Goa politics: 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి.. అక్కడ కాంగ్రెస్ దాదాపు ఖాళీ
Congress MLA's join BJP in Goa: పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ పార్టీ బలోపేతం కోసం ‘భారత్ జోడో యాత్ర’ పేరుతో దేశవ్యాప్త పాదయాత్ర చేస్తుండగా.. మరోవైపు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున బీజేపీ లో చేరుతున్నారు.
Congress MLA's join BJP in Goa: కాంగ్రెస్ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు బుధవారం బీజేపీలో చేరారు. గోవాలో కాంగ్రెస్ కు ఉన్న మొత్తం 11 మంది ఎమ్మెల్యేల్లో మెజారిటీ ఎమ్మెల్యేలు కాషాయ శిబిరంలో చేరారు.
Congress MLA's join BJP in Goa: కాంగ్రెస్ కు భారీ ఎదురుదెబ్బ
చిన్న పర్యాటక రాష్ట్రం గోవాలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్రంలో పార్టీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది బుధవారం బీజేపీలో చేరారు. దాంతో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ కు ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేతల్లో మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ కూడా ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలు బేషరతుగానే బీజేపీలో చేరారని బీజేపీ గోవా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సదానంద్ షేట్ తన్వాడే వెల్లడించారు.
Congress MLA's join BJP in Goa: ఫుల్ మెజారిటీ..
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల చేరికతో గోవాలో అధికార బీజేపీకి తిరుగులేని మెజారిటీ సొంతమైంది. 40 మంది సభ్యుల గోవా అసెంబ్లీలో, తాజాగా చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలుపుకుని, ప్రస్తుతం బీజేపీకి 33 మంది సభ్యుల మద్దతు ఉంది. వారిలో ముగ్గురు స్వతంత్రులు, ఇద్దరు మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ సభ్యులు ఉన్నారు. అలాగే, కాంగ్రెస్ సభ్యుల చేరికతో బీజేపీ బలం 20 నుంచి 28 కి చేరింది.
Congress MLA's join BJP in Goa: కాంగ్రెస్ చోడో యాత్ర
ఈ సందర్భంగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రెస్ మీట్ నిర్వహించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను ఎద్దేవా చేస్తూ.. ‘గోవా నుంచి కాంగ్రెస్ చోడో యాత్ర` ప్రారంభమయిందని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో గోవాలోని రెండు లోక్ సభ స్థానాలను గెల్చుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం గోవాలోని రెండు లోక్ సభ స్థానాల్లో ఒకటి బీజేపీ, మరొకటి కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయి.