన్నికలలో అధికార పార్టీతో సీపీఎం కచ్చితంగా కలిసి వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీట్ల పంపకాల విషయానికొస్తే, కాంగ్రెస్ చేతిలో మధిర, భద్రాచలం వంటి రెండు సీట్లు మాత్రమే ఉన్నాయి. వామపక్షాలకు ఏయే సీట్లు ఇవ్వాలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తుది నిర్ణయం తీసుకుంటారని మధుసూదన్ అన్నారు.
2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు పొత్తులపై టీఆర్‌ఎస్ నాయకత్వం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో ముందస్తు ఎన్నికల పొత్తులు పెట్టుకుంది టీఆర్ఎస్. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి టీఆర్‌ఎస్ సొంతంగా అన్ని ఎన్నికల్లో పోటీ చేసింది. 2004లో కాంగ్రెస్, వామపక్షాలతో ఎన్నికల ముందు పొత్తు బాగానే పని చేయగా, 2009లో టీడీపీ, వామపక్షాలతో జతకట్టి ఘోర పరాజయం పాలైంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు కుదిరితే.. కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ అసెంబ్లీ స్థానం, నల్గొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ స్థానాలు, మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్, ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి స్థానాలను కూడా కమ్యూనిస్టులు అడిగే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. హైదరాబాద్ లోని నాంపల్లి, మెదక్ జిల్లాలోని నర్సాపూర్ సీటును కూడా వామపక్షాలు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది.
నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో తమ పార్టీకి బలమైన క్యాడర్ బేస్ ఉందని సీపీఎం ఏడెనిమిది స్థానాలను కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ స్థానాలన్నీ ప్రస్తుతం టీఆర్‌ఎస్ ఆధీనంలో ఉండడంతో వామపక్షాల ఎత్తుగడలతో అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మద్దతుదారులు ఆందోళన చెందుతున్నారు. పార్టీ నాయకత్వం తమ స్థానాలను ఒకవేళ వామపక్షాలకు వదిలివేస్తే తమ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు.