Munugodu Bypoll: మునుగోడులో ‘గ్రేటర్ వ్యూహం’.. స్వయంగా రంగంలోకి కేసీఆర్!-kcr seriously focus on munugodu by election 2022 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Kcr Seriously Focus On Munugodu By Election 2022

Munugodu Bypoll: మునుగోడులో ‘గ్రేటర్ వ్యూహం’.. స్వయంగా రంగంలోకి కేసీఆర్!

HT Telugu Desk HT Telugu
Oct 05, 2022 11:04 AM IST

Munugodu Bypoll: ఓవైపు బీజేపీని ఇరుకున పెట్టేలా పావులు కదపుతున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్... మరోవైపు మునుగోడు విషయంలోనూ జాగ్రత్తగా ముందుకెళ్లేలా కార్యాచరణ రూపొందించే పనిలో పడ్డారు. తాజాగా ఆ నియోజకవర్గ నేతలతో భేటీ అయిన కేసీఆర్... పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. స్వయంగా ఆయన కూడా ఓ గ్రామ బాధ్యతలను చూడనున్నారు.

మునుగోడుపై కేసీఆర్ సీరియస్ ఫోకస్
మునుగోడుపై కేసీఆర్ సీరియస్ ఫోకస్ (HT)

KCR On Munugodu Bypoll: మునుగోడు బైపోల్ వేడి పెరుగుతోంది. నోటిఫికేషన్ రావటంతో ప్రధాన పార్టీలు వేగంగా పావులు కదిపే పనిలో పడ్డాయి. ఎవరికి వారు వ్యూహాల్లో మునిగిపోయారు. గెలుపే లక్ష్యంగా లెక్కలు వేసుకుంటున్నారు. అయితే ఇప్పటికే అభ్యర్థులు ఖరారు చేసేసిన బీజేపీ, కాంగ్రెస్... గ్రౌండ్ లో ప్రచారంపై దృష్టిపెట్టాయి. ఇదిలా ఉంటే.... టీఆర్ఎస్ టికెట్ ఎవరికనే దానిపై ఇవాళ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే తాజాగా మునుగోడు నేతలతో చర్చలు జరిపిన కేసీఆర్... కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. గ్రేటర్ వ్యూహాన్ని మునుగోడులో కూడా అమలు చేయాలని స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

మంగళవారం ప్రగతిభవన్‌లో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన భేటీకి నల్గొండ జిల్లామంత్రి జగదీశ్‌రెడ్డి, జిల్లా టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. ఉప ఎన్నికను ఏ మాత్రం తేలికగా తీసుకోవద్దని కేసీఆర్ సూచించారంట..! ప్రధానంగా సంక్షేమ పథకాలపై ఫోకస్ పెట్టాలని... దళిత బంధు పై ఊరూరా ప్రచారం నిర్వహించాలని చెప్పినట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బాధ్యతలు అప్పగించినట్లు… మునుగోడులోనూ ఇదే తరహా ఫార్ములాను పాటించబోతున్నట్లు నేతలతో చెప్పినట్లు తెలిసింది. దసరా మరునాడు నుంచి మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి పార్టీ ఇన్‌చార్జీ లు తమ బృందాలతో తరలివస్తున్నట్లు కేసీఆర్‌ వెల్లడించారని సమాచారం.

మునుగోడు బైపోల్ ను కేసీఆర్ సవాల్ గా తీసుకున్నారు. మొత్తం పార్టీ తరపున ఎమ్మెల్యేలకు ఒక్కో గ్రామానికి ఇంఛార్జ్ గా నియమించనున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్ కూడా ఓ గ్రామాని( మర్రిగూడ మండలం లెంకలపల్లి )కి బాధ్యులుగా వ్యవహరించనున్నారు. అయితే గ్రౌండ్ లెవల్ స్వయంగా ఉండకపోయినా.... ఆయన మార్గనిర్దేశకంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలోనే బృందం అక్కడ ప్రచార కార్యక్రమాలు చూస్తారు. మొత్తం నియోజకవర్గా న్ని 86 యూనిట్లుగా విభజించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలకు ప్రచార, సమన్వయ బాధ్యతలు అప్పగించారు.

బీఆర్ఎస్ పేరుతోనే పోటీ...?

కొత్త పార్టీ (బీఆర్ఎస్) పేరుతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికకు వెళ్లనున్నట్లు సమాచారం. బుధవారం జాతీయ పార్టీ ప్రకటనతోపాటు మునుగోడు అభ్యర్థిని ప్రకటించనున్నట్లు తెలియవచ్చింది. ఇవాళ సమావేశం తర్వాత... వీటన్నింటిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మొత్తంగా ఎలాగైనా మునుగోడులో గెలిచి జాతీయ పార్టీగా.. తొలి విజయాన్ని ఖాతాలో వేసుకోవాలనే యోచనలో గులాబీ బాస్ కేసీఆర్‌ ఉన్నారని తెలుస్తోంది. ఇందుకోసం పార్టీ ముఖ్య నేతలంతా అక్కడే మోహరించేలా ప్లాన్ చేశారంట. ఇక ఎన్నికలో కేటీఆర్, మంత్రి హరీశ్ రావు కూడా పలు మండలాల బాధ్యతలను చూడనున్నారు.

IPL_Entry_Point